You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: 'మిగ్‌జాం తుపాను నిండా ముంచింది'
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల పంట నీట మునగగా వరదల తాకిడికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.
తుపాను వల్ల 8 మంది చనిపోగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంటలు పాడై పోయినట్లు కేంద్రం నుంచి పరిశీలనకు వచ్చిన బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన బృందం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పర్యటించింది.
నెల్లూరు, తిరుపతి, కృష్ణా, బాపట్ల, కడప వంటి జిల్లాలు తుపాను వల్ల బాగా దెబ్బతిన్నాయి. నష్ట పరిహారం కింద రూ.3,711 కోట్లు ఇవ్వాలని కేంద్ర బృందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
తుపాను వల్ల రాష్ట్రంలోని 22 జిల్లాలల్లో వానలు అధికంగా కురిసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో అత్యధికంగా 384.1 మిల్లీమీటర్ల వాన కురిసింది. కడప జిల్లాలోని 36 మండలాల్లో 30 మండలాలు తుపాను వల్ల దెబ్బతిన్నాయి. తిరుపతిలో 29 మండలాలు దెబ్బతినగా కృష్ణా, బాపట్లలో అన్ని మండలాల మీద తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2,178 ఇళ్లు దెబ్బతినగా 2,684 ఇళ్లు మునిగిపోయాయి.
స్వర్ణముఖి నది తెగడంతో
వరదల వల్ల స్వర్ణముఖి నది తెగడంతో తిరుపతి జిల్లా వాకాడు మండలంలో బాలిరెడ్డి పాలెం అనే గ్రామం ధ్వంసమైంది. వరద వలన ఐదు ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఈ స్వర్ణముఖి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ముఖ్యంగా వాకాడు మండలంలో ఇళ్లు కొట్టుకుపోయిన బాలిరెడ్డి పాలెం గ్రామానికి డిసెంబర్ 8న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లారు.
తిరుపతి జిల్లా గూడూరు నుంచి వాకాడు మండలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది స్వర్ణముఖి నదికి పక్కనే ఉంటుంది. దీంతో నది తెగినపుడు ఈ మండలంలోని చాలా గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఆ గ్రామాల్లో బాలిరెడ్డి పాలెం ఒకటి. ఆ గ్రామం ఇప్పుడు ఎలా ఉంది. గ్రామస్థులు ఏమంటున్నారు. బాధితులు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నారు బీబీసీ పరిశీలించింది.
స్వర్ణముఖి వరద ముంచెత్తడంతో బాలిరెడ్డి పాలెంలో ఐదు ఇళ్లు కొట్టుకుపోయిన చోట ప్రస్తుతం నది నుంచి కొట్టుకు వచ్చిన ఇసుక మేటలు వేసి ఉంది.
ఆ గ్రామం ఒక ఎస్సీ కాలనీ. అక్కడ అందరూ కూలి పనులు చేసుకుని బతికేవాళ్లే. అక్కడ చాలా మంది అప్పులు చేసి కట్టుకున్న తమ ఇళ్లలోకి ఇంకా అడుగు కూడా పెట్టలేదు. కొందరైతే మరికొన్ని రోజుల్లో గృహప్రవేశం చేయాలని అనుకున్నారు.
ఈలోపే హఠాత్తుగా స్వర్ణముఖి వరద రావడంతో ఆ ఇళ్లు, ఇళ్లలోని వస్తువులన్నీ కొట్టుకు పోయాయి. గ్రామస్థులు కట్టుబట్టలతో ఉండడం కనిపిస్తోంది.
‘అడుగు పెట్టక ముందే కుంగింది’
వరదల వల్ల అప్పు చేసి కట్టుకున్న ఇల్లు ఇంకా అడుగైనా పెట్టక ముందే కుంగిపోయిందని ఇంటితోపాటూ బాలిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన సుబ్బమ్మ చెప్పారు.
“మా ఇంటి పైనే ఉండాను సార్ మా ఇల్లు అట్టే కుంగిపోయింది. ఇది కొత్త ఇల్లు ఇంట్లో ఒకరోజు కూడా వచ్చి పడుకోలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కట్టు బట్టలతో బయటపడ్డాం. మేం ఎలా బతకాలి? ఎలా ఉండాలి? ఇంటికి రూ.16 లక్షలు అయింది. ఇంకా బాకీ కూడా తీరలేదు’’ అని ఆమె బాధను చెప్పుకున్నారు.
‘‘చిన్న బిడ్డలను పడుకోబెట్టుకుని ఉన్నాము. ఇంట్లోకి నీళ్లు రావులే పెద్ద ఇల్లు కదా అనుకుని లోపల పడుకుని నిద్ర పోతున్నాము. నిద్రలేచి బయటకు వచ్చిచూస్తే నడుము లోతు నీళ్లున్నాయి. రెండు నిమిషాలు ఆగుంటే బయటకు వెళ్లలేకపోయేవాళ్లం’’ అని సుందరమ్మ చెప్పారు.
ఇల్లు పోవడంతో బిడ్డను ఒక చెట్టుకు కట్టిన ఊయలలో ఊపుతూ కనిపించారు సుందరమ్మ. కట్టుబట్టలతో మిగిలామనే ఆవేదన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘ఎవరు పట్టించుకోలా. ఎవరు వచ్చి చూడలా. నిన్న జగన్ వచ్చినాడు. అసలు మా మాటే ఎత్తలేదు. ఏం జరిగింది, ఎలా ఉన్నారు అని కూడా అడగలేదు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలే. అప్పులు చేసి తెచ్చుకొని కష్టపడి కట్టించుకున్న ఇల్లు. ఇల్లు బాగుంది కదా అనుకుని, వస్తువులన్నీ ఆ ఇంట్లోనే పెట్టాము. అన్నీ కొట్టుకుపోయాయి. కట్టుకున్న గుడ్డలతో బయట వచ్చాము.’’ అన్నారు సుందరమ్మ.
ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినపుడు తమను కనీసం ఆయన దగ్గరికి కూడా వెళ్లనివ్వలేదని సుందరమ్మ చెప్పారు. ఆశ్రయం ఇచ్చేవాళ్లు లేక బిడ్డలతో చెట్టు కిందే గడిపామని తెలిపారు.
‘‘ఇల్లు కొట్టుకుపోయింది. బిడ్డను పెట్టుకొని తెల్లవార్లు ఆ చెట్టు కిందే కూర్చున్నాం. మమ్మల్ని పిలిచే వాళ్ళు, రండి అనే వాళ్ళు ఎవరూ లేరు. మా పరిస్థితి ఎవరూ జగన్‌కు ఎవరు చెప్పలేదు. ఆయనా అడగలేదు. మమ్మల్ని ఆయన దగ్గరికి కూడా వెళ్లనివ్వలేదు’’ అని సుందరమ్మ ఆవేదన వ్యక్తం చేసారు.
స్వర్ణముఖి తెగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు తమకీ పరిస్థితి వచ్చుండేది కాదని స్థానిక మహిళలు చెబుతున్నారు. ఇల్లు, పంటలూ ఏవీ లేకుండా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు సుందరమ్మ.
‘‘జగనన్న వస్తున్నాడని అంత రాయి పోసినారు...రాత్రి తెగుతుంది అనుకున్నప్పుడు అదేదో ఆ కట్టపైనే పోసుంటే అది తెగిపోయి ఉండదు కదా. కానీ అసలు పట్టించుకోలేదు. తెగితే తెగనీ, పోతే పోనీ అని హాయిగా ఉన్నారు. రోడ్డు మీద పడ్డది మేమే కదా. గిన్నె, చెంబు, గుడ్డ అన్ని ఏటికి పెట్టేసినా గమ్ముగా కూర్చొని ఉన్న.’’ అన్నారామె.
ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం లేదని, ఎలా జీవించాలో అర్థం కావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. చివరికి తమ గోడు చెప్పుకోడానికి ముఖ్యమంత్రి దగ్గరకు కూడా వెళ్లలేదని తెలిపారు.
‘‘గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు గాని ఏ సపోర్ట్ గానీ లేదు. జగన్ సార్ దగ్గరికి కూడా పోనీ లేదు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు ఏం చేయాలో తెలియదు. ఆరు సంవత్సరాల కష్టపడితే ఇల్లు కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు పడిపోయింది. మాకు ఏ సపోర్టు లేదు. అప్పులు తెచ్చి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఆ లోన్లు అయితే కట్టాలి’’ అని శ్రీకాంత్ అనే గ్రామస్తుడు అన్నారు.
ఉప్పుటేరు పొంగితే గ్రామాలు దీవులే
చిల్లకూరు మండలంలో ఉన్న మరో గ్రామం తిప్పగుంట పాలెం. ఈ గ్రామంతోపాటూ దాని చుట్టుపక్కల ఉన్న గోవిందరెడ్డి పాలెం మరికొన్ని గ్రామాలు గత కొన్ని దశాబ్దాలుగా ఉప్పుటేరు సమస్యగా మారింది. వరదలతో ఈ ఏరు పొంగినప్పుడల్లా ఈ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతాయి.
ఆ గ్రామాలన్నింటికీ మిగతా ప్రపంచంతో ఉన్న సంబంధాలు తెగిపోవడం వల్ల నిత్యాసరాల కొరత ఏర్పడుతుంది. కొన్ని గ్రామాల్లో ప్రజలు పడవలు ఉపయోగించాల్సిన పరిస్థితి.
చుట్టూ నీళ్లు, ఉప్పుటేరుపై ఉన్న వంతెన కూడా కుంగిపోయి ఉండడంతో తిప్పగుంటపాళెం ప్రజలు గత 10 రోజులుగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏం చేయాలన్నా వంతెన దాటి వెళ్లాల్సి ఉంటుదని, అది కొన్ని సంవత్సరాలుగా కుంగిపోయే ఉండడంతో ఇళ్లలోనే చిక్కుకుపోయామని, బయటికి వెళ్లాలంటే పడవలు తప్ప మరో దిక్కు లేదని గ్రామానికి చెందిన శాంతి అనే మహిళ చెప్పారు.
‘‘రాకపోకలు లేవు. తిండికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. బయట పనులకు వెళ్లే వీలులేదు. 30 ఏళ్ల కిందట వంతెన కట్టారు. తరువాత అది కుంగిపోయింది. ఏరు వచ్చిందంటే మునిగి పోతుంది. మేం పొలాలకు వెళ్లాలంటే ఆ వంతెన దాటే వెళ్లాలి’’ అని ఆమె అన్నారు.
వంద ఎకరాల్లో రొయ్యల పెంపకం ద్వారా రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెడుతున్న తమ గ్రామానికి వంతెన సమస్య తీర్చాలని కిశోర్ కోరారు.
‘‘ఇక్కడ 100 ఎకరాల ఆక్వా కల్చర్ జరుగుతుంది. విదేశీ మారకద్రవ్యం మన ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి, ఉప్పుటేరు మీద వంతెన కడితే వ్యాపారం మరింత పెరుగుతుంది. ప్రజలకు కూడా ఉపయోగం. సుమారు 100 ఎకరాలు నారుమడులు మునిగిపోయాయి. ఆక్వా దెబ్బతినింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణమే దీనికి పరిష్కారం’’ అని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
అయితే, ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించారని, పది మంది ఉన్న ప్రాంతంలో కూడా ఆగి వారితో మాట్లాడారని చెప్పింది.
వాకాడు మండలం గూడురు నియోజకవర్గం కిందికి వస్తుంది. స్వర్ణముఖి వరద ప్రభావిత ప్రాంతాలవారిని తాము ఆదుకుంటున్నామని, వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే అంచనాలు కూడా రూపొందించామని స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ బీబీసీతో చెప్పారు.
‘‘స్వర్ణముఖి నది గట్టు తెగిపోయి దాదాపు 10 గ్రామాలు దెబ్బతిన్నాయి. 2,000 ఎకరాల వరి మునిగిపోయింది. చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పొలాలు, చెరువుల్లో ఇసుక పేరుకు పోయింది. అదంతా తొలగించాలి. స్వర్ణముఖికి హై లెవెల్ బ్రిడ్జి కట్టడానికి రూ.30 కోట్లు విడుదల చేశారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా నిత్యవసరాలు అందించాం. ఇల్లు దెబ్బతింటే వాటికి కూడా రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాం’’ అని ఎమ్మెల్యే అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైనవారికి ఇళ్లు కట్టించి ఇస్తామని, పంట నష్టపోయిన వారికి పంట బీమా, 80శాతం రాయితీతో విత్తనాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. బాధితులను పట్టించుకోవడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో అర్థం లేదన్నారు.
గూడురు చుట్టుపక్కల తిప్పగుంటపాలెం, గోవిందరెడ్డి పాలెం లాంటి ప్రాంతాల్లో ఇంకా వరద ప్రభావం ఉందనే నిజాన్ని ఎమ్మెల్యే అంగీకరించారు. అక్కడ ఉన్న ఉప్పుటేరు మీద వంతెన నిర్మాణానికి రూ.22 కోట్లు ఖర్చవుతుందని అంచనాలున్నాయని చెప్పిన ఎమ్మెల్యే, అలాంటి కీలకమైన మరో నాలుగు ప్రాంతాలను గుర్తించామన్నారు.
‘‘ముఖ్యమంత్రి గారు వచ్చి ఇంటింటికి తిరిగి చూడడం అనేది ఎంత కష్టమో తెలిసిన విషయమే. ఒకే గ్రామంలో అంతంత సేపు సమయం పెట్టడం అనేది కష్టం. తీర ప్రాంతాలన్నీ కూడా పైనుంచి చూశారు. ఈ ఆరోపణలు చేస్తున్న ప్రతి బాధితుడి వెనక ప్రతిపక్షం వారు ఉంటారు’’ అని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పులు: ‘ప్రకృతి వైపరీత్యాలు ఇక సర్వసాధారణమవుతాయి, వాటికి అలవాటుపడాల్సిందే’
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా? పొంచి ఉన్న ముప్పును తప్పించడానికి నిపుణుల సూచనలు ఏమిటి
- చించొర్రో సంస్కృతికి యునెస్కో గుర్తింపు: 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- ఖైబర్ కనుమలు: అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకూ అందరి గర్వాన్నీ అణిచేసిన మృత్యులోయ