You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరుంధతీ రాయ్: ‘ఉపా’ చట్టం కింద విచారణకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం
రచయిత అరుంధతీ రాయ్‌ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కింద విచారించడానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి ఇచ్చారు.
అరుంధతీ రాయ్‌తో పాటు కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, డాక్టర్ షేక్ షౌకాత్ హుస్సేన్‌ను ఉపా చట్టంలోని సెక్షన్ 45 కింద విచారించేందుకు సక్సేనా అనుమతులు మంజూరు చేశారు.
దిల్లీలో 2010లో జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారనే ఆరోపణల మీద ఇప్పుడు వీరిద్దరిని విచారించనున్నారు.
సుశీల్ పండిత్ అనే వ్యక్తి 2010 అక్టోబర్ 28న చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో నిందితులను విచారించేందుకు గతంలో కూడా అనుమతులు మంజూరయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ 196 కింద లెఫ్టినెంట్ గవర్నర్ 2023 అక్టోబర్‌లో అనుమతులు మంజూరు చేశారు.
‘‘అజాదీ: ద ఓన్లీ వే’’ పేరిట న్యూదిల్లీలోని ఎల్జీటీ ఆడిటోరియంలో 2010 అక్టోబర్ 10న జరిగిన ఒక సమావేశంలో అరుంధతీ రాయ్, షౌకాత్ హుస్సేన్‌లు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ‘‘భారత్ నుంచి కశ్మీర్ వేర్పాటు’’ అనే అజెండాతో ఆ సమావేశంలో చర్చలు, సంభాషణలు జరిగినట్లు పేర్కొన్నారు.
ఆ సమావేశంలో ప్రసంగించిన వారిలో సయ్యద్ అలీ షా గిలానీ (కశ్మీర్ వేర్పాటువాద నేత), సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీ (పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్షపడి నిర్దోషిగా విడుదలైన దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్), అరుంధతీ రాయ్, డాక్టర్ షేక్ షౌకాత్ హుస్సేన్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావు ఉన్నారు.
కశ్మీర్ ఎన్నడూ భారత్‌లో భాగంగా లేదని, భారత సాయుధ బలాలు బలవంతంగా కశ్మీర్‌ను ఆక్రమించాయని, భారత్ నుంచి జమ్మూకశ్మీర్ స్వాతంత్ర్యం కోసం వీలైనన్ని విధాలుగా కృషి చేయాలని ఈ సమావేశంలో గిలానీ, అరుంధతీ రాయ్‌లు బలంగా వాదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రికార్డింగ్‌లను కూడా సమర్పించారు.
ఫిర్యాదుదారుడు దిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 156 (3) కింద వారిపై ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో పాటు విచారణ చేపట్టారు.
తాజాగా వీరిపై ఉపా చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతినిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)