You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆదిపురుష్ - ప్రభాస్: ప్రతి థియేటర్‌లోనూ హనుమంతుడికి ఒక సీటు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎందుకు?
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు ప్రభాస్ నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో మంగళవారం రాత్రి నిర్వహించారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నిసింగ్ తదితరులు నటించారు.
పౌరాణిక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీ గ్రౌండ్‌లో అయోధ్యను తలపించే ప్రత్యేక సెట్ వేశారు.
గ్రౌండ్‌కు వెళ్లేదారిలో కాషాయ జెండాలు, జైశ్రీరామ్ నినాదాల జెండాలు, బ్యానర్లు కూడా కనిపించాయి.
అయితే, కార్యక్రమం పూర్తయ్యేందుకు ముందుగా ఆంధ్రా బ్యాక్స్ ఆఫీస్.కామ్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ వచ్చింది. రాముడి భక్తుల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి థియేటర్‌లోనూ ఒక సీటును ఎవరికీ విక్రయించకుండా హనుమాన్ కోసం వదిలిపెడుతున్నట్లు దీనిలో వెల్లడించారు. అయితే, దీనిపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ వస్తోంది.
ప్రకటనలో ఏముంది?
ఈ విషయంపై రాత్రి 8.30 గంటలకు ట్విటర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు, హిందీతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాపై భిన్న భాషల్లో ట్విటర్‌లో ప్రకటనలు విడుదల చేశారు.
‘‘రామాయణం పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడు అనేది మన నమ్మకం. ఆ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం కేటాయిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆదిపురుష్‌ను హనుమంతుడి సమక్షంలో అందరమూ చూద్దామని ప్రకటనలో చెప్పారు. మరోవైపు ప్రతి సినిమా థియేటర్‌లోనూ ఒక సీటును ఖాళీగా ఉంచేలా చూడాలని దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లను అభ్యర్థించారు.
దర్శకుడు ఏమన్నారు?
ఈ విషయంపై ప్రీ రిలిజ్ వేడుకలో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడారు.
‘‘రామాయణాన్ని ప్రదర్శించే ప్రతిసారీ హనుమాన్ చూడటానికి వస్తారని మా అమ్మ చెప్పేది. అందుకే హనుమాన్ జీ కోసం ప్రతి థియేటర్‌లోనూ ఒక సీటును ఖాళీగా ఉంచాలని భూషణ్ (ప్రొడ్యూసర్), అనిల్ (డిస్ట్రిబ్యూటర్)లను నేను కోరాను’’ అని ఓం రౌత్ చెప్పారు.
ఆ అభ్యర్థన చేసేటప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కనేవున్న ప్రభాస్ ఓదారుస్తూ కనిపించారు.
అయితే, ఇలా హనుమాన్‌కు ఒక సీటు కేటాయించాలని అభ్యర్థించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తోంది.
నెటిజన్లు ఏం అంటున్నారు?
ఈ ప్రకటనపై చైతు అనే నెటిజన్ స్పందిస్తూ ‘‘పురాణాల ప్రకారం హనుమాన్ అన్నిచోట్లా ఉంటారు. కలియుగం అంతమైన తర్వాత కూడా ఆయన ఉంటారు. కానీ, మీరేమో అన్ని థియేటర్లలోనూ మీరు కేటాయించిన సీట్లో కూర్చొని ఆయన సినిమా చూడాలని అంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
కత్యూషా అనే నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒక సీటేనా? శ్రీరామ్, సీతల మాటేమిటి? హనుమాన్ దేవుడిని నిర్లక్ష్యం చేయడమంటే హనుమాన్ భక్తులను నిర్లక్ష్యం చేయడం కాదా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
అసలు చెప్పులు వేసుకొని లోపలకు రావచ్చా? అని మరో నెటిజన్ స్పందించారు. ‘‘ఇలాంటి జిమ్నాస్టిక్స్ ప్రమోషన్స్‌తో మిమ్మల్ని మీరే ఎందుకు అపహాస్యం చేసుకుంటారు? తర్వాత మహాభారత్‌లో అశ్వత్థామకు కూడా సీట్ కేటాయించమంటారా?’’ అని ఆయన స్పందించారు.
మరో నెటిజన్ స్పందిస్తూ హనుమాన్‌కు ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుందా? అని ప్రశ్నించారు.
మరొక ట్విటర్ యూజర్ సుజిత్ స్పందిస్తూ.. ‘‘ఇది చెత్త, అర్థంపర్థం లేని నిర్ణయం’’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ‘‘నిజంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అరుంధతి సినిమా చూసినప్పుడు ఇలానే నా పక్క సీటు ఖాళీగా ఉంచ లేదు’’అని వ్యాఖ్యానించారు.
మరోవైపు టిక్కెట్ల పేర్లను మరో యూజర్ మారుస్తూ జోక్‌లు వేశారు. ‘‘అయోధ్య (బాల్కనీ) – 516, రామేశ్వరం (లోవర్ బాల్కనీ - 416), హనుమాన్ పక్కసీటు 1,116’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రోలింగ్ తొలిసారి కాదు..
ఆదిపురుష్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ సినిమా టీజర్ నిరుడు అక్టోబరు 02న విడుదల అయ్యింది.
అప్పుడు రావణాసురుడు, హనుమంతుడి పాత్రల చిత్రీకరణపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చాలా కృత్రిమంగా కనిపిస్తున్నారని కొందరు అంటే.. మరికొందరు ఏకంగా ఆయన్ను అల్లావుద్దీన్ ఖిల్జీతో పోల్చారు.
అయితే, తాజాగా విడుదలచేసిన ట్రైలర్‌లో రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సందర్భంలో ఆయన యాచకుడి వేషధారణలో ఉన్నారు.
అయితే, ఆ సీన్ మినహా మిగతా అంతా ఆయన ముందులానే ఉంటారని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు మార్ఫింగ్ చేసిన రావణాసురుడి ఫొటోలను కూడా ట్వీట్ చేశారు. మరోవైపు సినిమా వీఎఫ్ఎక్స్‌పైనా కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే: ఈ 7 ఆహార పదార్థాలతో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు...జాగ్రత్త
- డీలిమిటేషన్: లోక్‌సభ సీట్ల విభజన చేస్తే దక్షిణాది డమ్మీ అయిపోతుందా?
- చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: భారీ డ్యామ్ ధ్వంసం.. ప్రమాదంలో వేల మంది ప్రాణాలు
- యాపిల్ - విజన్ ప్రో: కొత్తగా విడుదలైన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ ఎలా పని చేస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)