You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొర్రాయిపల్లె స్కూల్: ‘నాగలక్ష్మి మేడమ్ స్టూడెంట్స్‌కు లెక్కలంటే భయం లేదు’
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆ పాఠశాల గేటు నుంచే గణిత శాస్త్రంలోని అంకెలు మనల్ని పలకరించి, ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇనుప గ్రిల్స్ కూడా సంఖ్యాశాస్త్రాన్ని నేర్పించేదుకు సిద్ధంగా ఉంటాయి. మొక్కల పాదులు కూడా త్రిభుజం, వృత్తాకారాలతో కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, చాపాడు మండలంలో ఉన్న మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మైనపురెడ్డి నాగలక్ష్మీదేవి రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో తొలిస్థానం దక్కింది.
కేంద్రవిద్యాశాఖ 2022-23 సంవత్సరానికి నిర్వహించిన ‘విద్యా అమృత్ మహోత్సవ్’లో నాగలక్ష్మీదేవి తయారు చేసిన ఆరోహణ, అవరోహణల అబాకస్‌కు తొలి బహుమతి లభించింది.
పిల్లలకు గణితశాస్త్రం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వినూత్న పద్ధతిలో బోధిస్తున్నారు నాగలక్ష్మీదేవి.
విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేందుకు రకరకాల మెటీరియల్స్‌తో అంకెలు, అక్షరాలు, బొమ్మలు, ఆకారాలు, చార్టులు వంటివి రూపొందిస్తుంటారు ఉపాధ్యాయులు.
అయితే నాగలక్ష్మీదేవి మాత్రం పాఠశాలనే ఒక టీచింగ్ మెటీరియల్‌గా మార్చేశారు.
ఆలోచనకు రూపం..
చిన్నప్పటి నుంచి తనకు మ్యాథ్స్ మీద ఉన్న ఇష్టం కూడా ప్రాజెక్టు రూపకల్పనకు ఓ కారణమని చెబుతారు నాగలక్ష్మీదేవి.
"నాలాగే అందరికీ లెక్కల మీద ఇష్టం పెరగాలి. మా బడిలో పిల్లలందరికీ మ్యాథ్స్ బాగా రావాలి. కొత్తగా చేరే పిల్లలు కూడా నేర్చుకునేలా ఉండాలని అనుకున్నాను" అని ఆమె వివరించారు.
పాఠశాలలో ఎటు చూసినా అంకెలు, కూడికలు, తీసివేతలు వంటివి కనిపిస్తూ ఉంటాయి.
గోడలు, గ్రిల్స్, గేట్లు, మెట్లపై భిన్నాలు, అవరోహణ-ఆరోహణ క్రమాలు ఉంటే, పాఠశాల ఆవరణలోని మొక్కల పాదులు వృత్తాలు, త్రిభుజాలు, చతురశ్రాలు, దీర్ఘ చతురస్రాకారంలో ఏర్పాటు చేశారు.
నాగలక్ష్మీదేవి మొర్రాయిపల్లె పాఠశాలకు వచ్చిన తొలినాళ్లలో విద్యార్థులు లెక్కలంటే భయపడుతుండటాన్ని గమనించారు.
పిల్లల్లోని భయం పోగొట్టి వారు ఇష్టంగా సులభంగా నేర్చుకునేందుకు కొన్ని రకాల టీచింగ్ కిట్స్‌తో బోధించడం ప్రారంభించారు.
అలా తయారు చేసకున్న టీచింగ్ సామగ్రి కొన్ని రోజులకే పాడవుతూ ఉండేది.
టీచింగ్ సామగ్రి ఎప్పటికీ ఉండాలనే ఆలోచనలతో ఆమె స్కూలు గేట్లు, గోడలు, గ్రిల్స్‌ను తన బోధనలకు అనుకూలంగా మార్చుకున్నారు.
తన ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం ఉపయోగపడిందని నాగలక్ష్మీదేవి చెప్పారు.
‘‘నాడు-నేడు ఫేజ్-1లో మా పాఠశాల ఎంపికైంది. అలా నిర్మాణం జరిగేటప్పుడే లెక్కలకు సంబంధించి బోధన సామాగ్రి శాశ్వతంగా ఉండేలా డిజైన్ చేశాం." అని చెప్పారు.
"పిల్లల కోసం తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం) ఏడాది కాగానే పాడైపోతాయి. వాటిని మళ్లీ తయారుచేసుకోవాలి. అందుకు బదులుగా ఈ టీఎల్ఎమ్‌ను శాశ్వతంగా నిర్మిస్తే బాగుంటుందనుకున్నా. బడిలో పిల్లలు ఎటు చూసినా లెక్కలు గుర్తుకు రావాలి. ఆ ఆలోచనకు రూపం ఇది” అన్నారు.
‘గ్రిల్స్‌లో అబాకస్’
నాగలక్ష్మీదేవి మాట్లాడుతూ, “గ్రిల్స్ వేసేటప్పుడు వాటికి ఆరోహణ, అవరోహణ క్రమాలను వివరించే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అని ఆలోచన వచ్చింది.
ఆ తరువాత పిల్లలకు ఎలాంటివి అవసరం అవుతాయో ఆలోచించా. అలా అబాకస్‌ను ఏర్పాటు చేశాం. పిల్లలకు సంఖ్యాశాస్త్రంతోపాటు కూడికలు, గుణకారాలు, భాగాహారాలు, భిన్నాలు వంటివి బోధించాలని, వాటిని గ్రిల్స్‌లో పెట్టాం.
గ్రిల్స్‌లో అబాకస్ ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంది.
ఒకటి నుంచి కోటి, 10 కోట్ల వరకూ సంఖ్యలను గుర్తించడంతోపాటు వాటి స్థానాల విలువలను పిల్లలు తెలుసుకోగలరు.
టీఎల్‌ఎంలో భాగంగా ఏమేమీ చేయాలనుకున్నామో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. స్కెచ్‌లు తయారు చేసుకున్నాం.
అబాకస్ కోసం పూసలు కాకుండా రంగులు పూసిన బోల్టులు వేయించాం.
ఫ్లోరింగ్ వేసేటప్పుడు పలు ఆకృతులను పొందు పరిచాం. మొక్కల పాదులను కూడా వృత్తం, త్రిభుజం వంటి ఆకారాల్లో ఏర్పాటు చేశాం.
అలా చేయడం వల్ల పిల్లలు వాటిని రోజూ చూసి, తాకుతారు. వాటి గురించి తెలుసుకుంటారు. అలా నేర్చుకునే విధానం వల్ల వారెప్పుడూ వాటిని మర్చిపోరు. దీనితోపాటు వారికి గణితం పట్ల భయం పోతుంది.
స్కూల్ కూడా వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అన్నారు.
పల్లె నుంచి దిల్లీ వరకూ
తాను రూపొందించిన అబాకస్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో ఎలా నిలిచిందో నాగలక్ష్మీదేవి బీబీసీకి వివరించారు.
‘‘నేను స్కూల్లో మార్పులు చేసిన సుమారు ఏడాది తరువాత ‘విద్యా అమృత్ మహోత్సవ్’ అనే నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది.
పాఠాలు చెప్పే క్రమంలో టీచర్లు ఏమైనా కొత్త బోధనా పద్ధతులను అనుసరిస్తుంటే వాటిపై అయిదు నిమిషాలు వీడియో చేసి ‘దీక్ష అనే యాప్‌లో అప్‌లోడ్ చేయమని చెప్పారు.
అప్పుడు నేను మా బడిలోని పర్మినెంట్ మ్యాథ్స్ టీఎల్ఎం ప్రాజెక్ట్ వీడియో తీసి అప్‌లోడ్ చేశాను.
మొదట మండల స్థాయిలో 3 ఉత్తమ వీడియోలను జిల్లాలకు పంపారు. ఆ తరువాత జిల్లా స్థాయిలో 3 అత్యుత్తమ వీడియోలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వాటిలో మా వీడియో కూడా ఉంది.
2023 నవంబర్ 29న జాతీయ స్థాయి ఫలితాలు ప్రకటించినపుడు మాకు తొలి స్థానం లభించింది.
ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు చాలా స్కూళ్లలో ఇది అమలు చేస్తుండటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది’’ అని ఆమె చెప్పారు.
'నా జీవితంలో ఇదొక మధురజ్ఞాపకం'
నాగలక్ష్మీదేవిది వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఈడిగపేట. నాన్న టైలర్ కాగా అమ్మ గృహిణి.
2001లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా చేరిన ఆమె, తన చదువంతా ప్రభుత్వపాఠశాలల్లోనే గడిచిందని చెప్పారు.
‘‘మా సొంతూరు జమ్మలమడుగు. దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో నా చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే గడిచింది. మాకు సోషల్ టీచర్ పరిమళ మేడమ్‌ను చూసే నేను టీచర్ కావాలనుకున్నా" అని చెప్పారు. 2001 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా చేరాను.
2015లో మొర్రాయిపల్లె స్కూలుకి బదిలీ మీద వచ్చాను. ఇటీవలే మైదుకూరు మండలం శంకనగారి పల్లె స్కూల్‌కి బదిలీపై వెళ్లాను.
అయినప్పటికీ మొర్రాయిపల్లెలో పని చేసిన రోజులు నా జీవితంలో గుర్తిండిపోతాయి. నన్ను ఊరి ప్రజలు అభిమానించే విధానం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది.
నా జీవితంలో అదొక మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
'మేడం వచ్చాక మార్పులొచ్చాయి'
ఒకప్పుడు లెక్కలంటే భయం ఉండేదని, ఇప్పుడు ఆడుకుంటూ లెక్కలు చేసేస్తున్నామని పిల్లలు చెబుతున్నారు.
నాగలక్ష్మీదేవి పిల్లల్లోనే కాదు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ మార్పు తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన తులసమ్మ వంటి వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో మానిపించి, ఊర్లోని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు.
‘‘మా పాపను మొదట ప్రైవేట్ స్కూల్లో చేర్చాం. నాగలక్ష్మీ మేడం వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుతున్నారని, ప్రైవేటు బడి మాన్పించి, ప్రభుత్వ పాఠశాలలో చేర్చాం. " అని తులసమ్మ చెప్పారు.
"ఇప్పుడు మా పాప బాగా చదువుతోంది. అంతకు ముందు పాములు, ఎనుములు ఆ పాఠశాల ఆవరణలోనే ఉండేవి. ప్రహరీ లేక కొంతమంది పేకాట ఆడేవారు. మేడం వచ్చాక మార్పులు తీసుకొచ్చారు.
ఇప్పుడు బడి బాగుంది. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బాగా చెబుతున్నారు. మేడం వచ్చిన తరువాత ఎక్కువ మంది పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి..
- ఇంట్లోనే చనిపోయినా పదేళ్ల వరకు ఎవరికీ తెలియలేదు.. ఆ వృద్ధురాలి మరణం దేశాన్నే కదిలించింది
- ‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)