ఈ విజయం కక్షసాధింపు కోసం కాదు : పవన్ కల్యాణ్

''ఈ విజయం వైసీపీని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు పునాది వేయడానికి'' అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

'' ఇది ఎంతో చారిత్రాత్మక రోజు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి.

ఈ విజయం కక్షసాధింపుల కోసం కాదు.

ఏపీ విభజన జరిగినప్పటి నుంచి ఉన్న చీకటి రోజులు అయిపోయాయి.

భవిష్యత్తు తరాల భవితను భుజాలపై వేసుకుని, బాధ్యతతో నడిచే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుంది.

ఏం మాట్లాడాలో తెలియడం లేదు నాకు. జీవితంలో ఇప్పటి వరకూ నాకు విజయం తెలీదు.

సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ అనే విజయం చూశా. ఆ తర్వాత నాకు ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించిందని కానీ, డబ్బులు వచ్చాయో రాలేదో కూడా తెలీదు.

ఇప్పటి వరకూ మాటలు పడడమే. కానీ, మీ గుండెల్లో ఇంత స్థానం సాధించా.

భారతదేశంలో వందకు వంద శాతం సీట్లు కొట్టామంటే అది జనసేనే.

మార్పు కావాలి, పాలన మారాలి. కోట్లాది మంది ఆకాంక్ష ఈ తీర్పు.

మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కక్ష సాధింపుల సమయం కాదు.

అన్నదాతలకు అండగా ఉండాల్సిన సమయం, ఆడబిడ్డలకు రక్షణగా నిలబడాల్సిన సమయం.

ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం స్థానంలో దానికి సరిసమానంగా ఉండే పెన్షన్ స్కీం తీసుకొస్తామని మాటిచ్చాం. ఏడాదిలోపు చేయిస్తాం.

మెగా డీఎస్సీ బాధ్యత తీసుకుంటాం.

యువత అల్లాడిపోతున్నారు, ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు.

పోటీ చేసింది 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు. అన్నీ గెలిచాం.

కానీ, 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యతతో పనిచేస్తాం.

రోడ్లు వేయలేదు, గుంతలు పడిపోయాయి. అవన్నీ బాగవుతాయి. శాంతిభద్రతలు బలంగా ఉంటాయి. మీకు మాటిస్తున్నా.

అధికారులు వారి పని వారు చేసుకునేలా రాజకీయ ప్రభావం లేకుండా చూస్తాం.

నేను డబ్బు కోసం, పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు. కులం లేదు, మతం లేదు, కానీ నన్నెవరూ పట్టించుకోవడం లేదని బాధపడే వారి భుజం కాయడానికి వచ్చాను నేను.

2019లో ఓడిపోయాను. అప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే ఉన్నాను. అంతే ధైర్యంగా ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ, అహంకారం కాదు.

అందరూ నాకు శుభాకాంక్షలు చెబుతుంటే నాకు భయమేసింది. ఎందుకంటే, ఇల్లు అలకగానే పండగ కాదు. చాలా చాలా బాధ్యతతో కూడుకున్నది.

భీమవరం, గాజువాకలో ఓడిపోయిన రోజున నన్ను నమ్ముకున్న కొద్దిమందే నాతో ఉన్నారు. అయినా, నేను భయపడలేదు. ఓటమి నాకు ధైర్యాన్నిచ్చింది.

తిరుపతిలో యోగా నేర్చుకునేప్పుడు ఒకటి చదువుకున్నా. ధర్మోరక్షతి రక్షిత: అని. ఆ ధర్మమే గెలిపించింది.

పిఠాపురం ప్రజలందరికీ, యువతకు, కదంతొక్కిన జనసేన యువకులకు, నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నా.

మీరు పవన్ కల్యాణ్‌ను మాత్రమే గెలిపించలేదు, ఐదు కోట్ల మంది ఆకాంక్షలను గెలిపించారు.

ఇది చిన్నపాటి విజయం కాదు, ఆకాశమంత విజయాన్ని ఇచ్చారు. ఇది గుండెల్లో పెట్టుకుంటాం. నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ ఇంట్లో ఒక్కడిగా ఉంటా.'' అన్నారు జనసేనాని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)