వర్షం పడిన తరువాత ఇంట్లో ఈగలు ఎందుకు ఒక్కసారిగా ఎక్కువవుతాయి?

వర్షం రాగానే ఇంట్లోకి రకరకాల పురుగులు, కీటకాలు రావడం మొదలవుతాయి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఈగ. వర్షం తర్వాత ఇంట్లో ఈగలు శబ్ధాలు వినిపిస్తుంటాయి. పరిశుభ్రమైన ఆహారం మీద వాలి వాటిని పాడు చేస్తుంటాయి.

ఈగల శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, వర్షం పడిన తర్వాతే ఈగల సంఖ్య ఒక్కసారిగా ఎందుకు పెరుగుతుంది? దీని గురించి తెలుసుకోవడానికి మేము నిపుణులతో మాట్లాడాం.

వర్షం వస్తే ఈగల సంఖ్య ఎందుకు పెరుగుతుంది?

ఈగలను శాస్త్రీయ భాషలో డిప్టెరా అంటారు. ఈగలలో వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇంట్లో కనిపించే వాటిని 'హౌస్ ఫ్లై' అని పిలుస్తారు. దీన్ని వివరంగా అర్థం చేసుకోవడానికి నవ్సారి అగ్రికల్చరల్ యూనివర్శిటీ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం హెడ్, కీటక శాస్త్రవేత్త లలిత్‌కుమార్ ఘెటియాతో బీబీసీ మాట్లాడింది.

"ఈగలు కుళ్ళిన పదార్థాలను తింటాయి. వాటిమీదే జీవిస్తాయి.’’ అని లలిత్ కుమార్ చెప్పారు.

"వేసవి, శీతాకాలాలలో చెత్త తక్కువగా కుళ్ళిపోతుంది. ఆ వాతావరణం ఈగలకు అనుకూలంగా ఉండదు. కానీ వర్షం వస్తే అక్కడ తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. చాలా పదార్థాలు కుళ్ళిపోయి కనిపిస్తాయి. మొక్కల వ్యర్థాలు, ఇంట్లోని పొడి చెత్త తదితరాలు నీటి తాకిడితో పాడైపోతుంటాయి. తర్వాత అది దుర్వాసనకు దారితీస్తుంది." అని లలిత్ కుమార్ అన్నారు.

"ఆ వాసన ఈగలను ఆకర్షిస్తుంది. అక్కడికి చేరిన ఈగలు అక్కడే ఎక్కువ గుడ్లు పెడతాయి, వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది." అని అన్నారు. కుళ్ళిన పదార్థం ఈగలకు ఆహారమని లలిత్ చెప్పారు.

పొడి రోజుల్లో పదార్థాలు పెద్దగా కుళ్ళిపోవు, అందువల్ల దుర్వాసన రాదని, అందుకే ఈగలు ఎక్కువగా కనపడవని ఆయన చెప్పారు.

"ఇంకా వర్షాకాలంలో పుట్టే ఈగలు ఇతర సీజన్లలో పుట్టే ఈగల కంటే తక్కువ కాలం బతుకుతాయి." అని లలిత్ కుమార్ చెప్పారు.

ఎక్కవు వయసున్న(అడల్ట్) ఈగలకు ఎర్రటి కన్ను ఉంటుంది. ఈ ఈగలు 3 నుంచి 8 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి.

ఈగలు వ్యాధిని ఎలా వ్యాప్తి చేస్తాయి?

స్టీఫెన్ షుస్టర్ సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో రీసెర్చ్ డైరెక్టర్.

"చిన్న ఖాళీలు, పగుళ్ల గురించి తెలుసుకోవడానికి ఈగలను ఉద్దేశపూర్వకంగా స్వయంప్రతిపత్త బయోనిక్ డ్రోన్‌లుగా ఉపయోగించవచ్చు. ఈగలు తిరిగి వచ్చినపుడు అవి తమకు కాంటాక్ట్ అయిన ఏదైనా జీవసంబంధమైన పదార్థానికి సంబంధించిన సమాచారాన్ని అందించగలవు." అని స్టీఫెన్ అన్నారు.

ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలదని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.

"ఈగలు మురికిగా ఉన్న వాటిపై వాలుతాయి. అక్కడి సూక్ష్మజీవులు ఈగల పాదాలకు అంటుకుంటాయి. అవి మన ఇంట్లో పరిశుభ్రమైన ఆహారం మీద వాలితే, పదార్థాలపైకి ఆ సూక్ష్మజీవులు చేరతాయి. దీనివల్ల వ్యాధులు వస్తాయి.’’ అని లలిత్ చెప్పారు.

ఈగలు వాలిన ఆహారాన్ని తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

ఈగల ప్రత్యేకత

"ఈగ గాలిలో ఒకచోట నిశ్చలంగా ఉండగలదు. దానికి నిరంతరం ఎగరాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఈగకు ఒక బ్యాలెన్సర్ రెక్క ఉంటుంది. అందుకే గాలిలో నిలబడగలదు." అని తెలిపారు.

"ఈగ అద్దం వంటి ఏదైనా మృదువైన ఉపరితలంపై నడవగలదు. ఇలా చాలా కొద్ది ప్రాణులు మాత్రమే చేయగలవు." అని లలిత్ కుమార్ అన్నారు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)