You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పదో తరగతి విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు.. అసలేం జరిగింది?
- రచయిత, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయిలోని దాదర్ ప్రాంతంలో ఒక మైనర్ విద్యార్థిపై ఉపాధ్యాయురాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది.
16 ఏళ్ల విద్యార్థిపై తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 40 ఏళ్ల ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
దాదర్‌లోని ఒక ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
పోక్సో చట్టం కింద టీచర్‌పై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.
జులై 3న ముంబయి సెషన్స్ కోర్టు ఆ ఉపాధ్యాయురాలికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే..
ముంబయిలోని దాదర్‌లో ఓ స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయురాలు 16ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం జూన్ 29, 2025న ఫిర్యాదుచేసిందని పోలీసులు కోర్టుకు చెప్పారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన అనంతరం జూన్ 30న టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
''గత ఏడాదిగా టీచర్ బాధిత విద్యార్థితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఉపాధ్యాయురాలికి పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నారు'' అని పోలీసులు కోర్టుకు తెలిపిన సమాచారంలో ఉంది.
''16 ఏళ్ల విద్యార్థితో 2023 డిసెంబరులో జరిగిన స్కూల్ యాన్యువల్ గెట్ టుగెదర్‌లో ఉపాధ్యాయురాలికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నినెలల పాటు వాళ్లు నిత్యం ఫోన్‌లో మాట్లాడుకునేవారు'' అని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘ఏడాది కాలంగా శారీరక సంబంధం’
2024 జనవరిలో ఉపాధ్యాయురాలు కారులో వెళ్తూ తొలిసారి తమ కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఆ తర్వాత టీచర్ తరచూ దక్షిణ ముంబయి, ఎయిర్‌పోర్టు ప్రాంతంలోని పెద్దపెద్ద హోటళ్లకు తీసుకెళ్తూ విద్యార్థిని వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తరువాత బాధిత విద్యార్థి టీచర్‌కు దూరంగా ఉండడానికి ప్రయత్నించాడని..
అయినప్పటికీ ఇతర విద్యార్థులు, మరో టీచర్ ద్వారా ఆమె విద్యార్థితో కాంటాక్ట్‌లో ఉండడానికి ప్రయత్నిస్తుండేవారని వారు ఫిర్యాదు చేశారు.
దీంతో బాధిత విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడన్నారు.
విద్యార్థితో కలిసి ఉపాధ్యాయురాలు మద్యం సేవించేవారని, విద్యార్థికి ఒత్తిడి తగ్గించే మాత్రలు కూడా ఇచ్చేవారని పోలీసులు కోర్టుకు సమర్పించిన సమాచారంలో ఉంది.
‘వీటన్నింటితో విద్యార్థి తీవ్రంగా వేదన చెందాడు. కుటుంబానికి, స్నేహితులకు నెమ్మదిగా దూరం కావడం మొదలైంది. విద్యార్థికి, తల్లిదండ్రులకు మధ్య పెద్దగా మాటలుండేవి కాదు.
బాలుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు కొడుకుతో మాట్లాడారు. అప్పుడు టీచర్‌తో తన సంబంధం గురించి వారితో చెప్పిన విద్యార్థి తాను ఇబ్బందిపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు’ అని పోలీసులు కోర్టుకు తెలిపారు.
స్కూలు నుంచి వెళ్లిపోయినా..
విద్యార్థి పదో తరగతి పాసై స్కూలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఉపాధ్యాయురాలు వేధింపులు ఆపలేదని.. దీంతో బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని దాదర్ పోలీసులు చెప్పారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీనిపై దాదర్ పోలీసు స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర అవ్హాద్‌తో బీబీసీ మాట్లాడింది.
ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేసి జులై 3న ముంబయి సెషన్స్ కోర్టులో హాజరుపరిచినట్లు రాజేంద్ర చెప్పారు.
కేసు సున్నితత్వం దృష్ట్యా మరింత సమాచారం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
దాదర్ పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది, నిందితురాలి తరపు లాయర్ వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది.
పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది ఆమెను ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరారు.
నిందితురాలు మానసిక వైద్యుల దగ్గర చికిత్స పొందుతున్నారని ఆమె తరపు లాయర్లు కోర్టుకు చెప్పారు.
డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్న వివరాలను నిందితురాలి న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న ముంబయి సెషన్స్ కోర్టు ఆమెకు ఒకరోజు మాత్రమే పోలీసు కస్టడీకి అనుమతించింది.
నిందితురాలికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ఒకరోజు పోలీసు కస్టడీ పూర్తయిన తర్వాత పోలీసులు టీచర్‌ను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టారు.
వాదనలు విన్న కోర్టు టీచర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
నిందితురాలు, ఆమె తరపు లాయర్లతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కేసు సున్నితత్వం దృష్ట్యా వారు స్పందించలేదు.
నిందితురాలు లేదా ఆమె తరపు లాయర్ల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాత నిందితురాలి తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఈ ఆరోపణలను ఆమె లాయర్లు ఖండిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)