You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
షినవత్రా: ఒక్క ఫోన్‌కాల్ కారణంగా పదవిని కోల్పోయిన థాయ్ ప్రధాని
- రచయిత, గ్రేమ్ బేకర్
- హోదా, బీబీసీ న్యూస్
థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి పాటోంగార్న్ షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించడంతో దేశ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది.
ఈ చర్యతో దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ రాజవంశానికి దెబ్బ తగిలింది.
జూన్‌లో లీక్ అయిన ఒక ఫోన్ కాల్‌లో షినవత్రా నైతిక నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఆమెను తొలగించారు.
కంబోడియాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో షినవత్రా, థాయ్ ఆర్మీని విమర్శిస్తూ, కంబోడియా మాజీ నాయకుడు హున్ సేన్‌ను అంకుల్ అని సంబోధించినట్లుగా ఆ ఫోన్ కాల్‌లో వినబడుతుంది.
హున్ సేన్ స్వయంగా ఈ కాల్‌ను లీక్ చేయడంతో ఆమె ప్రతిష్టకు భంగం కలిగింది. దేశ ఆర్మీని తక్కువ చేశారంటూ ఆమెపై విమర్శకులు ఆరోపణలు చేశారు.
ఈ తీర్పుతో, 2008 నుంచి కోర్టు ద్వారా పదవీచ్యుతులైన అయిదో ప్రధానిగా షినవత్రా నిలిచారు. మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్రా కుమార్తె పాటోంగార్న్ షినవత్రా.
కోర్టులోని తొమ్మిది మంది జడ్జిల్లో ఆరుగురు ఆమెకు వ్యతిరేకంగా, ముగ్గురు అనుకూలంగా ఓటు వేశారు.
పదవికి ఉండాల్సిన నైతిక ప్రమాణాలను ఆమె చర్యలు ఉల్లంఘించాయని తీర్పులో చెప్పారు.
శాంతిని తిరిగి తీసుకురావడానికి ఆ కాల్ ఒక వ్యక్తిగత చర్చ లాంటిదని షినవత్రా చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
కోర్టు తీర్పును పాటోంగార్న్ అంగీకరించారు. కానీ తాను ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించానని ఆమె నొక్కి చెప్పారు.
థాయ్-కంబోడియా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో హున్ సేన్‌తో ఆమె కాల్‌లో మాట్లాడారు. ఈ ఉద్రిక్తతలు కొన్ని వారాల తర్వాత అయిదు రోజుల సంఘర్షణగా మారింది. ఇందులో డజన్ల కొద్దీ ప్రజలు చనిపోయారు. లక్షలాది మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు.
39 ఏళ్ల పాటోంగార్న్ 2021లో ఫెయు థాయ్ పార్టీలో చేరారు.
న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి జైలుకు వెళ్ళిన తన మిత్రుడిని మంత్రివర్గంలో నియమించినందుకు అప్పటి ప్రధాని శ్రేత్తా థావిసిన్‌ను రాజ్యాంగ న్యాయస్థానం తొలగించిన తర్వాత పాటోంగార్న్ ఈ పదవిలోకి వచ్చారు.
శక్తిమంతమైన షినవత్రా కుటుంబం తరతరాలుగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టింది. పాటోంగార్న్‌ను తొలగించడం వారి రాజకీయ రాజవంశానికి ఒక దెబ్బ.
పాటోంగార్న్ తండ్రి థాక్సిన్ 2006లో సైనిక తిరుగుబాటుతో పదవీ కోల్పోయారు. ఆమె అత్త యింగ్‌లక్‌ను కూడా 2014లో రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది.