You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వయనాడ్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు, 150 దాటిన మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 150 దాటింది. ఇంకా దాదాపు 90 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారని బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు.
వయనాడ్ జిల్లా మెప్పాడి, చూరల్మలై సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
ఇప్పటికీ రాళ్లు, మట్టిపెళ్లల కింద అనేక మంది చిక్కుకుపోయి ఉన్నట్లు ఏఎన్ఐ, పీటీఐ వార్తాసంస్థలు వెల్లడించాయి.
చూరల్మలై, ముండక్కె, అట్టమలై, నూల్పుజా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
తీవ్రంగా గాయపడిన వారిని సహాయ సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్చినట్లు బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు.
ఎంతమంది చిక్కుకుపోయారన్నది స్పష్టంగా చెప్పలేమని కేరళ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ బీబీసీతో చెప్పారు.
ప్రమాద స్థలానికి చేరుకునే మార్గాలలో ఉన్న ఒక వంతెన కూడా కొండచరియలు పడి కూలిపోవడంతో సహాయచర్యలు ఆలస్యమవుతున్నాయని శశీంద్రన్ తెలిపారు.
సహాయక చర్యలు చేపడుతున్నాం: సీఎంఓ
కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఆర్ఎఫ్ అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నాయి.
ఫైర్, సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 250 మందిని సహాయ చర్యల కోసం పంపినట్లు కేరళ సీఎంఓ తెలిపింది.
ప్రభుత్వ విభాగాలన్నీ సహాయ చర్యలలో పాల్గొంటున్నాయని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాద స్థలానికి చేరుకునేందుకు తాత్కాలిక వంతెనను నిర్మించాలని ఆర్మీని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది.
కలత చెందా: ప్రధాని నరేంద్ర మోదీ
ఈ ఘటన గురించి తెలిసి తాను తీవ్రంగా కలత చెందినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో రాశారు. బాధితులకు సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
గాయాలు పాలైన వారికి రూ.50 వేలు ఇస్తున్నట్లు ఎక్స్‌లో వెల్లడించింది.
రాహుల్ గాంధీ సంతాపం
వయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో విరిగిపడ్డ కొండచరియల ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.
కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి, వయనాడ్‌కు అవసరమైన సాయమంతా ఇవ్వాలని అభ్యర్థిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు.
సహాయ చర్యలలో యూడీఎఫ్ వర్కర్లందరూ స్థానిక యంత్రాగానికి సాయం చేయాలని కోరారు.
కాగా భారీ వర్షాల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ప్రమాదం నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ వయనాడ్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
అత్యవసర వైద్య సేవల కోసం 8086010833, 9656938689 నంబర్లను సంప్రదించాలని సూచించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)