‘‘ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణానికి బాధ్యత ఎవరిది?’’

    • రచయిత, గాలి నాగరాజ
    • హోదా, బీబీసీ కోసం

పదేళ్ల కఠిన జైలు జీవితం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రొఫెసర్ సాయి బాబా శనివారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మౌనంగా నిష్క్రమించారు. తనకు చివరివరకూ తోడుగా వున్న వీల్ చైరే ఆయన కఠినప్రయాణానికి మౌనసాక్షిగా నిలబడింది.

అయితే అయన నిష్క్రమణచట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ( ఉపా) అమలు పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. జైళ్లలో ఖైదీలపైన ముఖ్యంగా ఉపా ఖైదీల పైన చూపుతున్న వైఖరిని బోనులో నిలబెట్టింది.

ఈ చట్టం కింద ఆరెస్ట్ అయిన నిందితులతో ప్రభుత్వం వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతోంది. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అనారోగ్యంతో ఇటు దిల్లీలోనూ అటు హైదరాబాద్‌లోనూ సాయిబాబా ఆస్పత్రుల చుట్టూ తిరిగిన విషయాన్ని పలువురు సామాజిక వేత్తలు గుర్తుచేస్తున్నారు.

జైలులో ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం వల్లే అనారోగ్యం పాలయ్యారని, ఆయన చావుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

‘మానవ హక్కుల నిరాకరణ’

ఐదేళ్ల వయసులో సాయిబాబాకు పోలియో సోకి రెండు కాళ్లు పనిచేయడం మానేశాయి. అందువల్ల 90 శాతం అంగవైకల్యం కలిగింది.

‘‘అటువంటి మనిషిని అత్యంత బలీయమయిన రాజ్యవ్యవస్థకు ప్రమాదకరమని భావించడం నమ్మశక్యంగా లేదు’’ అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ బీబీసీతో అన్నారు.

సాయిబాబా విషయంలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించి జైలులో ఖైదీలకు కల్పించాల్సిన కనీస హక్కులను కూడా నిరాకరించింది. తనకు రెండు కాళ్లు పనిచేయనందువల్ల తన సెల్‌లో వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటుచేయాలని ప్రొఫెసర్ సాయిబాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ చిన్న కోర్కెను కూడా ప్రభుత్వం నిరాకరించడం అమానవీయమని నాగేశ్వర్ అన్నారు.

బీమా కోరేగావ్ కేసు పేరుతో ప్రాచుర్యం పొందిన కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన ఒక్క సాయిబాబా అనే కాదు, చాలామంది ఖైదీల పట్ల ప్రభుత్వ వర్గాలు వ్యవహరించిన తీరు ఇపుడు ప్రశ్నార్థకమవుతోంది. ఖైదీలను కనీసం మనుషులుగా చూడకపోవడం, వారి కనీస అవసరాలను నిరాకరించడం ఏ రకంగా మానవీయమని హక్కుల కార్యకర్తలు సామాజికవేత్తలు సోషల్ మీడియాలోనూ బయటా ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం చట్టం ప్రకారమే ప్రవర్తించామని చెబుతూ వచ్చినప్పటికీ తీవ్ర ప్రశ్నలయితే వ్యక్తమవుతున్నాయి.

ఇదే కేసులో జైలులోనే మరణించిన స్టాన్ స్వామి ఉదంతం కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది. క్యాథలిక్ మత గురువు స్టాన్ స్వామి గిరిజన హక్కుల కోసం పోరాడే ఒక నాయకుడు. ఉపా చట్టం కింద ఆయనను 2018 లో రాంచీలో అరెస్ట్ చేశారు. జైలులో ఉండగానే 2021 లో 75 ఏళ్ల వయసులో స్వామి మృతి చెందారు.

స్టాన్ స్వామి పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుడు. ద్రవ పదార్థాలు తీసుకోవడానికి వీలుగా స్ట్రా కావాలని అడిగితే జైలు అధికారులు ఈ చిన్న కోర్కెను కూడా అంగీకరించలేదని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఆంధ్రా, తెలంగాణా ఉమ్మడి రాష్ట్రాల స్టీరింగ్ కమిటీ సభ్యుడు యస్. జీవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

స్టాన్ స్వామి స్ట్రా కోసం జైలులోంచి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన విషయంలో జైలు అధికారుల వైఖరిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

స్టాన్ స్వామిది జ్యుడీషియల్ హత్య అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం మాత్రం తమ వైఖరిని సమర్థించుకుంటూ వచ్చింది. రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన కేసులో ఆయన ముద్దాయి అని, ఈకేసులో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటూ వచ్చామని చెబుతూ వచ్చింది.

అదే చట్టం కింద 75 ఏళ్లు పైబడిన కవి, రచయిత వరవరరావుని 2018లో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. షరతులతో కూడిన పూచీ కత్తుపైన బెయిల్ పొందిన ఆయన ముంబయిలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

వసంత పోరాటం

సాయిబాబా తుది శ్వాస వరకు అయన సహచరి వసంతకుమారి అండగా నిలబడ్డ తీరు ఉత్తేజం కలిగిస్తుందని వసంత స్నేహితురాలు కొండవీటి సత్యవతి అన్నారు.

‘‘జైలు లోపల సాయిబాబా పోరాడితే బయట వసంత ఆయన కోసం దాదాపుగా ఒంటరి పోరు చేశారు. అరెస్టయ్యాక సాయిబాబాకు ఉద్యోగం పోయింది. ఒక వైపు ఇల్లు గడవడమే కష్టం. మరో వైపు భర్త కోసం జైలు వెలుపల పోరాటం. వసంత కష్టాలు వర్ణనాతీతం. అయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సాయిబాబాకు అండగా వసంత చివరి వరకూ నిలబడ్డారు.’’ అని సత్యవతి అన్నారు.

ఇక్కడ సాయిబాబా, వసంతల అనుబంధం గురించి కొంత చెప్పాలి. ఇద్దరు ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం దగ్గరలోని ఒకే గ్రామానికి చెందినవారు. హైస్కూల్ రోజుల నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సుఖాలనే కాదు కష్టాలనూ సాయిబాబాతో కలిసి వసంత పంచుకున్నారు.

‘ప్రజాస్వామ్యానికి ప్రమాదం’

కొంత కాలం కిందట పౌర హక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు 151 మంది తెలంగాణ ఉద్యమకారుల మీద ఉపా కేసు పెట్టారు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు అదే రకమైన ధోరణిని వ్యక్తం చేశారు. మొత్తంగా పౌర సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగా వీళ్లకు ఉపా నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిలిపేసింది.

మానవహక్కులకు వ్యతిరేకమైన ఉపా చట్టంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జీవన్ కుమార్ అభిప్రాయపడ్డారు. పౌరహక్కుల కోసం ఉద్యమించే వారందరితోను ఒక విశాల వేదికను నిర్మించడం తక్షణ కర్తవ్యం అని అయన చెప్పారు.

‘‘దేశ భద్రత కోసం తీవ్రవాదాన్ని అరికట్టాల్సిందే. అందుకు అనుగుణమయిన చట్టాలు రావాల్సిందే. కానీ ఈ పేరుతో చట్టాలను దుర్వినియోగం చేస్తే దేశ ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని, ఉపా చట్టం ప్రజాస్వామ్యానికి ముప్పు కాకూడదు’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

అదే జరిగితే అధికారాన్ని ప్రశ్నించేవారు కరువవుతారని, పాలనలో నియంతృత్వ పోకడలు పెచ్చరిల్లుతాయని నాగేశ్వర్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)