పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనను ఎలా చూడాలి?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియా దేశాల ప్రాంతీయ సమావేశాల్లో కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవా చేరుకున్నారు. 2011 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్.

పన్నెండేళ్ల కిందట అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హినా రబ్బాని ఖర్ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణతో సమావేశమయ్యారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, పాకిస్తాన్ మధ్య కూడా సంక్షోభం నెలకొంది.

''అప్పటి దౌత్య ప్రయత్నాలు ఇరుదేశాల మధ్య సయోధ్య కోసం జరిగాయి. అది వేరే కథ'' అని అమెరికా నిపుణుడు, ది విల్సన్ సెంటర్‌కి చెందిన మైఖేల్ కుగెల్‌మన్ అన్నారు.

మూడు యుద్ధాల్లో తలపడిన భారత్, పాకిస్తాన్

1947లో స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మూడుసార్లు యుద్ధాలు జరిగాయి. కశ్మీర్ కోసమే ఈ యుద్ధాలు జరిగాయి. కశ్మీర్‌లో భారత బలగాలపై జరిగిన పుల్వామా దాడి తర్వాత, 2019లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత బలగాలు దాడులు చేశాయి.

ఆ దాడుల తర్వాత భారత్, పాక్ అణుయుద్ధానికి దగ్గరగా వచ్చాయని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో ఇటీవల పేర్కొన్నారు.

2021లో ఇరుదేశాల సరిహద్దులో జరిగిన ఘటనతో ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయి.

భారత్ ప్రమాదవశాత్తూ ప్రయోగించిన ఒక సూపర్ సోనిక్ మిస్సైల్‌ పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టకుండా ఈ ఘటనను పాకిస్తాన్ ఖండించింది.

''అయితే, దానివల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.'' అని కుగెల్‌మన్ చెప్పారు.

''రెచ్చగొట్టే చర్య ఒక్కటి జరిగినా ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది'' అని ఆయన అన్నారు.

బిలావల్ భుట్టో జర్దారీ గోవా పర్యటనపై భారీ అంచనాలేమీ లేవు. ''షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్‌లో భారత్, పాకిస్తాన్‌ ప్రధాన భాగస్వామ్యం ఉన్న దేశాలు.'' ఈ పర్యటనలో అదొక్కటే కనిపిస్తుంది అని పాకిస్తాన్‌లో హైకమిషనర్‌గా పనిచేసిన భారత మాజీ అధికారి టీసీఏ రాఘవన్ తెలిపారు.

ఏంటీ షాంఘై కోఆపరేటివ్ కౌన్సిల్?

మధ్య ఆసియా దేశాల భద్రత, ఆర్థిక సంబంధాలపై చర్చించేందుకు 2001లో షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్‌కు చైనా నేతృత్వం వహిస్తోంది. మధ్యఆసియాకి చెందిన నాలుగు సభ్య దేశాల్లో చైనా కూడా ఒకటి.

ఈ సమావేశాలతో రవాణా, ఇంధన సరఫరాకి సంబంధించిన వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది.

''ఈ సమావేశాలకు పాకిస్తాన్ దూరంగా ఉంటే తమ దేశ ప్రయోజనాలను విలువనిచ్చే సంస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది'' అని కుగెల్‌మన్ చెప్పారు.

అయితే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, భుట్టో జర్దారీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

''పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటనకు వచ్చి చాలా కాలం అయినప్పటికీ, ఇరుదేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక పరిస్థితుల నేపథ్యంలో భుట్టో పర్యటన ఒక అసాధారణ పరిణామంగా చెప్పొచ్చు.'' అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన హ్యాపీమన్ జాకబ్ చెప్పారు.

వాషింగ్టన్ డీసీలోని హడ్సన్ యూనివర్సిటీకి హుసేన్ హక్కానీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. '' ఈ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఉపయోగపడేలా కనిపించడం లేదు'' అని అన్నారు. ఆయన గతంలో అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేశారు.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పర్యటనను ''ద్వైపాక్షిక చర్చల కోణంలో చూడకూడదని, సభ్య దేశాల చర్చల కోణంలో చూడాలి'' అని కుగెల్‌మన్ చెప్పారు. ''ఆయన దిల్లీతో సర్దుబాటు చేసుకునేందుకు వెళ్లడం లేదు. పాకిస్తాన్ ప్రయోజనాల కోసం కొన్నిదేశాల ప్రాంతీయ సదస్సుకి హాజరవుతున్నారు'' అని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ జాకబ్ చెప్పినట్టుగా ఇరువురు ప్రత్యర్థులు ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు.

''ఎవరూ ఈ పరిస్థితిని పాడుచేయాలని అనుకోవడం లేదు. అయితే, ఇరుదేశాల మధ్య స్తంభించిపోయిన అంశాలపై చర్చించేందుకు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరు.'' అని ఆయన చెప్పారు.

''గత రెండేళ్లుగా ఇరుదేశాల మధ్య పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. కానీ, మెరుగైన సంబంధాలు లేవు.'' అని రాఘవన్ భావిస్తున్నారు.

ఎత్తుపల్లాల మాదిరిగా కొన్నిసార్లు ఉద్రిక్తంగా, మరికొన్నిసార్లు సాధారణంగా ఉంటున్నాయని హక్కాని అభిప్రాయపడ్డారు.

అయితే, ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరుదేశాలు కోరుకుంటున్నాయన్నది వాస్తవం. ''పాకిస్తాన్‌ అంతర్గతంగా చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. భారత్‌తో మరో వివాదం పెట్టుకునే పరిస్ధితిలో లేదు. ఇటీవల పెద్ద సమస్యగా తయారైన చైనాపైనే భారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. పాకిస్తాన్ నుంచి అదనపు సమస్య తెచ్చుకోవాలని భారత్ కూడా కోరుకోవడం లేదు. '' అని కుగెల్‌మన్ చెప్పారు.

రాజకీయ కారణాలు

ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరుదేశాలు కోరుకుంటే, ఇరుదేశాల సయోధ్యకు భారత్‌లో జరుగుతున్న ఈ ఎస్‌సీవో సమ్మిట్‌ ఎందుకు ఒక అవకాశం కాకూడదు? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే, ఇందులో చాలా రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి.

''శాంతి కోసం ఒక మెట్టు దిగితే సొంత దేశంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీముఖ్యంగా పాకిస్తాన్‌లో అది చాలా పెద్ద విషయం. పాక్ ప్రభుత్వం ఇప్పటికే చాలా వ్యతిరేకత ఎదుర్కొంటోంది.'' అని కుగెల్‌మన్ చెప్పారు.

దేశంలోని పరిస్థితుల వల్ల సాధారణ చర్చలకు అవకాశం లేకుండా పోయిందని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

''టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియా కోరుకుంటుంది. అలాగే కశ్మీర్ వ్యవహారంలో భారత్ తన విధానం మార్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటుంది.'' అని ఆయన చెప్పారు. కశ్మీర్ తమదంటే తమదని భారత్, పాక్ మధ్య వివాదం నడుస్తోంది.

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంతమాత్రంగానే ఉన్నాయని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీకి చెందిన హసన్ అబ్బాస్ చెప్పారు. భారత్, పాకిస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజార్చాయని ఆయన అన్నారు.

ఇటీవల రెండుదేశాల మధ్య చర్చలు జరిగినట్టు మీడియాలో వచ్చిన ఊహాగానాలపై పండిట్‌లు అసంతృప్తికి గురయ్యారని ప్రొఫెసర్ జాకబ్ చెప్పారు. ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు కాకుండా వాటిని మేనేజ్ చేసేందుకే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

''గోవాలో జరుగుతున్న సమావేశాలు ఇరుదేశాల మధ్య చర్యల పున:ప్రారంభానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నా'' అని హక్కానీ అన్నారు. మిగిలిన వారు అలా జరుగొచ్చని అనుకోవడం లేదు.

''గతంలోనూ భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఆశించినంత మెరుగ్గా లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఏదైనా జరిగితే శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి, ఇరుదేశాలు ఎలాంటి చర్యలకు దిగకుండా కొనసాగడం ఉత్తమం.'' అని అబ్బాస్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)