సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు, జంతర్ మంతర్ వద్ద టెన్షన్

ఫొటో సోర్స్, PTI
నీట్ సహా పరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను దిల్లీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
శనివారం తెల్లవారుజామున ఆయన్ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.
నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది.
సోనమ్ వాంగ్‌చుక్ తరలింపు నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
దీనిపై న్యూదిల్లీ డీసీపీ ఎక్స్ ద్వారా స్పందించారు.
"సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యు నిపుణుల సలహాల మేరకు అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించాం" అని న్యూదిల్లీ డీసీపీ తెలిపారు.

‘దిల్లీ హైకోర్టు ఆదేశాలతో’
''హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తుండగా నిరసనకారులు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గందరగోళం నెలకొంది. మేం అత్యంత సంయమనంతో వ్యవహరించాం. మొత్తం ప్రక్రియను సురక్షితంగా పూర్తి చేశాం. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు వీలైనంత త్వరగా, శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని మరో పోస్ట్‌లో దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని దిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నిరసన విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
వాంగ్‌చుక్ పరిస్థితి విషమించక ముందే ఆయనకు బలవంతంగా ఆహారం అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వైద్యుల అభిప్రాయం ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
నిరాహార దీక్ష జరుగుతున్న ప్రదేశం నుంచి పార్లమెంటు వరకు జులై 20న పాదయాత్రకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, పరీక్షా విధానంలో సంస్కరణలు వంటి డిమాండ్లు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం.

ఫొటో సోర్స్, @abhijeet_dipke
‘బలవంతంగా తరలించారు’
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ పోలీసుల చర్యను విమర్శించారు. "ఇదేం గూండాయిజం? మోదీజీ, ఈ అధికార దురహంకారం ఎక్కువ కాలం నిలవదు. మీరు బలవంతంగా వాడుకుంటున్న యువతే మిమ్మల్ని గద్దె దించుతారు. గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను, ఆయన డిమాండ్లు వినకుండా బలవంతంగా అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు" అని ఎక్స్‌లో విమర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































