You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత్, కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్‌కు ప్రవేశించింది. దుబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్(42), రవీంద్ర జడేజా జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ జట్టులో అత్యధికంగా విరాట్ కోహ్లీ 84 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేశాడు.
265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్‌ను బెన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ (29 పరుగులు)కూడా స్పిన్నర్ కూపర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
తర్వాత కోహ్లీ, శ్రేయస్‌ల జోడీ ఇన్నింగ్స్ నిర్మించింది. ఈ ద్వయం మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించింది. శ్రేయస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్, కోహ్లీకి తోడుగా నిలవడంతో భారత్ నిలదొక్కుకుంది.
జట్టు స్కోరు 178 పరుగుల వద్ద ఉండగా అక్షర్(27 పరుగులు)ను నాథన్ ఎల్లీస్ ఔట్ చేశాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ జట్టును టార్గెట్ దిశగా నడిపాడు.
అయితే, 84 పరుగులు చేసిన కోహ్లీని ఆడమ్ జంపా ఔట్ చేయడంతో భారత శిబిరంలో టెన్షన్ మొదలైంది. కానీ, పాండ్యా హిట్టింగ్ (24 బంతుల్లో 28 పరుగులు), రాహుల్ సమయోచిత బ్యాటింగ్‌తో భారత జట్టు 48.1 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది.
చేజ్ మాస్టర్ కోహ్లీ
వన్డే క్రికెట్‌లో తాను 'చేజ్ మాస్టర్' అని మరోసారి నిరూపించుకున్నాడు కింగ్ కోహ్లీ.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ, ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కొత్త రికార్డులు కూడా ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ 8,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. అతని కంటే ముందు ఈ ఘనత సాధించింది సచిన్ తెందూల్కర్.
కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
ఇది సమష్టి విజయమని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.
రోహిత్ మాట్లాడుతూ "ఈ పిచ్‌పై షాట్లు ఆడడానికి పెద్దగా అవకాశం లేదు. అయినా, మేం బ్యాటింగ్ చేశాం."
"మాకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఆరుగురు బౌలర్లు, బ్యాటింగ్‌లో అనుభవం, అదే నాకు అవసరం. ఈ క్రెడిట్ అందరిదీ. విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నాడు."
"హార్దిక్ పాండ్యా కూడా మంచి షాట్లు ఆడాడు. ఫైనల్‌కు వెళ్లినప్పుడు, ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం ఫైనల్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు" అని రోహిత్ శర్మ అన్నారు.
రాణించిన భారత బౌలర్లు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టుకు భారత్ బౌలర్ మొహమ్మద్ షమీ ఆదిలోనే షాక్ ఇచ్చాడు.
తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగూ చేయని కూపర్, షమీ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.
స్మిత్ అర్ధ సెంచరీ
అయితే, ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన ట్రావిస్‌ను ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత స్మిత్, లబుషేన్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. వీరిద్దరు కలిసి ఆసీస్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు.
అయితే, ఇన్నింగ్స్ 23వ ఓవర్లో లబుషేన్(29)ను, 27 ఓవర్లో ఇంగ్లిష్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 73 పరుగులు చేసిన స్మిత్‌ను షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (7) కూడా వెంటనే ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.
ఆ తర్వాత అలెక్స్ క్యారీ (57 బంతుల్లో 61 పరుగులు) రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లో 264 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, జడేజా, వరుణ్ రెండేసీ వికెట్లు తీశారు.
న్యూజీలాండ్‌తో ఆడిన జట్టుతోనే భారత్ సెమీఫైనల్లో దిగింది. ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాట్ షార్ట్ స్థానంలో కూపర్, జాన్సన్ స్థానంలో స్పిన్నర్ తన్వీర్ సంఘా జట్టులోకి వచ్చారు.
కోహ్లీ మరో రికార్డు
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక(161) క్యాచ్‌లు పట్టిన రెండో ఫీల్డర్‌గా కోహ్లీ నిలిచాడు. రికీ పాంటింగ్ (160) రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. పాంటింగ్ 375 వన్డేలలో 160 క్యాచ్‌లు అందుకున్నాడు.
షమీ బౌలింగ్‌లో లాంగ్-ఆన్‌లో నాథన్ ఎల్లిస్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టి కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో షార్ట్-కవర్‌లో జోష్ ఇంగ్లిస్ కొట్టిన బంతిని కోహ్లీ క్యాచ్ అందుకొని పాంటింగ్ రికార్డును సమం చేశాడు.
గిల్ క్యాచ్‌పై వివాదం
వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ కొట్టిన బంతిని శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, బంతిని వెంటనే వదిలేసి సంబురాలు చేసుకోవడం వివాదంగా మారింది. గిల్‌తో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మాట్లాడుతున్నట్లు కనిపించింది.
ఆ సమయంలో మ్యాచ్ లైవ్‌లో కామెంటేటర్లుగా ఉన్న హర్షా భోగ్లే, మైక్ అథర్టన్, మాథ్యూ హేడెన్‌లు దీనిపై మాట్లాడారు.
గిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రావిస్ క్యాచ్ అందుకున్నాడు. బంతిని పట్టుకుని, వెంటనే గాల్లోకి విసిరాడు.
క్రికెట్ నిబంధనల ప్రకారం, ఏ ఫీల్డర్ అయినా క్యాచ్ తీసుకునేటప్పుడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే, అది సరైన క్యాచ్‌గా పరిగణించరు.
గిల్‌కు అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ఈ విషయం సూచించారని వ్యాఖ్యాతలు భావించారు.
గిల్ క్యాచ్ అందుకొని, పూర్తిగా నియంత్రణలోనే ఉన్నాడని కామెంటేటర్ మైక్ అథర్టన్ అభిప్రాయపడ్డారు. క్యాచ్ గురించి ఎటువంటి సందేహం ఉండకూడదని ఆయన అన్నారు. గిల్ క్యాచ్ సరైనదేనని మాథ్యూ హేడెన్ కూడా అభిప్రాయపడ్డారు.
అయితే, రూల్స్ విషయంలో గిల్ జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)