"ఏమీ మారలేదు. భారత్ పన్నులు చెల్లిస్తుంది, మేం చెల్లించం": డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై విధించిన సుంకాలు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీం కోర్టు నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ 6-3 మెజారిటీతో ఈ తీర్పును ప్రకటించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేందుకు సుంకాలను ట్రంప్ ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
విదేశాల నుంచి అమెరికాకు తమ ఉత్పత్తులను దిగుమతి చేసే సంస్థల నుంచి 10 బిలియన్ డాలర్లు వసూలు చేసేందుకు ట్రంప్ సుంకాలను వేగంగా అమలు చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
సుంకాల వాపసుపై అస్పష్టత
సుంకాలు రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు సేకరించిన సుంకాలను కంపెనీలకు తిరిగి చెల్లించడంపై ఏమీ చెప్పకపోవడంతో అనిశ్చితి నెలకొంది.
సుంకాలు చెల్లించిన దిగుమతిదారుల సొమ్మును వారికి తిరిగి చెల్లించే అంశాన్ని సుప్రీం కోర్టు కింది కోర్టులకు వదిలేసింది.
సుంకాల ద్వారా వసూలు చేసిన సొమ్ము విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించకపోవడంతో ట్రంప్ సుప్రీం కోర్టును విమర్శించారు.
"ఈ అంశం గురించి ప్రస్తావించలేదు. ఈ కేసు కింది కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతుంది" అని ట్రంప్ అన్నారు.
సుంకాల రూపంలో తిరిగి చెల్లించాల్సిన సొమ్ము 170 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అమెరికన్ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
ట్రంప్ విధించిన సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో, తిరిగి చెల్లించాల్సిన మొత్తం సగానికి పైగానే ఉంది.
కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ ఈ ఏడాది చివరి వరకు సుంకాల ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.
సుప్రీం కోర్టు సుంకాల విధింపు చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు ట్రంప్ నిరాకరించారు.
చట్టపరంగా అధ్యక్షుడికున్న అధికారాన్ని ఉపయోగించి కొత్తగా 10 శాతం సుంకాలు విధించే ఉత్తర్వులపై సంతకం చేసినట్లు ఆయన ప్రకటించారు.
"మేం వెనకడుగు వేయడం లేదు. ఇంకా ఎక్కువగా వసూలు చేస్తాం" అని ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ప్రభావమేంటి?
సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
కోర్టు నిర్ణయం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ, "ఏమీ మారలేదు. భారత్ పన్నులు చెల్లిస్తుంది. మేం చెల్లించం" అని అన్నారు.
"ఇంతకుముందు ఉన్న దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. గతంలో అమెరికా పన్నులు చెల్లించేది. ఇప్పుడు భారత్ చెల్లిస్తుంది" అన్నారు ట్రంప్.
భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచివారని, కానీ మనకంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.
"మేం భారత్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు అది న్యాయమైన ఒప్పందం. మేం వారికి సుంకాలు చెల్లించడం లేదు. ఇప్పుడు భారత్ సుంకాలు చెల్లిస్తోంది. మేం పరిస్థితుల్ని మార్చేశాం" అని ట్రంప్ అన్నారు.
భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందం నిబంధనల ప్రకారం, అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి.
యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122 ఉపయోగించి 10 శాతం గ్లోబల్ టారిఫ్స్ విధిస్తానని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ చెప్పారు. ఇవి మూడు రోజుల్లో అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.
కోర్టు రద్దు చేసినప్పటికీ, ట్రంప్ విధించిన సుంకాలు150 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. సెక్షన్ 232 కింద జాతీయ భద్రత కారణాల దృష్ట్యా ఉక్కు, అల్యూమినియం వంటి వాటిపై విధించిన సుంకాలు, సెక్షన్ 301 కింద వాణిజ్యంలో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ విధించిన సుంకాలు అమల్లో ఉంటాయని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాలను సుప్రీం కోర్టు కొట్టివేయడం ఇదే తొలిసారి.
ఇతర విభాగాలకు సంబంధించి ట్రంప్ తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించుకునేందుకు కోర్టు ఇప్పటి వరకు అనుమతించింది.
అయితే ఈసారి మాత్రం, పార్లమెంట్ ఆమోదం లేకుండా భారీ సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ అధికార పరిధిని అతిక్రమించారని మెజార్టీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం, పరోక్షంగా సుంకాలను అనుమతిస్తుందనే ట్రంప్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.
అధ్యక్షుడు చెబుతున్న అధికారం ఏ విధంగా చూసినా ఊహాతీతమైనదని జస్టిస్ రాబర్ట్స్ అన్నారు.
"సుంకాలను విధించే అసాధారణ అధికారాన్ని కాంగ్రెస్ మంజూరు చేయాలనుకుంటే, అది స్పష్టంగా చేస్తుంది" అని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో రాశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్ - పాక్ యుద్ధం, రష్యా చమురు
ప్రెస్ కాన్పరెన్స్‌లో మాట్లాడిన ట్రంప్, భారత్ - పాక్ ఘర్షణను ఆపడం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయడం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు.
భారత్-పాక్ ఘర్షణ, రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయంగా సున్నితంగా మారాయి.
2025 మేలో భారత్, పాక్ మధ్య జరిగిన 'యుద్ధాన్ని' దాదాపుగా అడ్డుకున్నానని, రెండు దేశాలపైనా 200 శాతానికి పైగా సుంకాలు విధిస్తానని హెచ్చరించినట్లు ట్రంప్ మరోసారి చెప్పారు.
"రష్యా చమురు భారత్ కొనడం లేదు. మీకు తెలుసా. గతంలో భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేది. నా సూచన మేరకు భారత్ ఆ కొనుగోళ్లను తగ్గించింది. ఎందుకంటే, ప్రతీ నెలా 25 వేల మంది చనిపోతున్న యుద్ధాన్ని ముగించాలని మేం అనుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు.
"భారత్ - పాక్ యుద్ధంలో 11విమానాలు కూలిపోయాయి. ఆ వివాదం అణుయుద్ధంగా మారే అవకాశం ఉంది" అని ట్రంప్ చెప్పారు.
"నేను వాళ్లతో, చూడండి మీరు యుద్ధం చేయాలనుకుంటే చేసుకోండి. కానీ మీరు అమెరికాతో వాణిజ్యం చేయలేరు. మీ మీద 200 శాతం సుంకాలు విధిస్తాను" అని తాను చెప్పడంతో భారత్, పాక్ శాంతికి సముఖత వ్యక్తం చేశాయని ట్రంప్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












