You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు, 25 మంది మృతి.. దేశవ్యాప్తంగా హై సెక్యూరిటీ అలర్ట్
- రచయిత, ఫ్లోరా డ్రూరీ, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పోలీసులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరగడంతో బంగ్లాదేశ్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు.
రాజధాని ఢాకాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్ లైన్లు కూడా పని చేయడం లేదు.
గురువారం సాయంత్రం వేల మంది నిరసన కారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ ‘బీ టీవీ’ ఆఫీసుపై దాడి చేశారు. సామగ్రిని ధ్వంసం చేశారు. అద్దాలు, లైట్లు పగల గొట్టారు. ఆఫీసుకి నిప్పు పెట్టారు.
బీ టీవీ ప్రసారాలను నిలిపివేశామని, ఉద్యోగుల్లో అనేకమంది భవనం నుంచి బయటకు వెళ్లారని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖమంత్రి బీబీసీతో చెప్పారు.
అంతకు ముందు ఆఫీసు భవనం లోపల అనేక మంది ఉండిపోయారని, మంటల నుంచి వారిని కాపాడాలని అగ్నిమాపక శాఖను కోరుతూ బీ టీవీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం మినహా మాకు మరో దారి లేదు. నా తోటి ఉద్యోగులు కొంతమంది లోపల చిక్కుకుపోయారు. వాళ్లకు ఏమైందో నాకు తెలియదు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీ టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో చెప్పారు.
బుధవారం రాత్రి ప్రధానమంత్రి షేక్ హసీనా టీవీలో కనిపించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 25 మంది చనిపోయారని బీబీసీ బంగ్లా తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఇందులో వందల మంది గాయపడ్డారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మూడో వంతు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులకు ఇచ్చేలా ఉన్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగాలనేది వారి వాదన.
ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్ధుల మధ్య సమాచార మార్పిడి జరగకుండా గురువారం ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది.
అయితే గురువారం హింసాత్మక ఘటనల తీవ్రత బాగా పెరిగింది. ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాలను బట్టి ఆందోళనల్లో 32 మంది చనిపోయారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ చెబుతోంది.
ఇప్పటివరకు 25 మంది చనిపోయినట్లు ‘బీబీసీ బంగ్లా’ నిర్ధరించింది. అందులో 13 మంది గురువారం చనిపోయారు. వారిలో ఢాకా టైమ్స్‌లో పని చేస్తున్న 32 ఏళ్ల జర్నలిస్టు కూడా ఉన్నారు.
ఈ హింసాత్మక చర్యలను షేక్ హసీనా ఖండించారు. అయితే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నవారు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ వారు తిరస్కరించారు.
"ప్రభుత్వం అనేకమందిని హత్య చేసింది. ప్రస్తుత పరిస్థితుల మధ్య మేం ఎలాంటి చర్చల్లో పాల్గొనలేం" అని యాంటీ కోటా ఆందోళనల నాయకుడు నహిద్ ఇక్బాల్ చెప్పారు.
" ప్రధానమంత్రి హసీనా ఒక వైపు హింసకు ముగింపు పలకాలని అడుగుతూనే, మరోవైపు ప్రభుత్వ అనుకూల వర్గాలతో విద్యార్ధుల మీద దాడులు చేయిస్తున్నారు" అని 22 ఏళ్ల విద్యార్థి అలీమ్ ఖాన్ బీబీసీతో చెప్పారు.
గురువారం జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు రహదారుల్లో అడ్డంకులు సృష్టించడంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.
బీ టీవీ ఆఫీసుపై దాడి చేసిన వ్యక్తులు అంతకు ముందు ఓ పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారని టీవీలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చెప్పారు.
"పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసు అధికారులను ఆందోళనకారులు కొడుతుంటే వారు పరుగెత్తుకొచ్చి బి టీవీ ఆఫీసులో తలదాచుకున్నారని ఆ అధికారి ఏఎఫ్‌పీతో చెప్పారు. అలా బి టీవీ ఆఫీసుకు వచ్చినవారే అక్కడ విధ్వంసం సృష్టించారని చెప్పారు.
ఇదిలా ఉంటే, అధికార పార్టీ గ్రూపులు తమపై దాడి చెయ్యడంతో తాము మెడికల్ కాలేజ్ కాంపౌండ్‌లో తలదాచుకున్నట్లు కొంతమంది వైద్య విద్యార్థులు బీబీసీ బెంగాలీకి చెప్పారు.
"ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు నేను ఇక్కడకు వచ్చాను. పోలీసులు అనేక మంది విద్యార్థుల్ని చంపేశారు. దీనికి వ్యతిరేకంగా నేను ఆందోళన చేస్తున్నాను.మేము ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నాం. అయితే మా మీద ప్రభుత్వ అనుకూల వర్గాలు చేసిన దాడి చూస్తే, వాళ్లు మమ్మల్ని చంపేయడానికి వచ్చారేమో అని అనిపిస్తోంది " అని సుమి అనే విద్యార్థి చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)