You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నవాజ్ షరీఫ్: 'భారత్ చంద్రుడిపైకి చేరుకుంది, పాకిస్తాన్ మాత్రం డాలర్లు అడుక్కుంటోంది’
భారత్ చంద్రుడిపైకి చేరుకుంటే, తమ దేశం మాత్రం డాలర్లు అడుక్కుంటోందని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు.
పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి దేశ మాజీ సైనికాధికారులు, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు.
గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది, ద్రవ్యోల్బణం పెరిగింది, దేశంలోని పేద ప్రజలపై ఈ భారం పడుతోంది.
ఈ నేపథ్యంలో లాహోర్‌లో ఏర్పాటుచేసిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) సమావేశంలో ఆ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ లండన్ నుంచి ఆన్‌లైన్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.
మా ఆర్థిక సంస్కరణలనే భారత్ అనుసరించింది: షరీఫ్
నవాజ్ షరీఫ్ పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విటర్ (X)లో పోస్టు చేశారు.
ఈ రోజు పాకిస్తాన్ డబ్బుల కోసం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళుతోందని, భారత్ మాత్రం చంద్రునిపైకి చేరుకుందని ఆ వీడియోలో నవాజ్ గుర్తుచేశారు.
భారత్ సాధించినది పాకిస్థాన్ ఎందుకు సాధించలేకపోయింది, దీనికి బాధ్యులెవరు అని ఆయన ప్రశ్నించారు.
1990లో తన ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలనే భారతదేశం తరువాత అనుసరించిందని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధానిగా ఉన్నపుడు ఇండియా ఖజానాలో ఒక బిలియన్ డాలర్ కూడా లేదని, ఇప్పుడు భారత విదేశీ మారకద్రవ్యం 600 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన చెప్పారు.
అదే సమయంలో పాకిస్తాన్ దేశదేశాలు తిరుగుతూ డబ్బులు అడుగుతోందని ఆయన తెలిపారు.
'ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఈ ఏడాది జులై నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1.2 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం అందింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే లక్ష్యంతో ఆమోదించిన తొమ్మిది నెలల బెయిలౌట్ ప్యాకేజీలో ఇది భాగం' అని తెలిపారు నవాజ్.
'భారత్ కాపీ కొట్టింది'
ఓ వీడియోలో నవాజ్ షరీఫ్- ''2017 నాటి పాకిస్థాన్‌ని గుర్తుపెట్టుకోండి, నేటి పాకిస్థాన్‌ను చూడండి, ఈ రోజు భారత్ చంద్రుడిపైకి వెళ్లింది. ఇండియాలో జీ-20 సమావేశాలు జరిగాయి. ఇదంతా మనం చేయాలి. 1990లో నేను తొలిసారి ప్రధాని అయ్యాక ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను భారత్ కాపీ కొట్టి ఈ రోజు వారి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి'' అని తెలిపారు.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు నవాజ్.
"ఈ రోజు మనం ఒక్కో డాలర్ అడుక్కుంటున్నాం. ఏం గౌరవం మిగిలింది? మనం చైనా నుంచి అడుక్కుంటున్నాం, అరబ్ దేశాల నుంచి అడుక్కుంటున్నాం'' అని అన్నారు.
అక్టోబరులో పాకిస్థాన్‌కు నవాజ్ షరీఫ్
నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా 2017లో జీవితకాల అనర్హత వేటు వేసింది న్యాయస్థానం. దీంతో ఆయన లండన్ వెళ్లిపోయారు.
అంతేకాదు, అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్‌లో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ఆరోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం 2019లో బ్రిటన్ వెళ్లారు నవాజ్. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ తిరిగి రాలేదు.
దీంతో నవాజ్‌పై అరెస్టు వారెంట్ జారీ అయింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన పాక్ తిరిగి వస్తున్నారు.
ఆయన సోదరుడు, పాక్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ- ఈ అక్టోబర్ 21న లాహోర్‌లో పాకిస్తాన్ మొత్తం నవాజ్‌కు స్వాగతం పలుకుతుందన్నారు.
వచ్చే నెలలో లాహోర్‌కు వచ్చేలోపు నవాజ్ షరీఫ్‌కు మధ్యంతర బెయిల్ తీసుకోనున్నట్లు పీఎంఎల్-ఎన్ తెలిపింది.
నవాజ్ షరీఫ్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.
వారిని క్షమించే ప్రసక్తే లేదు: నవాజ్ షరీఫ్
వార్తాసంస్థ పీటీఐ ప్రకారం- నవాజ్ షరీఫ్ తన భావోద్వేగ ప్రసంగంలో నలుగురు న్యాయమూర్తులు కలిసి తనను ప్రధాని పదవి నుంచి తొలగించినట్లు చెప్పారు.
ఇందులో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
" పాకిస్తాన్ (మాజీ) చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్, ఆసిఫ్ సయీద్ ఖోసా ఇద్దరూ కూడా మాజీ ఆర్మీ చీఫ్, ఆయన గూఢచర్య విభాగానికి సాధనాలు. వారిని క్షమించడమంటే దేశానికి అన్యాయం చేసినట్లే. పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేసిన ఈ వ్యక్తులు బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని నవాజ్ తెలిపారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి
- ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: 'స్నేహశీలి, సెన్సిబుల్ నటుడు అక్కినేని'
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)