You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్ ముస్లింలు: 'నేను చనిపోయాక అంత్యక్రియలు ఎలా చేస్తారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను'
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
12 కోట్ల మంది ఉన్న జపాన్‌లో ముస్లింల జనాభా ఒక్క శాతం కన్నా తక్కువే.
జపాన్‌లోని 99 శాతం జనాభాలో ఎవరైనా మరణిస్తే, వారి అంతిమ సంస్కారాలు బౌద్ధం, షింటో ఆచారాలను అనుసరించి జరుగుతాయి. మృతదేహాలను దహనం చేస్తారు.
కానీ, ముస్లిం మతస్థులు చనిపోతే, వారి ఆచారం ప్రకారం 24 గంటల్లోగా మృతదేహాలను ఖననం చేయాలి. కానీ, శ్మశానవాటికలు లేక ఈ మతస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
తమను ప్రేమించే వారు దూరమైతే, వారి చివరి మజిలీని పూర్తి చేయడానికి మృతదేహాలను వందల కిలోమీటర్ల దూరాన ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సివస్తోంది.
ఈ సమస్య తమను కలచివేస్తోందన్నారు తాహీర్ అబ్బాస్ ఖాన్. 2001లో పీహెచ్‌డీ కోసం జపాన్‌కు వచ్చిన తాహీర్, అక్కడే స్థిరపడ్డారు.
“నేను ప్రేమించే వాళ్లు దూరమైతే, వారి అంతిమ సంస్కారాలు ఎలా చేయాలన్న ఆలోచనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను“ అని భావోద్వేగంతో అన్నారు తాహీర్.
పాకిస్తాన్‌లో జన్మించిన తాహీర్‌కు జపాన్ పౌరసత్వం లభించింది.
అక్కడి ముస్లిం కమ్యూనిటీలో చురుగ్గా వ్యవహరాలు చక్కబెడుతుంటారు తాహీర్. ‘బెప్పు ముస్లిం అసోసియేషన్’ను స్థాపించారు.
ఎందుకని సమస్యగా మారింది?
జపాన్ దేశంలో దాదాపు రెండు లక్షల మంది ముస్లింలు ఉన్నారు.
తన మరణానంతరం తన మృతదేహాన్ని ఏం చేస్తారన్న చింత లేదని, కానీ, ఇతరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు.
“చనిపోయిన వ్యక్తికి చివరిగా మనం ఇవ్వగలిగేది అంతిమ సంస్కారం. నా స్నేహితులు, బంధువుల్లో మరణించిన వారికి గౌరవప్రదమైన అంతిమ కార్యక్రమాలు చేయలేకపోతే, ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. సాధారణ జీవితం గడపలేను” అన్నారు.
2009లో జపాన్ దక్షిణ ఐలాండ్ క్యుషులోని ఒయిటాలో తొలి మసీదును నిర్మించారు. సుమారు రెండువేల మంది ముస్లింలు నివసిస్తున్న ఆ ప్రాంతంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి ముస్లింలలో దీనిపై ఆందోళన ఉంది.
పాకిస్తాన్‌కు చెందిన మొహ్మద్ ఇక్బాల్ ఖాన్ 2004లో తన భార్యతో కలిసి జపాన్‌కు వచ్చి, టోక్యోకు సమీపంలో కార్ల ఎగుమతులకు సంబంధించిన వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
కొన్నాళ్లకు టోక్యో సమీపంలోని ఫుక్యుకా నగరంలో స్ధిరపడ్డారు.
2009లో మొహ్మద్ ఇక్బాల్ ఖాన్ భార్య ప్రసవించిన బిడ్డ, పుట్టుకతోనే మరణించింది. ఆ సమయంలో శిశువు మృతదేహాన్ని ఖననం చేసేందుకు దగ్గరలో ముస్లింల శ్మశానవాటిక లేదు.
ఈ విషాద ఘటనను గుర్తుచేసుకున్నారు ఇక్బాల్.
“నా బిడ్డ మృతదేహాన్ని పెట్టెలో ఉంచి, మేమున్న ప్రాంతం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనాషికి కారులో తీసుకెళ్లాం. అంతదూరం ఒక్కడినే కారు డ్రైవ్ చేయలేను కాబట్టి, నాతోపాటు నలుగురు స్నేహితులు వచ్చారు”అని తెలిపారు.
సెంట్రల్ జపాన్‌లో ఉండే యమనాషి శ్మశానవాటికలో ముస్లిం, క్రైస్తవ మతస్తులు అంత్యక్రియలు చేస్తుంటారు.
క్రైస్తవుల జనాభా జపాన్ దేశంలో ఒక శాతం కన్నా తక్కువే ఉంది.
“నా బిడ్డ అంతిమ సంస్కారాల్లో నాతోపాటు నా భార్య కూడా ఉండాలని ఆశపడ్డాను. కానీ, అది సాధ్యం కాలేదు” అన్నారు.
స్థలం కొన్నా సమస్యలు..
డా.ఖాన్ నడుపుతున్న బెప్పి ముస్లిం అసోసియేషన్ తరఫున బెప్పు ప్రాంతంలో క్రైస్తవుల శ్మశానవాటిక పక్కనే ఉన్న స్థలాన్ని కొన్నారు.
“ఆ స్థలాన్ని విక్రయించిన వారికి మేం శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ, ఆ స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వారు మాత్రం మా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
మృతదేహాలను భూమిలో పాతిపెట్టడం మూలంగా భూగర్భజలం, సాగుకోసం వినియోగించే చెరువునీరు కలుషితమవుతాయని, వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితంగా మారతయని వారు అన్నారు. అందువల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది” అన్నారు డా.ఖాన్.
ఏడేళ్లుగా ఆ విషయంలో ఎలాంటి ముందుడుగు పడలేదు. ముస్లింలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
వలస వచ్చిన ముస్లింల కుటుంబాల్లో మరణం సంభవిస్తే, బంధువుల సాయంతో స్వదేశానికి తీసుకెళ్లి, అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారని డా.ఖాన్ తెలిపారు.
క్యాన్సర్ వంటి రోగాల బారిన పడిన వారు, తమ మరణానంతరం తమ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాల కోసం ఇబ్బందులు పడకూడదని స్వదేశాలకు వెళ్లి, అంతిమ క్షణాలను అక్కడే గడుపుతున్నారు.
జపాన్‌లో మృతదేహాలను స్వదేశానికి తీసుకెళ్లడం కూడా అంత సులభం కాదు.
క్యుషు ఐలాండ్‌లో నివసించే ర్యోకో సాటోకు అలాంటి అవకాశం కూడా లేదు. జపాన్ దేశస్తురాలైన ర్యోకో ఇస్లాంను స్వీకరించారు.
“ జపాన్ సంప్రదాయాలు, ఆచారాలను పాటించడం కష్టమైతే మీ దేశానికి వెళ్లిపోండి అని కొంతమంది అంటారు. మరికొందరు ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖననం చేసే వీలున్న దేశానికి వెళ్లి, ఆ కార్యక్రమాలు చేసుకోని చెప్తారు” అని విమర్శల గురించి చెప్పారు.
ఆమె మాట్లాడుతూ “నా భర్త సగానికిపైగా జీవితాన్ని జపాన్‌లోనే గడిపారు. చాలాకాలం క్రితమే జపాన్ పౌరసత్వం లభించింది. ఈ దేశంలోనే పన్నులు కడుతున్నారు. మా పిల్లలు కూడా ఇక్కడే పెరుగుతున్నారు. చెప్పడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ, నా భర్త మరణిస్తే, ఆయన అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలి?” అని ప్రశ్నించారు.
ముస్లింల శ్మశానవాటికల ఏర్పాటు వెనుక సాంస్కృతికపరమైన కారణాలు ఉన్నాయని ర్యోకో అన్నారు.
“కొంతమంది మృతదేహాలను ఖననం చేయడాన్ని వేరేలా చూస్తారు. కొన్ని తరాల క్రితం జపాన్‌లో మృతదేహాలను ఖననం చేసే ఆచారం కూడా ఉంది. ఇది నిజం” అన్నారు.
ర్యోకో సాటో తన మరణానంతరం కూడా తన మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతున్నారు.
“మృతదేహాలను ఖననం చేయడం స్వార్థంగా చూస్తే గనుక, నా మృతదేహాన్ని కూడా ఖననం చేయడం పట్ల నేను స్వార్థంగానే ఉంటాను” అన్నారామె.
బెప్పు ముస్లిం అసోసియేషన్ సమస్య, ఖననాల పట్ల వ్యతిరేకత వెనుకున్న కారణాలపై జపాన్‌లోని బెప్పులో ఉన్న రిత్సుమెయికన్ ఏషియా పసిఫిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షింజి కొజిమా పరిశోధన జరిపారు.
ఆయన మాట్లాడుతూ, “మీరు ముస్లిం మతస్తులా? ఇతర మతస్తులా? అన్నది ఇక్కడ విషయం కాదు, స్థానిక మతపరమైన రాజకీయాలు, సంబంధాలే ముఖ్యం” అన్నారు.
పరిష్కారమేంటి?
జపాన్ దేశంలో 13 ముస్లిం శ్మశానవాటికలు ఉన్నాయని డా.ఖాన్ చెప్పారు. వాటిలో హిరోషిమాలో ఉన్న శ్మశానవాటికను చేరుకునేందుకు మూడుగంటల సమయం పడుతుందని అన్నారు. ఇక్బాల్ కూడా అక్కడికే వెళ్తారు.
“అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. స్థానికులు హలాల్ చేసిన ఆహారాన్ని అందిస్తారు” అని ఇక్బాల్ తెలిపారు..
స్థానిక అధికారులు, ఎంపీలు, మంత్రులు ఈ సమస్య గురించి పట్టించుకోవాలని డా.ఖాన్ అన్నారు. బెప్పులో స్థానిక అధికారులు 79 మందిని ఖననం చేసేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించారు.
ఇక్భాల్ మాట్లాడుతూ, “ఇది మతపరమైన అంశం కాదు. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం. మాకేమీ ఉచితంగా ఇవ్వొద్దు. మేం డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ, అనుమతులు మాత్రం లభించడం లేదు” అన్నారు.
క్రైస్తవులు, యూదులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని డా.ఖాన్ అన్నారు.
“ప్రతి జిల్లాలో అన్ని మతాల వారికి ప్రత్యేకంగా శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలి. ఇదే సరైన పరిష్కారం” అన్నారు.
అయినప్పటికీ, జపాన్ ప్రభుత్వం ఈ అంశం జోక్యం చేసుకోకుండా, స్థానిక అధికార యంత్రాంగానికే ఆ బాధ్యతను అప్పగించింది.
డా.ఖాన్ తన ప్రయత్నం సఫలమవుతుందనే ఆశతో అన్నారు.
“మేం మృతదేహాలను ఎట్టిపరిస్థితుల్లోనూ దహనం చేయం. ఎంతటి ప్రయాసలకోర్చైనా సరే, మతాచారం ప్రకారం ఖననం చేస్తాం “అన్నారు.
ఇవి కూడా చదవండి..
- ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్: ‘మహిళను గర్భవతిని చేస్తే రూ.5 లక్ష లు ఇస్తాం’ అంటూ సాగే ఈ స్కామ్‌లో బాధితులు ఎలా చిక్కుకుంటున్నారంటే...
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- రొమాంటిక్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
- కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)