ఆకస్మిక వరదలతో టిబెట్ వైపు ఏ స్థాయి విధ్వంసం జరిగిందో బయటకు రాకుండా చైనా అడ్డుకుంటోందా?

లీ కియాంగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరదలు సంభవించిన మరుసటి రోజు, ఆగస్టు27న టిబెట్‌ను సందర్శించిన చైనా ప్రీమియర్ లీ కియాంగ్
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

కిందటి బుధవారం నేపాల్-టిబెట్ సరిహద్దును ముంచెత్తిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌లో మరణించిన వారి సంఖ్య 1,000 దాటగా, దాదాపు 4,000 మంది ఆచూకీ గల్లంతైంది.

ఆగస్టు 26వ తేదీ బుధవారం ఉదయం అకస్మాత్తుగా వరదలు మొదలైనప్పుడు ముందుగా టిబెట్ ప్రాంతాల్లోనే భారీ విధ్వంసం జరిగింది.

ఆ సమయంలో టిబెట్‌ వైపు ఉన్న నేపాల్ సరిహద్దు వద్ద గ్యిరోంగ్ పోర్ట్ బోర్డర్ చెక్‌పాయింట్‌లో జరిగిన భారీ విధ్వంసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో ప్రజలు ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ వరదల కారణంగా కేవలం 16 మంది మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం ధృవీకరించింది. ఈ ప్రకృతి విపత్తులో 546 మంది ఆచూకీ తెలియకుండా పోయారని, వీరిలో 261 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారని తెలిపింది.

మరోవైపు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2026 ఆగస్టు 30 రాత్రి 9:30 గంటల వరకు ఉన్న పరిస్థితి ఆధారంగా విడుదల చేసిన అప్‌డేట్‌లో, దాదాపు 500 మంది భారతీయ పౌరులు ప్రస్తుతం చైనా వైపు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్‌నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ అనే సంస్థ ఈ ఘటనలో కనీసం 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండచ్చని పేర్కొంది.

టిబెట్‌లో స్వతంత్రంగా గణాంకాలను ధ్రువీకరించడం చాలా కష్టం.

అక్కడ విదేశీ జర్నలిస్టులు కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లడం నిషేధం.

గ్యిరాంగ్ పోర్ట

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనాలో గ్యిరోంగ్ పోర్ట్ వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించిన పూర్తి వీడియోలు చైనాలో ఇంటర్‌నెట్‌లో కనుక్కోవడం చాలా కష్టం.

చైనా హెచ్చరిక

టిబెట్‌లోని గ్యిరోంగ్ పోర్ట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక భవనం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం కనిపిస్తుంది.

ఈ ఫుటేజ్‌ను చైనాలో సెన్సార్ చేస్తున్నట్లు బీబీసీ శనివారం తన కథనంలో ధ్రువీకరించింది.

టిబెట్‌కు సంబంధించిన వీడియోలపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో, విపత్తుకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా పంచుకుంటున్నామని చైనా తెలిపింది.

వీడియో సెన్సార్‌షిప్‌పై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ను సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

దీనిపై ఆయన స్పందిస్తూ, సహాయక, రక్షణ చర్యలను వెంటనే ప్రారంభించామని, వాటిని క్రమబద్ధంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. "విపత్తును ఉపయోగించుకుని చైనాను ఉద్దేశపూర్వకంగా చెడుగా చూపించడానికి లేదా పరిస్థితిని అతిశయోక్తిగా చూపించడానికి చేసే ప్రయత్నాలకు ప్రజల మద్దతు లభించదు" అన్నారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో కొంతమందిపై చైనా చర్యలు తీసుకుంది.

"తప్పుడు విపత్తు సమాచారానికి’’ సంబంధించి 10 మందిపై చర్యలు తీసుకున్నట్లు చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ బ్యూరో తెలిపింది.

అలాగే, "విపత్తుకు సంబంధించిన తప్పుడు సమాచారం" అందించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకుంటామని బ్యూరో హెచ్చరించింది. టిబెట్‌లో జరిగిన మరణాలపై సోషల్ మీడియా పోస్టులు ఎక్కువగా ఉన్నాయని బ్యూరో తెలిపింది. వాటిలో వేలాది మంది మరణించారని లేదా అధికారికంగా వెల్లడించిన సంఖ్య కంటే ఎక్కువ మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.

సింగపూర్‌కు చెందిన న్యూస్ వెబ్‌సైట్ సీఏన్ఏ ప్రకారం, ఈ 10 మందికీ "అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీ" విధించినట్లు బ్యూరో తెలిపింది. అయితే ప్రతి ఒక్కరికి ఎలాంటి శిక్ష విధించారో వెల్లడించలేదు. ఈ వాదనలు ఏ సోషల్ మీడియా వేదికలపై ప్రచురించారో కూడా చెప్పలేదు.

‘టిబెట్‌ విధ్వంసాన్ని దాచిపెడుతున్నారు’

టిబెట్‌లో వరదల వల్ల ఎంత మేరకు విధ్వంసం జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన అంచనా వెలువడలేదు. అయితే పలు టిబెటన్ సంస్థలు భారీ స్థాయిలో నష్టం జరిగిందని చెబుతున్నాయి.

అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కనీసం 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని ఇంటర్‌నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ అనే సంస్థ చెబుతోంది.

ఆ సంస్థ అధ్యక్షురాలు టాంకో గ్యాత్సో 'ది గార్డియన్' న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, "నేపాల్‌లో కనిపిస్తున్న పరిస్థితి టిబెట్ విషయంలో దాచి పెడుతున్నారు. సెల్, సెర్చుంగ్, లాబీ, రిజీ అనే నాలుగు గ్రామాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడ దాదాపు 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదు" అన్నారు.

"క్షేత్రస్థాయి నుంచి మాకు అందిన కొద్దిపాటి సమాచారం" ప్రకారం, వరదల కారణంగా ప్రభావితమైన వారి సంఖ్య చైనా అధికారులు చెబుతున్న సంఖ్య కంటే "చాలా ఎక్కువగా" ఉందని ఆమె 'ది గార్డియన్'తో చెప్పారు.

ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ గ్రూప్ 'ది గార్డియన్'కు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిని వరదలకు ప్రభావితమైన సరిహద్దు ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని గ్యిరోంగ్‌కు తరలించినట్లు పలు వర్గాలు తెలిపాయని చెప్పింది.

ఈ వ్యక్తులను కఠినమైన నిఘాలో ఉంచారని, వారితో స్వేచ్ఛగా మాట్లాడటానికి అనుమతి లేదని ఈ గ్రూపు చెబుతోంది.

వరదలు

ఫొటో సోర్స్, Gongga Laisong/China News Service/VCG via Getty Images

చైనా ఏ సమాచారాన్ని దాచిపెడుతోంది?

చైనా నుంచి సమాచారం కొద్దికొద్దిగా మాత్రమే బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు.

2020లో కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత కూడా ఈ పరిస్థితే కనిపించింది. చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే బయటకు పంపడానికి చైనా అనుమతించింది.

నేపాల్-టిబెట్ సరిహద్దులో అకస్మాత్తుగా వచ్చిన వరదల గురించి గ్యాత్సో మాట్లాడుతూ, "ఇది కేవలం నేపాల్‌లోనే జరుగుతున్నట్లు, సరిహద్దుకు ఇవతల ఏమీ జరగనట్లు చైనా ప్రభుత్వం చూపుతోంది. ఏ సంక్షోభాన్నైనా చైనా అసలు సంక్షోభమే లేనట్టుగా ఈ రీతిలోనే ఎదుర్కొంటుంది" అన్నారు.

బీజింగ్‌లో బీబీసీ చైనా ప్రతినిధి లారా బికర్ మాట్లాడుతూ, గ్యిరోంగ్ పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందని, కానీ ఆ ఫుటేజ్‌లోని ఒక చిత్రాన్ని మాత్రమే చైనా ప్రభుత్వ టీవీ చానళ్లు తమ ప్రసారాల్లో చూపించాయని తెలిపారు.

"చైనాలో అత్యంత కఠినమైన సెన్సార్‌షిప్ ఉన్న ఇంటర్నెట్‌లో పూర్తి వీడియోను కనుగొనడం కష్టం. అయితే ఈ విపత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై చైనాలో ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది" అని చెప్పారు.

"ఆకస్మిక వరదల గురించి చెబుతున్న ప్రాణాలతో బయటపడిన వారి ప్రత్యక్ష వివరాలను కనుగొనడం ఇంకా కష్టం" అని తెలిపారు.

వరదల తర్వాత చైనా అనుసరిస్తున్న ఈ వైఖరిని బట్టి ఆ దేశం నిర్లక్ష్యంగా ఉందనుకోవడానికి లేదు. చైనా చాలా ఆందోళన చెందుతోందని లారా బికర్ చెబుతున్నారు.

"చైనా ప్రీమియర్ లీ కియాంగ్‌ను వెంటనే ఆ ప్రాంతానికి పంపించారు. బయటకు వచ్చిన ఫుటేజ్‌లో ఆయన శిథిలాలను తొలగించే పనిని పరిశీలిస్తున్నట్లు కనిపించారు. ఇంత పెద్ద విపత్తు జరిగిన వెంటనే దేశంలో రెండో అత్యున్నత నాయకుడు అక్కడికి వెళ్లడం చాలా అరుదైన విషయం" అని బికర్ చెప్పారు.

"ప్రపంచానికి కనిపిస్తున్న ప్రశాంతమైన స్పందనకు కారణం, షీ జిన్‌పింగ్ తన దేశంలో ఎప్పుడూ స్థిరత్వం కొనసాగించాలని కోరుకునే ఒక విషయం."

"ఈ విపత్తుపై స్పందించకపోవడం లేదా దాన్ని ఆపలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరగవచ్చని కమ్యూనిస్టు పార్టీ భయపడవచ్చు. అంతేకాకుండా, ఈ విషాద ఘటన ప్రభావం ఒక పెద్ద సమస్యగా మారుతుందేమోనన్న భయం కూడా చైనాకు ఉండవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా విశ్వాసం కీలక పాత్ర పోషిస్తున్న ఒక సమాజంలో ఇది మరింత ఆందోళన కలిగించే అంశం కావచ్చు."

"ఈ ప్రాంతంలో చాలాకాలంగా నిరసనలు జరగనప్పటికీ, విదేశాల్లోని టిబెటన్ సంస్థలు చైనా తన నియంత్రణను పెంచడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు, కొత్త విద్యా చట్టం విషయంలో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మఠాలు, బౌద్ధమతం పాత్రను బలహీనపరచడమే ఆ చట్టం ఉద్దేశమని వారు చెబుతున్నారు."

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)