You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయి: గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఫెర్రీని ఢీకొట్టిన నౌకాదళ పడవ, 13 మంది మృతి
ముంబయి సముద్రతీరంలో పర్యటకులతో వెళుతున్న ఫెర్రీని నౌకాదళ పడవ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు.
గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతం నుంచి ముంబయిలోని ఎలిఫెంటా ద్వీపానికి వెళుతున్న ప్రయాణికుల బోటును నేవీ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫడణవీస్ నాగ్‌పూర్‌లో ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.
'మధ్యాహ్నం 3.55 గంటలకు నీల్‌కమల్ అనే ప్యాసింజర్ బోటును నేవీ బోటు ఢీకొట్టింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగింది. 101 మందిని రక్షించారు. 13 మంది చనిపోయారు. ఇందులో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి నేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’’ అని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దేవేంద్ర ఫడణవీస్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, పోలీసులు, స్థానిక మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
‘‘పోలీసులతో, స్థానిక అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అదృష్టవశాత్తూ చాలామందిని రక్షించగలిగాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని ఫడణవీస్ తెలిపారు.
రంగంలోకి హెలికాప్టర్లు
ఈ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విటర్ లో స్పందిస్తూ.. ముంబయి హార్బర్ లో ప్యాసింజర్ ఫెర్రీ, ఇండియన్ నేవీ పడవ ఢీకొన్న ఘటనలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
‘‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి " అని తెలిపారు.
నౌకదళం,జేఎన్‌పీటీ, తీరప్రాంతదళం, ఎల్లోగేట్ పోలీస్ స్టేషన్ 3, స్థానిక ఫిషింగ్ బోట్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బీబీసీ మరాఠీ సర్వీస్ తెలిపింది.
బోటు మునిగిన ఘటనలో 56 మందిని జేఎన్ పీటీ ఆస్పత్రికి, 9 మందిని నేవీ డాక్ యార్డ్ ఆస్పత్రికి, 9 మందిని సెయింట్ జార్జ్ ఆస్పత్రికి, ఒకరిని అశ్విని ఆసుపత్రికి తరలించారు.
ఇదే సమయంలో ఈ ఘటనపై నౌకాదళం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
‘‘ఈ మధ్యాహ్నం ముంబయి హార్బర్‌లో ఇంజిన్ ట్రయల్స్ సందర్భంగా భారత నౌకాదళం పడవ ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా నియంత్రణ కోల్పోయింది. దీంతో పడవ ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొంది. 13 మంది చనిపోయారు. క్షతగాత్రులను ఘటనాస్థలి నుంచి సమీప ఆస్పత్రికి తరలించామని’’ తెలిపింది.
ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు మొదలుపెట్టాం. నేవీ హెలికాప్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. 11 పడవలు, ఒక తీరప్రాంత గస్తీదళ పడవ, మూడు మెరైన్ పోలీసు బోట్లు గాలింపుచర్యలో పాల్గొన్నట్టు నేవీ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)