You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్: అనకాపల్లి పర్యటనకు పోలీసుల కండీషన్లు, ఏమిటీ రాజకీయ వివాదం?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో గురువారం నాటి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ప్రకటించారు.
అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి ఈ నెల 9వ తేదీన జగన్ రానున్నారు.
అయితే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి మాకవరపాలెం వరకు రోడ్ షో గా వస్తున్న జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని, హెలికాప్టర్‌లో పర్యటించేందుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు.
అయితే, ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.
అసలు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు ఏ కారణాలు చెబుతున్నారు?
అనుమతి నిరాకరణ ఎందుకంటే...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటనకు అనుమతి నిరాకరణకు ఆ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కారణాలు వివరించారు. ఆయన ఏం చెప్పారంటే...
"మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల దూరం జాతీయ రహదారిపై కాన్వాయ్‌తో రావడానికి వైసీపీ శ్రేణులు ఈ నెల 4వ తేదీన అనుమతులు కోరాయి. మాకరవరపాలెం మెడికల్ కాలేజీకి ఈ నెల 9న వస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దానిపై పోలీసులు 5వ తేదీన అదనపు సమచారం అడిగారు. దానికి 6వ తేదీన వచ్చిన సమాధానం ప్రకారం...మెడికల్ కాలేజ్ సందర్శన, వై.ఎస్. జగన్ ప్రెస్ మీట్ ఉంటుందని, అందుకోసం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజ్ వరకు రోడ్డు మార్గాన వస్తున్నట్లు ఉంది"
"అయితే మేం సేకరించిన సమాచారం ప్రకారం...వై.ఎస్. జగన్ వస్తున్నట్లు తెలిపిన జాతీయ రహదారి రోడ్డు మార్గంలో వివిధ జంక్షన్ల వద్ద...ఆ పార్టీ నాయకులు జన సమీకరణ చేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. లంకెలపాలెంలో సుమారు 3 వేల మందిని, కొత్తూరులో 7 వేలు, తాళ్లపాలెంలో 7 వేలు, మర్రిపాలెంలో వెయ్యి, డైట్ కాలేజ్ వద్ద 15 వందల మంది... ఇలా జనసమీకరణ చేయనున్నట్టు సమాచారం అందింది. దీని వలన పలు భద్రతా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది" అని ఎస్పీ తెలిపారు.
‘వై.ఎస్.జగన్ సెక్యూరిటీ కూడా కష్టమే’
"విశాఖపట్నం నుంచి మాకవరపాలెంకు వచ్చే దారిలో ఎక్కువ భాగం జాతీయ రహదారి ఉంది. రోడ్ షోగా వీఐపీ వస్తే ఆ దారిలో ఉన్న ప్రధాన జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు, అత్యవసర సర్వీసులైన అంబులెన్సుల మూమెంట్‌కు కూడా అంతరాయం ఏర్పడుతుంది. కాన్వాయ్ వెళ్లేందుకు కూడా కష్టంగా మారుతుంది. దీంతో జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది"
"గాజువాక నుంచి లంకెలపాలెం వరకు వస్తున్న దారిలో ఎక్కువ భాగంగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయి. 63 కిలోమీటర్ల మేర సెక్యూరిటీ ఇవ్వాలంటే చాలామంది పోలీసులు అవసరమవుతారు. ఇది తక్కువ సమయంలో సాధ్యం కాదు" అని అనకాపల్లి ఎస్పీ తెలిపారు.
‘కరూర్ తొక్కిసలాట ప్రభావం’
ఇటీవల తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటను కూడా ఎస్పీ ప్రస్తావించారు.
"తమిళనాడులో ఇటీవల విజయ్ నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. అలాంటి సంఘటనకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ కారణాలన్నింటివల్ల మాజీ సీఎం జగన్ 63 కిలోమీటర్ల మేర కాన్వాయ్‌తో ప్రయాణించేందుకు అనుమతిని నిరాకరించాం" అని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.
‘హెలికాప్టర్‌లో అయితే ఓకే’
ట్రాఫిక్ ఇబ్బందులు, పర్యటన చేస్తున్న వీఐపీకి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నామో వివరిస్తూ...ఆర్గనైజర్స్‌కి నోటీసు ద్వారా సమాచారం తెలిపామన్నారు ఎస్పీ.
అయితే, హెలికాప్టర్ లో వచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటే దానిని పరిశీలిస్తామన్నారు. మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా నిర్వాహకులకు తెలిపామన్నారు ఎస్పీ.
పర్మిషన్ లేకుండా ప్రజలెవరూ గుమిగూడవద్దని హెచ్చరించినట్లు ఎస్పీ తెలిపారు.
వాతావరణం బాగాలేకపోయినా హెలికాప్టర్‌లో వెళ్లమంటారా: వైసీపీ
జగన్‌మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో వైసీపీ స్పందించింది.
ఈ నెల 9న నర్సీపట్నంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ పర్యటించి తీరతారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు.
"విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గాన జగన్ వెళ్తారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా ఆగేదే లేదు. వాతావరణం బాగాలేకపోతే హెలికాప్టర్లో వెళ్లమనడం ఏంటి? ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలియదా?" అని కన్నబాబు ప్రశ్నించారు.
"రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలను వై.ఎస్. జగన్ తెచ్చారు. చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే పోలీసుల చేతగాని తనమే.ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటన కొనసాగుతుంది" అని అన్నారు.
అదే రోజు విశాఖలో క్రికెట్ మ్యాచ్
ఈ నెల 9వ తేదీన విశాఖపట్నం నుంచి నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం వద్ద మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతులు కోరగా, పోలీసులు నిరాకరించారు.
అయితే, అదే రోజు విశాఖ మధురవాడలోని క్రికెట్ స్టేడియంలో మహిళల వన్డే క్రికెట్ మ్యాచ్ ఉంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఉన్నందున, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ విశాఖపట్నం సిటీ పోలీసులు, అనకాపల్లి ఎస్పీ ఈ పర్యటనకు రోడ్డు మార్గంలో అనుమతి నిరాకరించారు.
ఇప్పటికే క్రికెట్ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని విశాఖ నగరంలో, చుట్టుపక్కల ట్రాఫిక్ అంక్షలు విధించారు.
అయితే, ఎయిర్ పోర్టు నుంచి వై.ఎస్.జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజికి వెళ్లే మార్గం నగర పరిధిలోకి వచ్చే 11 కిలోమీటర్లకు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు విశాఖ పోలీసు కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు.
జాతీయ రహదారిపై కాకుండా నగర పరిధిలోకి వచ్చే వేరే మార్గాన్ని సూచించారు కమిషనర్.
టీడీపీ ఏమందంటే
"మెడికల్ కాలేజీ సందర్శనకు ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నాడంటే దానికి అనుమతి అవసరం లేదు, పోలీసులకు సమాచారం ఇస్తే చాలు" అని వైసీపీ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
"పోలీసులు అనుమతి నిరాకరించలేదు. రోడ్డు మార్గాన్నవద్దన్నారు. జనసమీకరణ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నందున హెలికాఫ్టర్ ద్వారా అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీనికి వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోంది" అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.
నష్టపోయేది ప్రజలే
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను కలవకుండా చేయాలన్నదే అధికార పార్టీ విధానంగా రాజకీయ పార్టీలు మారిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.
"ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ప్రజలను కలవలడమనేది అత్యవసరం. దీని ద్వారా ఆయా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి వెళ్తాయి. వాటికి పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా పర్యటనలకు అనుమతులు ఇవ్వకపోతే...ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి?" అని నాగరాజు ప్రశ్నించారు.
‘‘గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలకు అనుమతులు ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన అదే చేస్తున్నారు. దీని వలన అంతిమంగా ప్రజలే నష్టపోతారు" అని గాలి నాగరాజు తెలిపారు.
జగన్ గత పర్యటనల్లోనూ
గత ఏడాది కాలంలో వై.ఎస్. జగన్ పర్యటించిన ప్రతి సందర్భంలోనూ వివాదం రేగింది.
సత్తెనపల్లిలో జగన్ పర్యటనపై పల్నాడు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే పొదిలిలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తోన్న పొగాకు రైతులకు సంఘీభావం తెలిపేందుకు జగన్ పొదిలి వెళ్లినప్పుడు గుర్తు తెలియన వ్యక్తులు జరిపిన రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.
పోలీసులపై దాడి చేశారంటూ ముగ్గురు యువకులను ఈయేడాది మేలో తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీద కొట్టడం వివాదాస్పదమైంది. ఆ ముగ్గురు యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ తెనాలి వెళ్లినప్పుడు టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో నిరసనకారులను అడ్డుకుని జగన్ కాన్వాయ్‌కి రూట్ క్లియర్ చేయాల్సి వచ్చింది.
2025 ఏప్రిల్‌లో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు హెలికాప్టర్‌లో శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడుకు వెళ్లిన వై.ఎస్. జగన్ హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన జనం తాకిడికి హెలికాప్టర్ అద్దాలు (విండ్ షీల్డ్‌లు) ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సంచలనం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
2025 ఫిబ్రవరిలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వై.ఎస్. జగన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన భద్రతకు సంబంధించి వివాదం రేగింది.
ఆ సమయంలో జనం జగన్‌ను చుట్టుముట్టారు. తొక్కిసలాట జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)