You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒసిరిస్ రెక్స్: ప్రమాదకరమైన బెన్నూ ఆస్టరాయిడ్ శాంపిళ్లతో నాసా వ్యోమనౌక భూమిపై ఎలా దిగింది?
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి, డగ్‌వే, యుటా నుంచి
సౌర వ్యవస్థలో భూమికి ప్రమాదకరమైనదిగా భావిస్తున్న బెన్నూ అనే గ్రహశకలానికి సంబంధించిన ధూళి, రాళ్ల నమూనాలను సేకరించిన నాసా వ్యోమనౌక (స్పేస్ క్యాప్స్యూల్) ఒసిరిస్ రెక్స్ అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎడారిలో సురక్షితంగా దిగింది.
ఆస్టరాయిడ్ ఉపరితలం మీద నుంచి ఈ శాంపిళ్లను ఒసిరిస్ రెక్స్ సేకరించింది.
ఈఫిల్ టవర్ కంటే ఎత్తు ఉన్న ఈ ఆస్టరాయిడ్ 300 ఏళ్ల తర్వాత భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల దృష్టి దాని మీద లేదు. ఈ గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాల సాయంతో 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఎలా ఏర్పడింది, ఈ ప్రపంచంలో జీవం ఎలా మొదలైంది లాంటి అంశాల గురించి తెలుసుకోవచ్చంటున్నారు.
ఈ క్యాప్సూల్‌లో ఉన్న 250 గ్రాముల గ్రహశకలపు ధూళి, రాళ్ల నమూనాలను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒసిరిస్ రెక్స్ స్పేస్ క్యాప్సూల్ స్థానిక కాలమానం ప్రకారం 10.52 నిముషాలకు అంటే అంచనా వేసినదాని కంటే మూడు నిముషాల ముందే భూమి పైకి వచ్చింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) దీనిని రక్షణ శాఖకు చెందిన భూభాగంలో దించింది.
కారు టైరు సైజులో ఉండే ఈ కంటైనర్ అంతరిక్షంలోంచి భూమి మీదకు వచ్చేటప్పుడు గంటకు 43 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
ఇది పెద్ద శబ్దం చేసుకుంటూ సెకనుకు 12 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి వచ్చింది.
కాప్స్యూల్‌కున్న పారాచ్యూట్, హీట్ షీల్డ్ దాని వేగాన్ని నియంత్రించడంతో పాటు భూమి మీద నిర్ణీత ప్రాంతంలో నిదానంగా దిగేలా చేశాయి.
“అదొక పక్షి శరీరం నుంచి విడిపోయిన ఈక మాదిరిగా తేలికగా భూమిని తాకింది” అని ఏరో స్పేస్ నిర్మాణ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ చీఫ్ ఇంజనీర్ టిమ్ ప్రైసర్ చెప్పారు. ఈ బుల్లి క్యాప్యూల్ తనకు అప్పగించిన పనిని బాగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు.
‘’భూమి ఏర్పడక ముందున్న మెటీరియల్ కోసం చూస్తున్నాం. భూమి మీద ప్రాణం పుట్టుకకు ముందు జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సౌర వ్యవస్థ ఎలా ఏర్పడింది? గ్రహశకలాలు ఎలా ఒక చోటుకు చేరాయి? బెన్నూ లాంటి గ్రహశకలాలే భూమిని నివాసయోగ్యంగా మార్చాయా’’ అని తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఒసిరిస్ రెక్స్ మిషన్ ప్రధాన పరిశోధకుడు డంటే లారెట్టా ఇంతకుముందు చెప్పారు.
కేరింతలు కొట్టిన టీమ్
కాప్స్యూల్ నేలపై ల్యాండవడాన్ని లాంగ్ రేంజ్ కెమెరాల ద్వారా గుర్తించిన ఒసిరిస్ ఎక్స్ బృందం సంబరాలు చేసుకుంది.
ఈ క్యాప్సూల్ భూమి మీదకు దిగిన తర్వాత ఒసిరిస్ రెక్స్ టీమ్ సభ్యులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.
“ పారాచూట్ తెరచుకుని, ఆ కాప్స్యూల్ సురక్షితంగా నేలపైకి దిగుతున్నప్పుడు నేను హెలికాప్టర్‌లో కూర్చుని చిన్న పిల్లాడిలా ఏడ్చాను” అని ఒసిరిస్ రెక్స్ ప్రధాన పరిశోధకుడు డంటే లౌరెట్టా చెప్పారు.
“ఇది చాలా ఉద్విగ్నభరితమైన క్షణం. ఇది మాటల్లో వర్ణించలేని విజయం” అని అన్నారాయన.
ఈ క్యాప్సూల్‌లో ఉన్న ఆస్టరాయిడ్ నమూనాలను పరిశీలించడం వల్ల కొన్ని లక్షల కోట్ల ఏళ్ల క్రితం భూ గ్రహం ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బెన్నూ గ్రహశకలం గురించి పరిశోధన కోసం ఒసిరిస్ రెక్స్ వ్యోమనౌకను 2016లో నాసా ప్రయోగించింది. ఈ గ్రహశకలం నుంచి శాంపిళ్లను ఇది 2020లో సేకరించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు భూమికి చేరింది.
బెన్నూ శాంపిళ్ల సేకరణకు సంబంధించి ఐదు సెక్లన వీడియోను వ్యోమనౌక కెమెరా రికార్డు చేసింది.
“చిన్న చిన్న కణాలను కూడా హైరిజల్యూషన్‌తో విశ్లేషించగలం” అని టెక్సస్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో చీఫ్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న ఈలీన్ స్టాన్స్‌బెరీ చెప్పారు.
“పది మైక్రాన్ల సైజు ఉండే కణాలను కూడా డజను ముక్కలుగా చెయ్యడం ఎలాగో మాకు తెలుసు. అలా ముక్కలు చేసిన వాటిని పక్క పక్కనే అమర్చడం కూడా తెలుసు. ఈ లెక్కన చూస్తే 250 గ్రాములు చాలా ఎక్కువ“ అని స్టాన్స్ బెరీ తెలిపారు.
అదే అతి ముఖ్యమైన అంశం
కాప్స్యూల్ ల్యాండైన ఎడారిలో పరిశుభ్రత కీలక అంశం. నేల మీదకు దిగిన కాప్స్యూల్‌ను రికవరీ బృందాలు తీసుకెళ్లే సమయంలో వాటి లక్ష్యం ఒకటే. దాన్ని వీలైనంత త్వరగా డగ్‌వేలోని ఆర్మీ బేస్ క్యాంపులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్లీన్ రూమ్‌లోకి తీసుకెళ్లడం.
శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగా, నమూనాల్లోని కార్బన్ సమ్మేళనాల వల్ల జీవ సృష్టి జరిగి ఉన్నట్లయితే, భూమి మీద రాతి పదార్థం నమూనాల్లో కలవడాన్ని నివారించాల్సి ఉంది.
“ఈ మిషన్‌లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కాప్స్యూల్‌ను పరిశుభ్రంగా ఉంచడం, నమానాల్లో ఏదీ కలుషితం కాకుండా చూసుకోవడం” అని ఒసిరిస్ రెక్స్ డిప్యూటీ మేనేజర్ మైక్ మారో చెప్పారు.
“శాంపిల్‌ను భద్రపరిచేందుకు మన ముందున్న ఉత్తమ మార్గం.. దాన్ని త్వరగా ఫీల్డులో నుంచి మేము ఏర్పాటు చేసిన ఈ భారీ షెడ్డులోని ల్యాబ్‌లో శుద్ధమైన నైట్రోజన్ గ్యాస్‌తో శుభ్రం చేయాలి. అప్పుడే అది భద్రంగా ఉంటుందని” అన్నారాయన.
కాప్స్యూల్ నేలపైకి దిగిన నాలుగు గంటల తర్వాత ఈ ప్రక్రియ నిర్వహించారు.
బెన్నూ గ్రహశకలం సంగతేంటి?
బెన్నూ గురించి ఇప్పటికే కొన్ని విషయాలు తెలిశాయి. అది గట్టి రాయి కాదు. చిన్న చిన్న శకలాలు కలిసి ఏర్పడిన వస్తువులా ఉంది.
బెన్నూ గ్రహశకలం శాంపిళ్ల సేకరణ సరిగ్గా ఎక్కడ చేయాలో శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు క్వీన్ రాక్‌బ్యాండ్‌లో గిటారిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన సర్ బ్రయిన్ మే. దాని కోసం ఆయన బెన్నూకు చెందిన స్టీరియోస్కోపిక్ 3D చిత్రాల సాయం తీసుకున్నారు.
‘’మొదట్లో 30 వరకూ వేర్వేరు ప్రాంతాలను ఎంచుకున్నాం. వాటిలో కొన్నింటిని పక్కనపెట్టాం. ఎందుకంటే అవి చాలా పెద్ద బండరాళ్లు. ఇంకొన్నింటిని తిరస్కరించడానికి కారణం అవి చాలా చిన్నవి. మరికొన్ని మెటీరియల్స్ అధ్యయనానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు’’ అని బీబీసీతో బ్రయిన్ మే చెప్పారు.
ఆ పెట్టెను ఇంకా తెరవలేదు
ఒసిరిస్ రెక్స్ కాప్స్యూల్‌ను ల్యాబ్ టీమ్ విడదీసింది.
కాప్స్యూల్‌కు ఉండే హీట్ షీల్డ్, బ్యాక్ కవర్‌ను తొలగించారు. గ్రహశకలాలను దాచి ఉంచిన పెట్టెను ఇంకా తెరవలేదు.
దాన్ని విమానంలో జాన్సన్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ ఈ నమూనాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు.
నమూనాలను ముందుగా పరిశోధించే ఆరుగురు సభ్యుల బృందంలో బ్రిటన్ సైంటిస్ట్ అష్లే కింగ్ కూడా ఉన్నారు.
75 శాతం భవిష్యత్తు తరాల కోసం...
బెన్ను ఆస్టరాయిడ్ నుంచి ఏమేమి తీసుకు వచ్చామనే దానిపై వివరణ ఇచ్చేందుకు నాసా అక్టోబర్ 11న మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది.
చిన్న చిన్న నమూనాలను ప్రపంచవ్యాప్తంగా నాసాతో అనుబంధంగా ఉన్న సంస్థలకు పంపించనున్నారు. రెండేళ్ల పాటు అధ్యయనం చేసిన తర్వాత వాటిపై నివేదికలు తెప్పించుకోనున్నారు.
“ఈ మిషన్‌లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు తీసుకొచ్చిన నమూనాల్లో 75 శాతం భవిష్యత్తు తరాల కోసం భద్రపరుస్తాం. ఇప్పటికీ పుట్టని వాళ్ళు, ఇంకా ఏర్పాటు చేయని పరిశోధన శాలల్లో వాటిపై ప్రయోగాలు చేస్తారు. దీన్ని వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో అనే ఆలోచన కూడా చెయ్యడం లేదిప్పుడు” అని నాసా ప్లానిటరీ సైన్స్ డైరెక్టర్ లొరి గ్లేజ్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'గూగుల్ మ్యాప్‌ను ఫాలో కావడంతోనే నా భర్త చనిపోయాడు'.. కోర్టుకెళ్లిన మహిళ
- హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'
- వృద్ధ నాయకులు అధికారంలో ఉంటే ఆ దేశం ఏమవుతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- యూదుల ఊచకోతకు నాజీలు పన్నిన కుట్రల గురించి పోప్‌కు ముందే తెలుసా... 1942 నాటి రహస్య లేఖలో ఏముంది?
- ఎంఆర్ఐ స్కాన్: మీ కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తుల టెస్టుల్లో అసాధారణ ఫలితాలు కనిపించాయా, కారణం ఇదే కావచ్చు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)