You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బచ్చలమల్లి రివ్యూ : అల్లరి నరేష్ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా?
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
దాదాపు రెండు దశాబ్దాలుగా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. 'మహర్షి', 'నాంది', 'నా సామిరంగా' వంటి సినిమాలతో సీరియస్ రోల్స్‌లో కూడా తాను మెప్పించగలనని నిరూపించుకున్నారు.
మళ్లీ ఇప్పుడు ఫుల్ ఆన్ మాస్ యాక్షన్ అపీల్‌తో నరేష్ నటించిన సినిమా 'బచ్చలమల్లి.'
ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త రస్టిక్ లుక్‌తో, మాస్ అపీల్‌తో 'అల్లరి' నటించిన ఈ సినిమా ఎలా ఉంది?. నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
కథ ఏంటి?
రెండు సమయాల్లో జరిగే కథ ఇది. ఒకటి బచ్చలమల్లిని 2005లో చూపిస్తే, ఇంకొకటి అతని గతం (1990ల్లో) చెప్పే కథ.
బచ్చలమల్లి తెలివైన విద్యార్థి. పదో తరగతిలో జిల్లాకే మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడు. తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రి వల్లే అతను ఎందుకు మూర్ఖుడిగా, చెడ్డవాడిగా మారిపోయాడు? ప్రేమించిన కావేరి కోసం అతను ఏం చేశాడు? వారి ప్రేమ ఫలించిందా? చివరకు బచ్చలమల్లి జీవితం ఏమైంది? అన్నదే కథ.
పాత కథే ఇది. ఎన్నో సినిమాల్లో చూసేసినదే. కాకపోతే కథ జరుగుతూ ఉంటే ఎన్నో ఎమోషన్స్ నడుస్తూ ఉంటాయి. కానీ కథ మీద కన్నా డైరెక్టర్ 'బచ్చలమల్లి' పాత్ర మీదే ఎక్కువగా ఫోకస్ చేయడంతో సినిమా ట్రాక్ తప్పింది.
అసలు ఇందులో హీరోకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. తెలియని అమ్మాయి మీద ప్రేమ ఎందుకు పుట్టిందో, ఆమె కోసం ఏ కారణం లేకుండా మారిపోవాలని ఎందుకు అనుకుంటాడో తెలియదు. బచ్చల్లమల్లిలో అర్థం పర్థం లేని కోపమే సినిమాలో ప్రేక్షకులకు కనిపిస్తుంది.
బచ్చల్లమల్లి కోపం, ప్రేమ, మంచితనం, ద్వేషం, మూర్ఖత్వం... ఏదీ కూడా ఎమోషనల్‌గా ఎస్టాబ్లిష్ కాలేదు. దీంతో స్టోరీ, స్క్రీన్‌ప్లే ట్రాక్ తప్పింది.
ఎవరి నటన ఎలా ఉంది?
వైవిధ్య పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించడానికి నరేష్ వరుస సినిమాలతో ప్రయత్నం చేస్తున్నాడు. 'బచ్చలమల్లి'లో పూర్తిగా వేరియేషన్ ఉన్న పాత్ర ట్రై చేశాడు.
ఒక అరగంట సేపు ఈ కొత్త పాత్ర బాగున్నట్టే అనిపించినా తర్వాత మాత్రం తేలిపోయింది.
నరేష్‌కి మల్లి కేరెక్టర్ డైలాగ్ డెలివరీ నప్పలేదు. కొన్నిచోట్ల కృతకంగా ఉంది. నరేష్ గట్టిగానే లుక్స్-యాక్టింగ్ పరంగా ప్రయత్నించినా పెద్ద పస లేని పాత్రగానే మిగిలిపోయింది బచ్చల్లమల్లి.
బచ్చలమల్లి – కావేరి (అమృత) లవ్ ట్రాక్ బలంగా లేకపోవడంతో ఆమె నటన కూడా సినిమాకు కలిసి రాలేదు.
రావు రమేశ్, రోహిణి లాంటి స్టార్ కాస్టింగ్‌ను డైరెక్టర్ సరిగ్గా వినియోగించుకోలేదు.
ఈ సినిమాలో కామెడీ ఫరవాలేదనిపించింది.
దర్శకత్వం ఎలా ఉంది?
'సోలో బతుకే సో బెటర్' సినిమా తర్వాత సుబ్బు మంగదీవి దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది.
కమర్షియల్ ఫార్ములా, కొంత ఫ్యామిలీ ఎమోషన్స్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నా... 'బచ్చలమల్లి' పాత్రను ఫిట్ అయ్యేలా చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
పల్లెటూరి వాతావరణం, తల్లిదండ్రులు, ప్రేమించిన అమ్మాయి, తండ్రి మీద కోపం, వ్యాపార రీత్యా గొడవలు... ఇలా మల్లితో కనెక్ట్ అయ్యే ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఈ కథలు ఏవీ కూడా మల్లికి ప్రేక్షకులు మంచి మార్కులు వేసేలా చేయలేకపోయాయి.
బచ్చలమల్లితో ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ప్రతి సీన్‌లోనూ మల్లి పాత్ర ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.
మొత్తం మీద ఎమోషనల్ ఎలిమెంట్స్‌ని స్క్రీన్‌పై సరిగ్గా ప్రజెంట్ చేయడంలో మాత్రం దర్శకత్వ వైఫల్యం కనిపిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)