You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మను భాకర్‌కు కాంస్యం, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించారు.
మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుపొందారు.
ఒలింపిక్స్ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ గెలిచిన తొలి పతకం కూడా ఇదే.
మను సాధించిన ఈ పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు అన్ని ఒలింపిక్స్‌లలో కలిపి షూటింగ్ ఈవెంట్‌లో అయిదు పతకాలు చేరాయి.
ఆదివారం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నారు.
దక్షిణ కొరియా ప్లేయర్లు జిన్ యే ఓమ్, యేజి కిమ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణం, రజత పతకాలను సాధించారు.
మను పతకం గెలిచారిలా...
షూటింగ్ ఈవెంట్ ఫైనల్ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. విజేతను నిర్ణయించడానికి మొత్తం 24 షాట్లు అవసరం అవుతాయి.
ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్‌లు సంధిస్తారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
11, 12 షాట్‌లు ఆడిన తర్వాత అందరి కంటే తక్కువ స్కోరు ఉన్న షూటర్ పోటీ నుంచి వైదొలుగుతారు. ఇలా ప్రతీ రెండు షాట్‌ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు.
చివరకు 24 షాట్‌లు ముగిశాక టాప్-3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.
ఫైనల్లో మను భాకర్ ఆట ఎలా సాగిందంటే, మొదటి 10 షాట్లు ఆడిన తర్వాత 100.3 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచారు.
12వ షాట్ తర్వాత 121.2 పాయింట్లు, 14వ షాట్ తర్వాత 140.8 పాయింట్లు, 16వ షాట్ తర్వాత 160.9 పాయింట్లు, 18వ షాట్ తర్వాత 181.2 పాయింట్లు, 20వ షాట్ తర్వాత 201.3 పాయింట్లు, 22వ షాట్ తర్వాత 221.7 పాయింట్లు సాధించారు. ఈ దశలో 221.8 పాయింట్లు సాధించిన కిమ్ తదుపరి రెండు రౌండ్లకు అర్హత సాధించారు. మను ఎలిమినేట్ అయ్యారు. దీంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
విజేతగా నిలిచిన జిన్ యే 243.2 పాయింట్లు, రన్నరప్ కిమ్ యేజి 241.3 పాయింట్లు సాధించారు.
గతంలో ఏం జరిగింది?
టోక్యో ఒలింపిక్స్‌లో మను భాకర్ గన్ మొరాయించి ఆమెకు వేదనను మిగిల్చింది. ఎన్నోఅంచనాలతో టోక్యోకు వెళ్లిన ఆమె, కీలక సమయంలో గన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర నిరాశతో పతకం లేకుండా తిరిగొచ్చారు.
కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల మను భాకర్ పిస్టల్ గర్జించింది.
తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి మను భాకర్ గత ఒలింపిక్స్ తాలూకూ చేదు జ్ఞాపకాలను చెరిపేసుకున్నారు.
మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు దూసుకెళ్లి, 20 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా షూటర్‌గా ఘనత సాధించారు.
2004 ఏథెన్స్ క్రీడల్లో 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ సుమా షిరూర్ ఫైనల్ చేరారు.
భారత తొలి మహిళా షూటర్‌గా ఘనత
అలాగే, ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్ చేరిన భారత తొలి మహిళా షూటర్‌గా కూడా మను రికార్డులకెక్కారు.
ఫైనల్‌కు వెళ్లడమే కాకుండా పతకాన్ని కూడా అందుకున్నారు.
మను భాకర్ స్వస్థలం హరియాణాలోని గొరియా.
షూటింగ్ క్రీడాంశంలో శనివారం 10మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పోటీపడిన భారత జోడీలు, పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లు నిరాశపరిచిన చోట మను భాకర్ తన పిస్టల్‌తో సత్తా చాటారు.
మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను భాకర్ 580 పాయింట్లు సాధించి టాప్-3లో నిలిచారు.
ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 25మీ. పిస్టల్ ఈవెంట్‌తో పాటు, 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లలో పాల్గొంటున్నారు.
మను భాకర్ ఫైనల్‌కు ఎలా అర్హత సాధించారంటే..
క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
క్వాలిఫికేషన్ రౌండ్ 6 సిరీస్‌ల పాటు జరుగుతుంది. ఒక్కో సిరీస్‌లో 10 చొప్పున షాట్లు ఆడాలి.
అంటే, క్వాలిఫికేషన్ రౌండ్‌లో అన్ని సిరీస్‌లు కలిపి ప్రతీ ప్లేయర్‌కు 60 షాట్లు ఆడే అవకాశం ఉంటుంది.
ఈ 60 షాట్ల తర్వాత గరిష్ట స్కోరు సాధించిన 8 మంది ప్లేయర్లు ఫైనల్ బెర్తు దక్కించుకున్నారు.
వీరిలో హంగేరికి చెందిన మజోర్ వెరోనికా 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా షూటర్ ఓహ్ యే జిన్ 582 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
మను భాకర్ 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆరు సిరీస్‌లలో మను వరుసగా 97, 97, 98, 96, 96, 96 స్కోర్లు నమోదు చేశారు.
ఇందులో, ఆమె ఏకంగా 27 షాట్లలో పదికి పది స్కోరు సాధించడం విశేషం. టాప్-8లో నిలిచిన ఆటగాళ్లందరిలో ఈ అంశంలో మనూదే అత్యధిక స్కోరు.
ర్యాంకింగ్‌లో మను కంటే పైస్థానంలో నిలిచిన వెరోనికా 22 సార్లు, జిన్ 20 సార్లు 10 స్కోరు సాధించారు.
టోక్యో ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలు
15 మందితో కూడిన షూటింగ్ బృందం టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లింది. అప్పట్లో ఈ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జట్టు ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య పెంచుతుందని అందరూ భావించారు.
ముఖ్యంగా మను భాకర్, సౌరభ్ చౌధరీల నుంచి పతకాలను ఆశించారు. అప్పుడు మను వయస్సు 19 ఏళ్లు.
మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో గట్టి పోటీనిచ్చే షూటర్లలో భారత్ నుంచి మను భాకర్ ఒకరు.
ఈ విభాగంలో ఆమె ఖాతాలో ప్రపంచ కప్ స్వర్ణాలు, కామన్వెల్త్ పతకాలు ఉన్నాయి. 16 ఏళ్ల వయస్సులోనే యూత్ ఒలింపిక్స్ లోనూ ఆమె పతకాన్ని గెలుచుకున్నారు.
అయితే, టోక్యోలో ఆమె పాల్గొన్న మూడు ఈవెంట్లలోనూ ఒక్కదానిలో కూడా ఆమె ఫైనల్ చేరుకోలేదు. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఆమె గన్‌లో సాంకేతికత లోపం తలెత్తింది. దీంతో ఆమెపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. విలువైన సమయాన్ని కోల్పోయారు. ఫలితంగా ఫైనల్‌కు దూరమై కన్నీళ్లతో వెనుదిరిగారు.
ఈ ఫలితం తర్వాత మను ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నారు.
టోక్యో తర్వాత నిరుడు జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 25 మీ. పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జట్టులో మను సభ్యురాలు.
BBC ISWOTY ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్ అవార్డు
2021లో బీబీసీ ప్రదానం చేసిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాల్లో మను భాకర్ ‘ఎమర్జింగ్ వుమన్ ప్లేయర్- 2020’ అవార్డును అందుకున్నారు. దేశం కోసం మరిన్ని పతకాలు సాధించేందుకు బీబీసీ అవార్డు ప్రేరణ ఇస్తుందని అప్పుడు ఆమె అన్నారు.
భారత్ ఖాతాలో అయిదో ఒలింపిక్ షూటింగ్ పతకం
మను భాకర్ కంటే ముందు ఒలింపిక్స్ చరిత్రలో భారత షూటర్లు 4 పతకాలు సాధించారు.
తాజాగా మను సాధించిన కాంస్యంతో ఈ సంఖ్య అయిదుకు పెరిగింది.
2004 ఏథెన్స్ క్రీడల్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజతాన్ని సాధించి భారత్‌కు షూటింగ్‌లో తొలి పతకాన్ని అందించారు.
తర్వాత, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచి వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
2012 లండన్ క్రీడల్లో భారత షూటర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. ఈసారి ఇద్దరు షూటర్లు పతకాలు సాధించారు.
పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని, పురుషుల 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో విజయ్ కుమార్ వెండి పతకాన్ని సాధించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)