నేపాల్ వరదలు: ''ఆమె చీరపట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాం''.. బాధితులు చెప్పిన అనుభవాలు

ఫొటో సోర్స్, Vijaya Buvaneswari
- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
వేలచ్చేరిలోని మురుగు నగర్‌కు చెందిన దంపతులు నావూ కబీర్ దాస్, ఆయన భార్య విజయ భువనేశ్వరి నేపాల్‌లో సంభవించిన ఘోరమైన వరదల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఇది తమకు పునర్జన్మలాంటిదని ఆ ఘటనలను గుర్తు చేసుకుంటూ వారిద్దరూ చెప్పారు.
శుక్రవారం రాత్రి నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి చెన్నైకి చేరుకున్న 21 మందిలో కబీర్ దాస్, విజయ భువనేశ్వరి కూడా ఉన్నారు.
ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మూడు బస్సుల్లో 57 మంది యాత్రికులు రసువా ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో వరదలు వచ్చాయి.
ఈ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి.
ప్రమాదానికి ముందు, రెండు పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారిపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలను వారు ఆస్వాదిస్తున్నారు.
ఈ రహదారి పక్కన ఒక నది ప్రవహిస్తోంది.
అకస్మాత్తుగా రసువా ప్రాంతం విలయ భూమిలా మారిపోయింది. భారీ శబ్దం, కొండ చరియలు విరిగిపడటం, మట్టి, శిథిలాలను మోసుకొస్తూ వేగంగా ప్రవహించిన వరద నీరు... ఇవన్నీ కలిసి ఒక భయానక పరిస్థితిని సృష్టించాయి.


'మా వెనుక ఉన్న బస్సు పక్కకు ఒరిగింది'
మూడు బస్సుల్లో రెండో బస్సు మాత్రమే వరద బారిన పడకుండా తప్పించుకుంది.
"కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతుందో మాకసలు అర్థం కాలేదు. మా వెనుకనున్న బస్సు పక్కకు ఒరిగిపోవడం చూశాను. అప్పుడే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో నాకు అర్థమైంది" అని విజయ భువనేశ్వరి చెప్పారు.
‘‘అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్లుగా భారీ శబ్దం వినిపించింది. బస్సుపై రాళ్లు పడుతున్నాయి. ఆ తర్వాత ఎవరో ఆనకట్ట తెరిచినట్లుగా వరద నీరు వేగంగా రావడం మొదలైంది" అని ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ నావూ కబీర్దాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వరదలు ముంచెత్తడానికి ముందు ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న వారి బస్సు బురదలో చిక్కుకుపోయింది. మరమ్మతుల కోసం కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది.
"ఆ కొద్ది నిమిషాలే మా ప్రాణాలను కాపాడాయి" అని విజయ భువనేశ్వరి చెప్పారు.
వారి డ్రైవర్ ఒక నేపాలీ. తరచూ కొండచరియలు, మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఈ పర్వత ప్రాంతంలో వరద నీటిని చూసిన వెంటనే ఆయన ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టాడని వారు చెప్పారు.
"వాహనం నుంచి అందరూ బయటకు రావాలని, ఎత్తైన ప్రాంతానికి వెళ్లడమే సురక్షితమైన మార్గమని అతను అందరికీ చెప్పాడు. ఆ తర్వాత అతనే సురక్షిత ప్రాంతం వైపు పరుగెత్తాడు. మేము కూడా అదే దారిలో వెళ్లాం. ఆ సమయంలో మా పిల్లలే గుర్తొచ్చారు’’ అని విజయ భువనేశ్వరి చెప్పారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఒక అంతస్తు ఎత్తులో ఉన్న ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. 21 మంది ప్రాణాలతో బయటపడగా, వారిలో కొద్దిమంది మినహా చాలా వరకు 50 ఏళ్లు దాటినవారే. ప్రాణాలను కాపాడుకోవడానికి బురద, మట్టితో నిండిన ప్రాంతాన్ని వారు ఎక్కాల్సి వచ్చింది.
"నేను, మరొకావిడ పైకి ఎక్కుతున్నాం. మధ్యలో జారి పడిపోయాం. నేను రెండుసార్లు జారిపోయా. నా కాళ్లన్నీ బురదతో నిండిపోయాయి. పట్టుకోవడానికి ఏదీ లేదు" అని ఆమె చెప్పారు.
చివరకు అప్పటికే పైకి చేరుకున్న మరో మహిళ చీరను గట్టిగా పట్టుకుని పైకి చేరుకున్నానని విజయ భువనేశ్వరి చెప్పారు. ఆ మహిళ తన చీరను విప్పి కిందకు వేలాడదీసారని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Vijaya Buvaneswari
"నా బంధువు పూంగోడి అప్పటికే పైకి చేరుకుంది. ఆ రోజు చీర కట్టుకున్నది ఆమె ఒక్కరే. తను స్వెటర్ వేసుకుని, చీర విప్పి మా కోసం కిందకు వేలాడదీసారు. ఆ చీరను, సమీపంలో ఉన్న ఒక కేబుల్‌ను పట్టుకుని మేము పైకి ఎక్కాం" అని విజయ అన్నారు.
"భవనం అంత ఎత్తులో ఉన్న మట్టి దిబ్బను ఎక్కడానికి మాకు గంటన్నర పట్టింది. ఒక దశలో నేను పట్టుకున్న చెట్టు కొమ్మ విరిగిపోయింది. ఆ తర్వాత చెట్లను పట్టుకోవడానికి బదులుగా చీరలను పట్టుకుని పైకి ఎక్కాం. చివరకు ఒక మహిళ పైకి చేరుకోలేకపోయారు. చీరను నడుముకు కట్టుకోవాలని ఆమెకి చెప్పాం. మా బృందంలోని సభ్యులు ఆమెను పట్టుకుని పైకి లాగారు" అని చెప్పారు.
పైకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక విపత్తు సహాయ కేంద్రం కనిపించింది.
అక్కడ ఉన్న కొందరు నీరు, బిస్కెట్లు ఇచ్చారు. మొబైల్ ఫోన్లకు సిగ్నల్ ఉన్నవారు తాము క్షేమంగా ఉన్నామని తమిళనాడులోని వారికి సమాచారాన్నందించారు.
"మా బృందంలోని ఒక సభ్యుడి బంధువు సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆయన ద్వారా మేము ప్రభుత్వాన్ని సంప్రదించగలిగాం. మేము క్షేమంగా ఉన్నామని నిర్ధరించేందుకు ఒక ఫోటో పంపించాం’’ అని విజయ భువనేశ్వరి చెప్పారు.
పైకి ఎక్కుతున్న సమయంలో బురదలో చిక్కుకున్న ఒక వ్యక్తి చెయ్యి ఊపుతూ కనిపించారని విజయ భువనేశ్వరి చెప్పారు.
"ఆయన్ని చూసిన తర్వాత మేము పైకి ఎక్కలేకపోయాం, అక్కడ ఉండలేకపోయాం" అని విజయ భువనేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.
రక్షణ బృందానికి సమాచారం అందించడంతో ఆ వ్యక్తిని తరువాత రక్షించారని ఆమె చెప్పారు.
"పైకి చేరిన తర్వాతే మేం వచ్చిన బస్సు కనిపించింది. మా బస్సు మాత్రమే కనిపించింది. దాని ముందు అనేక వాహనాలు బోల్తా పడి ఉన్నాయి. ఒక వాహనం టైరు మాత్రమే కనిపించింది. అప్పుడే కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో మాకు అర్థమైంది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Vijaya Buvaneswari
తమ బృందం సభ్యులు సహాయ కేంద్రంలో ఒకటిన్నర రోజులు గడిపారని, అయితే కష్టాలు అక్కడితో ముగిసిపోలేదనీ ఆ దంపతులు వెల్లడించారు. ఆ తర్వాత 20 అంతస్తుల భవనమంత ఎత్తైన కొండ ప్రాంతాన్ని దాటాల్సి వచ్చిందని వెల్లడించారు.
"అది ఒక ఇరుకైన, ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగే దారి. మేము దాన్ని ఎలా ఎక్కామో కూడా గుర్తు లేదు. రెండు వైపులా దట్టమైన పొదలు ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలన్న పట్టుదలతోనే పైకి ఎక్కాం" అని కబీర్దాస్ చెప్పారు.
తమలో ఎవరికీ పర్వతారోహణ అనుభవం లేకపోవడంతో ప్రయాణం చాలా కష్టంగా సాగిందని ఆయన చెప్పారు.
"నేలంతా బురద, ఊబితో నిండిపోయి ఉంది. మేం పదేపదే జారిపడుతూనే ఉన్నాం. ఒక్క అడుగు తప్పినా 50 అడుగుల లోతులో పడిపోయే పరిస్థితి" అని ఆయన చెప్పారు.
"ఒక దశలో మేము తప్పుదారిలోకి వెళ్లాం. ఒక నేపాలీ వ్యక్తి మాకు దారి చూపించారు. మేం కిందికి దిగి, ఆ తర్వాత మరోవైపు నుంచి పైకి వెళ్లాల్సి వచ్చింది."
"పైకి ఎక్కడంకంటే కిందికి దిగడం మరింత కష్టంగా అనిపించింది. నేను పదేపదే కూర్చుని, నెమ్మదిగా జారుకుంటూ కిందికి దిగాల్సి వచ్చింది’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
మూడు గంటల తర్వాత వారు అనుకున్న పికప్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాక వారు తమ ఇళ్లకు రాగలిగారు.
చెన్నై, కడలూరు, మయిలాడుతురై, కృష్ణగిరి, తిరుచ్చి తదితర ప్రాంతాలకు చెందిన 21 మంది తమిళనాడు తిరిగి వచ్చారు.
శుక్రవారం మంత్రి రాజ్‌మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి 400 మందికి పైగా నేపాల్‌కు వెళ్లారని, వారిలో 90 మందిని సంప్రదించలేకపోతున్నామని వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































