టెక్సస్ వరదల్లో 15 మంది పిల్లలు సహా 51 మంది మృతి - తీవ్రత ఈ 7 ఫొటోలలో చూడండి

అమెరికాలోని టెక్సస్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇప్పటివరకు 51 మంది చనిపోయారు. వారిలో 15 మంది పిల్లలున్నారు.

క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్‌లో అనేకమంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

వరదల్లో కొట్టుకుపోతూ సాయం కోసం పిల్లలు అరుస్తున్నా..ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తంచేశారు.

గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కెర్విల్లేలోని ఒక రిక్రియేషనల్ వెహికల్(ఆర్‌వి) పార్కును వరదనీరు ముంచెత్తిందని ప్రత్యక్షసాక్షి బడ్ బోల్డన్ చెప్పారు. అక్కడ ఉన్న పిల్లలు వరదనీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోయారని బోల్డన్ తెలిపారు.

గల్లంతయిన 25 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.

కెర్విల్లే పట్టణం వెలుపల ఉన్న క్యాంప్‌కు 750మంది అమ్మాయిలు హాజరయ్యారు.

చాలా కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రోడ్లు కొట్టుకుపోయాయి. ఫోన్‌లు పనిచేయడం లేదు. టెక్సస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

46 నిమిషాల్లో గ్వాడాలుపే నది 26 అడుగుల మేర ప్రవహించిందని, ఇది విధ్వంసకరమైన వరద అని ప్రాణాలను, ఆస్తులకు తీవ్రనష్టం కలిగించిందని టెక్సస్ లెఫ్టినెంట్ గవర్నర్, డాన్ పాట్రిక్ ఆవేదన వ్యక్తంచేశారు.

చాలా విధ్వంసం జరిగిందని స్థానిక రెస్టారెంట్ ఓనర్ లోరెనా చెప్పారు. చెట్లపైన చిక్కుకుపోయినవారిని హెలికాప్టర్లలో వచ్చిన సహాయక సిబ్బంది రక్షిస్తున్నారని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)