You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్నేహితురాలితో కలిసి వాకింగ్‌కు వెళ్లిన యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారనే ఆరోపణలు, పోలీసులు ఏం చెప్పారంటే..
పుణెలోని బోప్‌దేవ్ ఘాట్ సమీపంలో అక్టోబర్ 3 రాత్రి తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుణె పోలీస్ జాయింట్ కమిషనర్ రంజన్ కుమార్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం, గురువారం (2024 అక్టోబర్ 3) రాత్రి 11 గంటలప్పుడు ఒక యువతి తన స్నేహితురాలితో కలిసి బోప్‌దేవ్ ఘాట్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన జరిగిన ప్రదేశం చీకటిగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన గురించి శుక్రవారం (2024 అక్టోబర్ 4) తెల్లవారుజామున 5 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పుణె జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజన్ కుమార్ శర్మ తెలిపారు.
నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు పుణె పోలీసులు పది క్రైమ్ బ్రాంచ్, డిటెక్టివ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
పుణె పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రతిపక్షాల విమర్శలు
మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల కారణంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్) అధినేత శరద్ పవార్ అన్నారు.
“మహిళల కోసం ప్రభుత్వం లడ్కీ బహిన్ యోజనను ప్రారంభించింది. దాని వల్ల మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఓ వైపు లడ్కీ బహిన్ యోజన అమలు చేస్తుంటే, మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళల మీద జరుగుతున్న నేరాల పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది” అని శరద్ పవార్ అన్నారు.
ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రతపై ఎన్సీపీ (శరద్ పవార్ గ్రూప్) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. పుణెతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. పుణెలో జరిగింది చాలా ఆందోళన కలిగించే ఘటన అని చెప్పారు.
మహిళల భద్రత కోసం రాష్ట్ర హోం శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సుప్రియా సూలే విమర్శించారు.
"ఇది చాలా షాకింగ్ ఘటన! పుణెలో ఏం జరుగుతోంది? ఈ ఘటనలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకపోవడం దురదృష్టకరం” అని సుప్రియా సూలే “ఎక్స్”లో పోస్ట్ పెట్టారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)