‘ప్రపంచంలోనే ఒంటరి చెట్టు’, ఆడ తోడు కోసం ఎదురు చూస్తున్న ఈ మగ చెట్టు కథేంటి?

ఈ భూమి మీద ఇది ఒంటరి చెట్టు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అంతరించిపోయే దశలో ఉన్న వృక్ష జాతుల్లో ఇదొకటి. ఇందులో మగ నమూనా చెట్టు మాత్రమే బతికి ఉంది.

ఈ చెట్టుకు భాగస్వామి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు.

ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఒక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికాలోని వేల ఎకరాల అడవులను శాస్త్రవేత్తలు జల్లెడ పడుతున్నారు. అక్కడ మాత్రమే ఎన్‌సెపలోటాస్ ఊడి (Encephalartos woodii) అనే ఈ మొక్క దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ వృక్ష జాతి దాదాపు అంతరించిపోయింది. కేవలం మగ నమూనాలను మాత్రమే కాపాడగలిగారు. దీంతో దీని సహజమైన పునరుదాత్పదన అసాధ్యంగా మారింది.

డైనోసార్లు భూమి మీద నడవడానికి ముందే ఈ చెట్లు ఉండేవి. అయితే ప్రస్తుతం అవి అంతరించే దశకు చేరుకున్నాయి.

సౌతాంప్టన్ యూనివర్సిటీలో పరిశోధకురాలు డాక్టర్ లారా సింటీ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి ఆమె ఫిమేల్ ఇ- ఊడిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

“ఈ చెట్టు కథ నన్ను చాలా ప్రేరేపించింది. ఇది అవ్యక్త ప్రేమకి చెందిన క్లాసిక్ కథలలో ఒకటి” అని ఆమె చెప్పారు.

“ఎక్కడో ఒక చోట ఆడ చెట్టు ఉండవచ్చని అనుకుంటున్నాను. అది ఎక్కడో ఒక చోట దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఈ మొక్కను సహజ పునరుత్పాదన ద్వారా తిరిగి అస్తిత్వంలోకి తీసుకురాగలిగితే చాలు” అని డాక్టర్ లారా సింటీ చెప్పారు.

ఈ జాతికి చెందిన చెట్టును తొలిసారి 1895లో దక్షిణాఫ్రికా తూర్పు తీరం సమీపంలో ఉన్న నోయే అడవిలో కనుక్కున్నారు. అది మగ చెట్టు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అడవుల్లో ఈ. ఊడి జాతికి చెందిన మగ నమూనాలు మాత్రమే ఉన్నాయి.

ఆడ చెట్టు కోసం శోధించేందుకు డ్రోన్లతో అడవులను పై నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఆ ఫోటోలలో ఈ చెట్లు కనిపిస్తాయోమోనని ఏఐ టూల్స్‌తో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్లు 4,100 హెక్టార్ల అడవిలో రెండు శాతాన్ని కవర్ చేశారు.

“మేము తీసిన ఫోటోలలో మొక్కలను వాటి ఆకారాన్ని బట్టి గుర్తించగలిగే అల్గారిథం ఉపయోగిస్తున్నాం’’ అని డాక్టర్ సింటి చెప్పారు.

ఆడ చెట్టు ఉనికిలో ఉందో లేదో తెలుసుకోవడానికి అడవిని ఇంతకు ముందు ఈ స్థాయిలో ఎన్నడూ జల్లెడ పట్టలేదు.

లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్న్ నిపుణులు ఇప్పటికీ ఇలాంటి మగ మొక్కల్ని పెంచుతూ వాటి గురించి ప్రచారం చేస్తున్నారు. సందర్శకులు ఈ మొక్కలను అక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)