You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాల్కనీ నుంచి పడి మరణించిన 'వన్ డైరెక్షన్' స్టార్ లియామ్ పేన్
‘వన్ డైరెక్షన్’ పాప్ బాండ్ మాజీ గాయకుడు లియామ్ పేన్(31) అర్జెంటీనాలోని బ్యూనస్ఏర్స్‌లో ఒక హోటల్ మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
బ్యూనస్ ఏర్స్‌లోని పాలెర్మో ప్రాంతం నుంచి వచ్చిన ఎమర్జెన్సీ కాల్‌కు స్పందించి వెళ్లినప్పుడు అక్కడ తమ అత్యవసర సిబ్బంది పేన్ మృతదేహాన్ని గుర్తించారని పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు.
లియామ్ పేన్ 2010లో హ్యారీ స్టైల్స్, లూయిస్ టామ్‌లిన్సన్, నియాల్ హోరాన్, జైన్ మలిక్‌లతో కలిసి ‘వన్ డైరెక్షన్’ బ్యాండ్ ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా పేరు సంపాదించారు.
ఈ నెల ప్రారంభంలో పేన్ తన మాజీ బ్యాండ్ ‘వన్ డైరెక్షన్’ సభ్యుడు నియాల్ హొరాన్ అర్జెంటీనాలో నిర్వహించిన కన్సర్ట్‌కు హాజరయ్యారు.
బ్యూనస్ ఏర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
‘ఓ వ్యక్తి డ్రగ్స్, మద్యం ప్రభావంలో ఉన్నట్లుగా దూకుడు’గా వ్యవహరిస్తున్నారని కాల్ రావడంతో పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లారు. హోటల్‌కు చేరుకున్న అధికారులకు అక్కడున్న వారు ‘లోపలి నుంచి పెద్ద శబ్దం వినిపించింది’ అని చెప్పారు. కొద్దిసేపటికే అక్కడ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
పేన్ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ అల్బెర్టో క్రెసెంటీ స్థానిక మీడియాతో చెప్పారు.
పేన్ బాల్కనీ నుంచి ఎలా పడిపోయారనే విషయంలో అడిగిన ప్రశ్నలకు క్రెసెంటి సమాధానం ఇవ్వలేదు.
బ్రిటన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం దీనిపై స్పందించింది.
‘ఓ బ్రిటిష్ పౌరుడు మరణానికి సంబంధించి’ అర్జెంటీనాలోని అధికారులతో తమ కార్యాలయం టచ్‌లో ఉందని చెప్పింది. అంతకుమించి వేరే వివరాలేమీ చెప్పలేదు.
పేన్ ఈ సంఘటనకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియా స్నాప్‌చాట్‌లో "ఇది అర్జెంటీనాలో ఒక అందమైన రోజు" అని పోస్ట్ చేశారు.
పేన్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు బ్యూనస్ఏర్స్ హోటల్‌కు చేరుకోవడంతో పోలీసులు ప్రవేశ ద్వారం వద్ద జనాలను నియంత్రించారు.
కొందరు అభిమానులు పేన్ జ్ఞాపకార్థం కొవ్వొత్తులను వెలిగించారు.
‘లియామ్ చనిపోయిన విషయం నా సోదరి చెప్పింది. అప్పటికి నేను నా లివింగ్ రూమ్‌లో ఉన్నాను" అని యువ అభిమాని వైలెట్ ఆంటీర్ రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.
‘మేం నమ్మలేకపోయాం. ఈ సమాచారం నిర్ధరించుకోవడానికి మేం నేరుగా ఇక్కడకు వచ్చాం’ అన్నారు.
రెండు వారాల క్రితమే పేన్‌ను నియల్ హారన్ కన్సర్ట్‌లో చూశానని ఎన్టయర్ తెలిపారు.
మరో మహిళా అభిమాని కన్నీళ్లు పెడుతూ ఆమె అక్కడికి ఎందుకొచ్చారో చెప్పారు.
‘పేన్‌కు వీడ్కోలు పలకడానికి నాకున్న దారి ఇదొక్కటే’ అంటూ రాయిటర్స్‌కు చెప్పారు.
ఆన్‌లైన్‌లోనూ పేన్ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
‘ది వాంటెడ్’ బ్యాండ్‌కు చెందిన సింగర్ మాక్స్ జార్జ్.. పేన్ మరణ వార్తపై స్పందిస్తూ, ‘అత్యంత బాధాకరం’ అన్నారు.
‘ఎక్స్ ఫాక్టర్ షో’ లో ‘వన్ డైరెక్షన్’తో పోటీ పడుతున్నప్పుడు పేన్‌ను తాను కలిసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
‘గత కొన్నేళ్లుగా నాకు ఆయనతో వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉంది. అతనితో విలువైన సమయాన్ని గడిపాను’ అని జార్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
తన బ్యాండ్ సభ్యుడు టామ్ పార్కర్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న సమయంలో పేన్ చాలా సపోర్ట్‌గా నిలిచారని జార్జ్ తెలిపారు.
2022లో పార్కర్(33) మరణించినప్పుడు పేన్ ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.
వన్ డైరెక్షన్ కంటే ఏడాది ముందు ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో పాల్గొన్న గాయకుడు ఓల్లి ముర్స్.. పేన్ మరణంపై ‘మాటలు రావడం లేదు’ అని అన్నారు.
‘మా ఇద్దరి అభిరుచులు, కలలు ఒకే మాదిరి ఉండేవి. పేన్ చిన్న వయసులోనే మరణించడం బాధాకరం. తన కుటుంబం, ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన ఆయన కుమారుడు బేర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను" అని మూర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
ఇన్‌స్టాగ్రాంలో ప్రెజెంటర్ డెర్మోట్ ఓ లియరీ పేన్‌ను గుర్తు చేసుకున్నారు.
‘14 ఏళ్ల వయస్సులో ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఆడిషన్‌లో సినాట్రా పాట పాడి మమల్ని ఆశ్యర్యానికి గురిచేయడం నాకు ఇంకా గుర్తుంది’ అంటూ తామిద్దరం ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
‘ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు, అందరి కోసం టైం కేటాయించేవారు. మర్యాద, కృతజ్ఞత, వినయం అన్నీ ఉన్న వ్యక్తి పేన్’ అంటూ డెర్మోట్ గుర్తు చేసుకున్నారు.
‘ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతిని తెలుపుతున్నాను. RIP మై ఫ్రెండ్’ అని పారిస్ హిల్టన్ ‘ఎక్స్’లో తెలిపారు.
బ్రిటన్‌లోని వాల్వర్‌హాంప్టన్‌లో జన్మించిన పేన్ 2008లో స్టార్‌డమ్ కోసం ప్రయత్నిస్తూ ఐటీవీ టాలెంట్ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’ ఆడిషన్‌లో పాల్గొన్నారు. అయితే, షోలో పేన్‌ను రెండేళ్లలో తిరిగి రావాలని జడ్జి సైమన్ కోవెల్ సూచించారు.
చెప్పినట్టే, 2010లో న్యాయ నిర్ణేతలను బాగా ఆకట్టుకుని.. బూట్ క్యాంప్ దశలో మరో నలుగురు సోలో పార్టిసిపెంట్స్‌తో కలిసి పేన్ ‘వన్ డైరెక్షన్’ బ్యాండ్ ఏర్పాటు చేశారు.
వీరి బ్యాండ్ బ్రిటన్‌లో నాలుగు నంబర్ వన్ ఆల్బమ్స్‌తో పాటు, నాలుగు నంబర్ వన్ సింగిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. 2015లో జైన్ మాలిక్ గ్రూప్ నుంచి విడిపోవడంతో బ్యాండ్ విరామం ప్రకటించింది.
2017లో పేన్ తొలి సోలో సింగిల్ స్ట్రిప్ దట్ డౌన్, అధికారిక బ్రిటన్ చార్ట్‌లో మూడో స్థానానికి చేరుకుంది. రీటా ఓరాతో పాడిన ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్ సౌండ్‌ట్రాక్ నుంచి ‘ఫర్ యు’ పాట కూడా టాప్ 10కి చేరింది.
‘గర్ల్స్ అలౌడ్’ స్టార్ చెరిల్ ట్వీడి, పేన్‌లకు 2017లో బేర్ జన్మించారు. ఆ తరువాత ఏడాదే వీరిద్దరూ విడిపోయారు.
పేన్ మాజీ భాగస్వామి మాయ హెన్రీ రెండు రోజుల క్రితం.. " సీస్ అండ్ డెసిస్ట్" నోటీస్ ఆయనకు పంపినట్లు ఆమె తన న్యాయవాదుల ద్వారా మీడియాకు తెలిపారు.
పేన్ తనను పదే పదే సంప్రదిస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలపై పేన్ ఏమీ స్పందించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)