You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గర్భగుడి బయటే నిల్చుని పూజలు చేయడంపై వివాదం ఎందుకు?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మంగళవారం (జూన్ 20) దిల్లీలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె గర్భగుడి బయట దేవుడి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉన్న ఒక ఫొటో బయటకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
గతంలో, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లు అదే ఆలయంలో వేర్వేరు సమయాల్లో గర్భ గుడిలో పూజలు చేస్తూ కనిపిస్తున్న ఫోటోలను కూడా నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ద్రౌపది ముర్ము విషయంలో ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు.
దిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో వాగ్వివాదాలు కూడా మొదలయ్యాయి.
జూన్ 20వ తేదీన, తన 65వ పుట్టినరోజుతో పాటు జగన్నాథ రథయాత్ర-2023ను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ ఆలయానికి వెళ్లారు.
అక్కడ ఆమె పూజలు చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. జగన్నాథ రథయాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె ట్విట్టర్‌లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ట్విటర్‌లో షేర్ చేసిన ఒక ఫొటోలో ద్రౌపది ముర్ము, ఆలయ గర్భగుడి బయట చేతులు జోడించి నిల్చొని ఉండగా, లోపల పూజారి దేవుడికి పూజలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
గర్భగుడి బయటే నిల్చొని పూజలు చేస్తున్న ఆమె ఫోటోపై పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళ అయిన కారణంగానే ఆమెను ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని కొందరు ఆరోపిస్తున్నారు.
పూజలు చేసిన కేంద్ర మంత్రులు
సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌ల ఫొటోలు కూడా షేర్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో కేంద్ర మంత్రులిద్దరూ వేర్వేరు సమయాల్లో ఆలయ గర్భ గుడిలో పూజలు చేస్తూ కనిపిస్తున్నారు.
అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లు గర్భగుడిలో పూజలు చేయగలిగినప్పుడు, రాష్ట్రపతి ముర్ము ఎందుకు చేయకూడదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
అశ్వినీ వైష్ణవ్, ద్రౌపది ముర్ము ఫొటోలను ట్వీట్ చేసిన ‘ది దళిత్ వాయిస్’’ అనే ట్విటర్ హ్యాండిల్... అశ్వినీ వైష్ణవ్ (రైల్వే మంత్రి)కు అనుమతి ఉంది, ద్రౌపది ముర్ము (రాష్ట్రపతి)కు అనుమతి లేదు అనే వ్యాఖ్యలను జోడించారు.
సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ మండల్ కూడా ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల ఫొటోలను ట్వీట్ చేశారు.
‘‘దిల్లీలోని జగన్నాథ ఆలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆలయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకుతున్నారు. కానీ, ఈ ఆలయంలోనే గణతంత్ర భారతదేశపు మొదటి పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రం బయటి నుంచే పూజలకు అనుమతించడం చాలా ఆందోళన కలిగించే విషయం’’ అని రాశారు.
దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న అర్చకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మహావికాస్ అఘాడి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా బీఆర్ అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ ఈ ఫొటోపై ప్రశ్నలను లేవనెత్తింది.
‘‘తప్పుడు వార్తల వ్యాప్తిని ఆపాలి’’
చాలా మంది ట్విటర్ వినియోగదారులు గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేక దేవాలయాల గర్భగుడిలో పూజలు చేశారని అంటున్నారు.
దేవఘర్‌లోని వైద్యనాథ్ ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో ముర్ము పూజలు చేస్తున్న చిత్రాలను రచయిత కార్తికేయ తన్నా ట్వీట్ చేశారు.
ఇషిత అనే మరో ట్విటర్ యూజర్ కూడా దేవఘర్, వారణాసి ఫొటోలను షేర్ చేస్తూ, ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఆపాలి. ఎందుకంటే ఆమె రాష్ట్రపతి. దేశంలో అందరూ ఆమెను గౌరవిస్తారు’’ అనే వ్యాఖ్యను జోడించారు.
ఆలయ పాలకవర్గం ఏం చెప్పింది?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గర్భగుడి లోపలి ఎందుకు ప్రార్థనలు నిర్వహించలేదో తెలుసుకునేందుకు దిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయానికి బీబీసీ వెళ్లింది.
జగన్నాథ ఆలయ అర్చకులు సనాతన్ పాడి దీని గురించి బీబీసీ ప్రతినిధి సెరాజ్ అలీతో మాట్లాడుతూ, ఫొటోల వల్ల తలెత్తిన వివాదాన్ని ఖండించారు.
గుడిలో పూజలకు కూడా ప్రొటోకాల్ ఉంటుందనే విషయాన్ని ముందుగా ప్రజలు గుర్తించాలని అన్నారు. కులమతాలకు అతీతంగా హిందువులందరూ గుడికి వెళ్లవచ్చని చెప్పారు.
“విశిష్ట అతిథులుగా మనం ఎవరిని ఆహ్వానిస్తామో వారు మాత్రమే ఆలయ గర్భగుడిలో పూజలు చేయవచ్చు. ప్రత్యేక ఆహ్వానం ఉన్న వారు మాత్రమే లోపలికి వచ్చి దేవుడి ముందు పూజలు చేసి వెళ్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంతంగా దేవుడి దర్శనం కోసం వచ్చారు. అందుకే లోపలికి రాలేదు.
ట్విటర్‌లో దీనిపై జరుగుతున్న వివాదాలు అసంబద్ధమైనవి. గుడిలోకి అందరూ రావొచ్చు. కానీ, ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చిన వారికి మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది’’ అని ఆయన అన్నారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కోపం వచ్చినప్పుడు
భారతదేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పట్ల ఒక ఆలయ సభ్యులు అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్రపతి భవన్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, తర్వాత ఆదేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రామ్‌నాథ్ కోవింద్ దళిత సామాజికవర్గానికి చెందినవారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, 2018 మార్చి నెలలో పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించారు.
2018 మార్చి 18న రాష్ట్రపతి కోవింద్ దంపతులు జగన్నాథ ఆలయానికి వెళ్లారు. ఈ సందర్శనకు సంబంధించిన ‘మినట్స్’ మీడియాకు లీక్ అయ్యాయి.
‘‘రత్న సింహాసనానికి (దీనిపై జగన్నాథుడు కూర్చుంటాడు) తలను తాకించి నమస్కరించడానికి రాష్ట్రపతి వెళ్లినప్పుడు, అక్కడున్న సేవకులు ఆయనకు దారిని వదల్లేదు. కొంతమంది సేవకులు రాష్ట్రపతిని తాకుతూ వెళ్లారు. అలాగే రాష్ట్రపతి భార్య, భారతదేశ ప్రథమ మహిళ వద్దకు కూడా వచ్చారు’’ అని మినట్స్‌లో పేర్కొన్నారు.
పూరీ నుంచి వెళ్లిపోవడానికి ముందుగా జిల్లా కలెక్టర్ అరవింద్ అగర్వాల్ వద్ద ఈ విషయం గురించి రాష్ట్రపతి అసంతృప్తిని వెలిబుచ్చారు. అదే సమయంలో, రాష్ట్రపతి భవన్ తరపున కూడా అసంతృప్తి వ్యక్తమైంది.
మార్చిలో ఈ ఘటన జరుగగా, మూడు నెలల తర్వాత జూన్‌లో ఇది వెలుగులోకి వచ్చింది.
దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, రాష్ట్రపతి అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ, ఈ ఘటనపై ఆలయ పాలకవర్గం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఊపిరి కాసేపు ఆగిపోయేలా చేసిన వాగ్నర్ 'ప్రైవేట్ ఆర్మీ' చీఫ్ ఎందుకు వెనక్కి తగ్గారు... 24 గంటల పాటు అసలేం జరిగింది?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)