సర్గాస్సమ్ ఆల్గే: టన్నుల కొద్దీ పెరిగే ఈ సముద్రపు నాచుతో ఎన్ని కష్టాలో తెలుసా?

అది 1492. క్రిస్టోఫర్ కొలంబస్‌ అట్లాంటిక్ సముద్రంలో అన్వేషణ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్యను అన్వేషకులు అంచనా వేయలేదు. కొలంబస్ పడవకు ఎదురుగా మైళ్ల దూరం వరకు దట్టంగా పేరుకుపోయిన సముద్రపు నాచు ఉంది.

ఆ సముద్రపు నాచులో తమ బోటు చిక్కుకుపోయి, మునిగిపోతుందేమోనని నావికులు భయపడ్డారు. 500 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా సర్గాస్సమ్‌ ఆల్గేగా పిలిచే లక్షల కొద్ది టన్నుల సముద్ర నాచు మరోసారి ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది.

సర్గాస్సమ్‌గా పిలిచే ఈ సముద్రపు పాచి కరేబియన్ దీవులకు, అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతానికి రికార్డు స్థాయిలో నాచు చేరుతుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఇది పెను ముప్పుగా మారుతుంది.

అట్లాంటిక్‌లోని ఉష్ణమండలమంతా విస్తరించిన సర్గాస్సమ్

సర్గాస్సమ్ గురించి వివరణాత్మకంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు, ఫ్లోరిడా యూనివర్సిటీలోని సముద్ర శాస్త్ర ప్రొఫెసర్ చౌన్మిన్ హుతో బీబీసీ మాట్లాడింది. ఇరవై ఏళ్లుగా చౌన్మిన్ హు సర్గాస్సమ్ గురించి అధ్యయనం చేస్తున్నారు. ఈ సర్గాస్సమ్ ఆల్గే పాచి మాదిరి నీళ్లలో పెరుగుతుందని అన్నారు.

‘‘ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైన సర్గాస్సో సముద్రంలో దీన్ని మనం గుర్తించవచ్చు. ఈ ఆల్గే తర్వాతనే దీనికి సర్గాస్సో సముద్రంగా పేరు వచ్చింది. సర్గాస్సమ్‌కు ఎలాంటి విత్తనాలు ఉండవు. చిన్న చిన్న రెమ్మలే, క్రమంగా పెరుగుతూ సముద్ర ఉపరితలమంతా విస్తరిస్తాయి.

ఈ ఆల్గే ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. లేత పసుపుపచ్చ, గోధుమ రంగులో ఇవి కనిపిస్తుంటాయని చౌన్మిన్ చెప్పారు. సర్గాస్సమ్‌ను ఎలా అధ్యయనం చేస్తున్నారో ఆయన వివరించారు.

‘‘సర్గాస్సమ్ రంగు సముద్ర జలాల రంగుకు భిన్నంగా ఉంటుంది. అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల ద్వారా మేం అట్లాంటిక్ మహాసముద్రంపై ఓ కన్నేసి ఉంచాం. ప్రతిరోజూ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఫోటోలు తీస్తూ ఉంటాం. చిన్న మొత్తాలలో సర్గాస్సమ్ ఉన్నా, ఫోటోల ద్వారా గుర్తిస్తాం. టెక్నాలజీ ద్వారా ఏ ప్రాంతంలో ఎంత సర్గాస్సమ్ ఉందో లెక్కలు తీస్తాం. ఈ డేటాను సేకరించడం ద్వారా సగటున నెలకు ఇది ఎంత పెరుగుతుందో తెలుసుకుంటున్నాం’’ అని చౌన్మిన్ చెప్పారు.

2011లో పెద్ద మొత్తంలో సర్గాస్సమ్ పెరిగినట్లు తాము గుర్తించామన్నారు. దీన్ని గ్రేట్ సర్గాస్సమ్ బ్లూమ్‌గా అభివర్ణించారు.

‘‘పశ్చిమాఫ్రికా నుంచి మెక్సికో వరకు సర్గాస్సమ్ బెల్ట్ విస్తరిస్తున్నట్లు మేం గుర్తించాం. 2011 నుంచి ప్రతి ఏడాది వేసవి కాలంలో ఇది జరుగుతోంది. సర్గాస్సమ్ కొన్ని ప్రాంతాల్లో చాలా దూరం వరకు విస్తరించి ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇది సరికొత్త విషయం. ఎందుకంటే, అంతకుముందు సర్గాస్సమ్ కేవలం సర్గాస్సో సముద్రంలో మాత్రమే ఉండేది. ప్రస్తుతం అట్లాంటిక్‌లోని ఉష్ణమండలమంతా ఇది విస్తరించి ఉన్నట్లు గుర్తించాం’’ అని చౌన్మిన్ హు చెప్పారు.

సర్గాస్సమ్ 2011 నుంచి ఎందుకు కొత్త ప్రాంతాల్లో కూడా పెరుగుతుందో తెలియడం లేదు.

2010 నుంచి వాతావరణంలో పలు మార్పులు రావడం కూడా దీనికి ఒక కారణమని అన్నారు చౌన్మిన్.

‘‘సముద్ర జలాల్లో బలమైన గాలులు, బలమైన ప్రవాహాలు పశ్చిమం నుంచి తూర్పుకు వీస్తున్నాయి. ఈ బలమైన గాలులు, ప్రవాహాలు సర్గాస్సో సముద్రంలోని సర్గాస్సమ్‌ను అట్లాంటిక్ ఉష్ణమండల ప్రాంతం దిశగా నెడుతున్నాయి. సూర్యుని నుంచి ఈ ఆల్గేకు కావాల్సిన వేడి, పోషకాలు లభిస్తున్నాయి. దీంతో ఈ సముద్రపు నాచు వేగంగా పెరుగుతుంది. ఇది కూడా ఒక కారణం కావొచ్చు’’ అని చౌన్మిన్ వివరించారు.

‘‘ఏదైనా కచ్చితంగా చెప్పాలంటే, సర్గాస్సమ్‌కు చెందిన సరిపడా శాంపుల్స్ మా దగ్గర లేవు. తీర ప్రాంతానికి కొట్టుకువచ్చే సర్గాస్సమ్‌లో కాలుష్య కారకాలు ఉన్నాయి. మహాసముద్రం మధ్యలో ఈ కాలుష్య కారకాలు తక్కువగా ఉన్నాయి’’ అని అన్నారు.

గత ఐదేళ్లలో సర్గాస్సమ్ ఆల్గే మొత్తం అంతకుముందు కంటే ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది ఇది పెరుగుతుందా? లేదా? అనేది చెప్పడం కష్టం. కానీ, వచ్చే ఐదు లేదా పదేళ్లలో మాత్రం ఇది పెరుగుతుందని అంచనావేస్తున్నామని తెలిపారు.

ఆల్గే ప్రయోజనాలు

సముద్ర జీవవైవిధ్యానికి సర్గాస్సమ్ ఎంతో ప్రయోజనకరమని సర్గాస్సో సీ కమిషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డేవిడ్ ఫ్రీస్టోన్ అన్నారు.

‘‘సర్గాస్సో సముద్రం ఎక్కడుంది? అట్లాంటిక్‌లో బెర్ముడా దీవుల వ్యాప్తంగా ఇది విస్తరించింది. బెర్ముడా దీవులు కరేబియన్ దీవుల్లో భాగమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇవి ఉత్తరంలో ఉన్నాయి. ‘‘సరిహద్దులు లేని సముద్రం’’ అని కూడా వీటిని పిలుస్తారు.

బెర్ముడా దీవుల చుట్టూ ఉన్న నీరు సుమారు 4 వేల మీటర్ల లోతులో ఉంటుంది. నీటిపైన సర్గాస్సమ్ ఆల్గే తేలుతూ ఉండటం వల్ల, దీని కింద వివిధ రకాల చిన్న, పెద్ద చేపలు నివసిస్తున్నాయి. ఇతర సముద్రపు జీవులు జీవిస్తున్నాయి. సర్గాస్సో సముద్రపు తాబేలును అంతరించిపోయే ముప్పున్న జీవిగా ప్రకటించారు. కానీ, సర్గాస్సో వల్లనే ఇది బతికి బయటపడింది. ప్రస్తుతం సర్గాస్సో వల్లనే సముద్రపు జీవవైవిధ్యత వర్ధిల్లుతుంది’’ అని డేవిడ్ ఫ్రీస్టోన్ చెప్పారు.

మానవ కార్యకలాపాల వల్ల సర్గాస్సమ్ దెబ్బతింటుందని హెచ్చరించారు.

సర్గాస్సో సముద్రానికి ఒక వైపు యూరప్ ఉండగా.. మరోవైపు అమెరికా ఉందని డేవిడ్ ఫ్రీస్టోన్ అన్నారు. ఇది కీలకమైన జలమార్గం. దీంతో నిత్యం రాకపోకలు సాగించే బోట్ల ద్వారా సర్గాస్సమ్ దెబ్బతింటుంది. దీనిపై బోట్ల రాకపోకలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఇక రెండో ముప్పుగా చేపల పరిశ్రమ సర్గాస్సమ్‌కు హాని కలగజేస్తుంది.

‘‘2010లో మేం ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు, ఆ ప్రాంతంలో చేపల పట్టడమనేది చాలా తక్కువగానే జరిగేది. గత ఐదేళ్లలో చేపల పట్టడం బాగా పెరిగింది. సర్గాస్సో సముద్రంలో స్క్విడ్( కోమటి సంచులు అని పిలిచే జలచరం) ఫిషింగ్ ఇండస్ట్రీని చైనా మూడింతలు పెంచింది. దీంతో, సర్గాస్సో జీవవ్యవస్థ బాగా దెబ్బతింటుంది’’ అని డేవిడ్ చెప్పారు. కానీ, ఇది సర్గాస్సమ్ సముద్ర జలాల మధ్యలో ఉన్నప్పుడు పరిస్థితి.

అదే సర్గాస్సమ్ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి.

ఆల్గే నుంచి ప్రమాదం

తీర ప్రాంతాల్లో సర్గాస్సమ్ ప్రభావం గురించి సెయింట్ లూసియాలోని సర్ ఆర్థుర్ లూయిస్ కమ్యూనిటీ కాలేజీకి చెందిన పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్, మెరైన్ బయోలజిస్ట్ డాక్టర్ మ్యారీ లూయిస్ ఫెలిక్స్‌తో బీబీసీ మాట్లాడారు.

తన చిన్నప్పటి నుంచి సెయింట్ లూసియాలో తీర ప్రాంతాలకు సర్గాస్సమ్ కొట్టుకు రావడాన్ని తాను చూస్తున్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం వీటి స్థాయిలు మరింత పెరిగాయన్నారు.

‘‘ఇది సముద్ర జీవుల్లో భిన్నమైన రకానికి చెందినది. 12 నుంచి 13 ఏళ్లుగా సెయింట్ లూసియాలో సర్గాస్సమ్ సమస్యగా మారింది. జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సర్గాస్సమ్ తీర ప్రాంతానికి కొట్టుకువచ్చే మొత్తం బాగా పెరుగుతుంది’’ అని ఆమె చెప్పారు.

రెండేళ్ల క్రితం, సర్గాస్సమ్ లేయర్ సముద్రపు తీర ప్రాతం నుంచి 30 అడుగుల దూరం వరకు విస్తరించింది. సర్గాస్సమ్ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చినప్పుడు, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. ఇది అచ్చం కుళ్లిపోయిన గుడ్ల వాసన వస్తుంది.

ఇది మాత్రమే కాక, కళ్లలో దురద, కళ్లు తిరగడం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపులో వికారం వంటివి దీని వల్ల వస్తుంటాయి. ఈ సర్గాస్సమ్‌లో చిక్కుకుపోయిన చిన్న చేపలు, దానిలోనే చనిపోయి కుళ్లిపోతాయి. దాని వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.

‘‘తీర ప్రాంతానికి కొట్టుకువచ్చే సర్గాస్సమ్, పలు అడుగుల ఎత్తులో ఒక గోడ మాదిరి ఆక్రమిస్తుంటుంది. చాలా చిన్న చేపలు, ఇతర సముద్ర జీవులు దీనిలో కూరుకుపోయి, కుళ్లిపోతుంటాయి. అంటే సర్గాస్సమ్ వేళ్లు ఎంత బలంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది తీర ప్రాంతంలో నివసించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’’ అని డాక్టర్ మ్యారీ లూయిస్ ఫెలిక్స్ చెప్పారు.

హైడ్రోజన్ సల్ఫైడ్ గాలిలో కరిగి, చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడుతుంది. దీని వల్ల ఇళ్లలోనే చాలా ఖరీదైన వస్తువులు పాడవుతున్నాయి.

‘‘మూడేళ్ల క్రితం మేం ఒక సర్వే నిర్వహించాం. దానిలో చాలా మంది టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో నివసించే చాలా మంది పేదవారే. వారికి ఇది చాలా పెద్ద ఆర్థిక నష్టం. చేపలు పట్టే వారు సముద్రంలోకి వెళ్లలేకపోతున్నారు. ఇంజన్ల బోట్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. చాలా హోటల్స్ తీర ప్రాంతంలోనే కట్టారు. సర్గోస్సమ్ వల్ల వస్తున్న వాసనతో చాలా మంది హోటళ్లలో నివసించేందుకు ఇష్టపడటం లేదు. ఇది పర్యాటకంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’’ అని డాక్టర్ మ్యారీ లూయిస్ ఫెలిక్స్ వివరించారు.

పర్యాటకంపై ప్రభావం చూపడం వల్ల, స్థానికులకు ఉపాధి కూడా పోతుంది. సర్గాస్సమ్ మొత్తాన్ని బట్టి దీన్ని తొలగించడం ఆధారపడి ఉంటుంది. చిన్న మొత్తాలలో సర్గాస్సమ్‌ను సేకరించి, వాటిని అక్కడి నుంచి తరలించాలి.

ఒకవేళ తీర ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో సర్గాస్సమ్‌ను సేకరిస్తే, దాన్ని ట్రక్కులలో తరలించాల్సి ఉంటుంది. ఇది వేల డాలర్ల ఖర్చుతో కూడుకున్నది. సామాన్య ప్రజలు కూడా దీని తొలగింపులో పాల్గొనాలి. ఈ ఖర్చులను కేవలం ప్రభుత్వమే భరించడం కష్టం.

సర్గాస్సమ్‌లో ఉప్పు ఉంటుంది. తీర ప్రాంతాల నుంచి తొలగించి దాన్ని అలానే భూమిపైన వదిలేయలేం. వ్యవసాయ భూములను ఇది దెబ్బతీస్తుంది. కరేబియన్ ప్రాంతంలో ఉన్న చాలా దీవులున్న ఫ్రాన్స్ సైతం సర్గాస్సమ్ సమస్యను పరిష్కరించేందుకు పరిశోధనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుంది. అమెరికాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున రీసెర్చ్ వర్క్ జరుగుతోంది.

చాలా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీలు దీనిపై పరిశోధన చేస్తున్నాయి.

తీర ప్రాంతాలకు రాకుండా సర్గాస్సమ్‌ను అడ్డుకోవాల్సినవసరం ఉందని కొలంబియా యూనివర్సిటీ లామోంట్ డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీలో పనిచేసే మెరైన్ బయోలజిస్ట్, ప్రొఫెసర్ అజిత్ సుబ్రమణియం చెప్పారు. రోబోటిక్ ప్లాట్‌ఫామ్‌లు సాయంతో సర్గోస్సమ్ తీర ప్రాంతానికి చేరుకోకముందే సేకరించగలమన్నారు. ఆ తర్వాత దాన్ని సముద్రం అడుగున పెట్టవచ్చునేమో చూడాలని అన్నారు.

‘‘రోబోటిక్ సాయంతో ప్రతి రోజూ 100 టన్నుల సర్గోస్సమ్‌ను మనం సముద్ర అడుగున పెట్టడం వల్ల సమస్యను కొంతమేర పరిష్కరించవచ్చు. ఈ విధంగా మనం కొంత పనిచేయాలి. సముద్రం అడుగున ఎంత మొత్తంలో సర్గాస్సమ్‌ను ఉంచగలమో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఎంత లోతులో పెడితే గ్యాస్ మోడ్యుల్ పేలదో చూడాలి’’ అని చెప్పారు.

తన గ్యాస్ మోడ్యుల్ పేలడం వల్ల విడుదలయ్యే గ్యాస్‌తో సర్గాస్సమ్ నీటిపై తేలియాడుతూ ఉంటుంది. గ్యాస్ మోడ్యుల్ పేలకుండా ఉండేంత సముద్రపు గర్భంలోకి సర్గాస్సమ్‌ను మనం తీసుకెళ్తే, నీటి ఒత్తిడి దాన్ని కిందకి నెడుతుంది. దీని కోసం సర్గాస్సమ్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి.

‘‘సముద్ర గర్భంలో 2 వేల అడుగుల లోతులో సర్గాస్సమ్‌ను ఉంచితే ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మేం రీసెర్చ్ చేస్తున్నాం. అక్కడ డీకంపోజ్ కావడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఎంత ఆక్సీజన్‌ను అది తీసుకుంటుంది? సముద్ర గర్భంలోని పర్యావరణంపై ఇది ఏ ప్రభావం చూపుతుంది? సర్గాస్సమ్‌ నుంచి విషపూరితమైన గ్యాస్ విడుదలతో ప్రభావమెంత? వంటి చాలా ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానం లేదు’’ అని ప్రొఫెసర్ అజిత్ సుబ్రమణియం చెప్పారు.

అట్లాంటిక్ ఉష్ణ మండలంలోని సర్గాస్సమ్‌లో మూడున్నర మిలియన్ టన్నుల కార్బన్ ఉన్నట్లు చౌన్మిన్ హు గుర్తించారు. నీటిపైనున్న దీన్ని తొలగించి, దాన్ని సముద్ర అడుగున పెడితే పర్యావరణానికి ఏదైనా ప్రమాదముంటుందా? అనేది చూడాల్సి ఉంది.

చాలా ముఖ్యమైన ప్రశ్నలకు తాము సమాధానాలను కనుగొనాల్సి ఉందని ప్రొఫెసర్ అజిత్ సుబ్రమణియం చెప్పారు. వందలు లేదా రెండు వందల ఏళ్ల పాటు సముద్ర గర్భంలో వీటి అవశేషాలను ఉంచితే, ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవాలన్నారు.

సముద్రంలో ఒకే దగ్గర మిలియన్ టన్నుల సర్గాస్సమ్‌ను డంప్ చేయడం కాదిది. చిన్న చిన్న మొత్తాలను వివిధ ప్రాంతాల్లో డంప్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా మంది శాస్త్రవేత్తలు, ఇన్‌స్టిట్యూట్లు సర్గాస్సమ్‌ సమస్యను పరిష్కరించేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ, ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది, ఈ పరిస్థితి ప్రమాదకరమైనది. దీనికి పరిష్కారాన్ని త్వరగా కనుగొనాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)