బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏంటి, ఆ డబ్బును ఏం చేస్తారు?

    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంవ్యాప్తంగా బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసం ఒక కొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏప్రిల్ 6న ప్రకటించింది.

దేశంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగిపోతున్నట్టు గతంలో ఆర్బీఐ ఆందోళన వ్యక్తంచేసింది.

"భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అందించిన సమాచారం ప్రకారం, 2023 ఫిబ్రవరి చివరికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లను ఆర్బీఐకి బదిలీ చేసినట్లు" ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ సోమవారం పార్లమెంటులో తెలిపారు.

కాగా, 2022 మార్చి (రూ. 48,262 కోట్లు)తో పోలిస్తే 2023 ఫిబ్రవరిలో పోగైన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం తగ్గిందని, అందుకు బ్యాంకులు నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాలే కారణమని కరాద్ అన్నారు.

2023 ఫిబ్రవరి నాటికి, అత్యధికంగా ఎస్‌బీఐ వద్ద రూ. 8,086 కోట్లు (2,17,80,757 ఖాతాలు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద రూ. 5,340 కోట్లు (1,50,48,156 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు), కెనరా బ్యాంక్ వద్ద రూ. 4,558 కోట్లు (1,56,22,262 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు) ఉన్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది.

బ్యాంకుల వద్ద అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఎందుకు ఉండిపోతాయి? ఖాతాలు ఎప్పుడు ఇనాక్టివ్ అవుతాయి? ఆ డబ్బును బ్యాంకులు ఏం చేస్తాయి? కొన్నేళ్ల తరువాత మళ్లీ ఇనాక్టివ్ ఖాతాలను తెరవవచ్చా? వీటికి సమాధానాలు తెలుసుకుందాం.

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏంటి?

హైదరాబాదులో చదువుకుంటున్న శిరీషకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉండేది. ఉద్యోగ నిమిత్తం ఆమె దిల్లీ చేరుకున్నాక, ఆ ఖాతాను బదిలీ చేయించుకోలేదు.

జీతం కోసం దిల్లీలో మరో బ్యాంకులో కొత్త ఖాతా తెరిచారు. హైదరాబాద్ ఖాతా సంగతి పూర్తిగా మర్చిపోయారు. దాంతో, ఆ ఖాతా క్రియారహితం (ఇన్‌యాక్టివ్) అయిపోయింది.

అందులో ఉన్న రూ. 5,000 ఏమయ్యాయో ఆమెకు తెలీదు. ఇది చాలామందికి ఎదురయే అనుభవమే.

కొంతమంది వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. కానీ, అన్ని ఖాతాల నుంచి లావాదేవీలు జరుపుతూ యాక్టివ్‌గా ఉండడం కుదరకపోవచ్చు.

ఒక ఖాతా నుంచి రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరపకపోతే.. అంటే బ్యాంకులో డబ్బు వేయడం, తీయడం జరగకపోతే ఆ ఖాతా ఇన్‌యాక్టివ్ అయిపోతుంది. దాన్ని పని చేయని ఖాతాగా బ్యాంకు పరిగణిస్తుంది.

అందులో ఉన్న డబ్బును తిరిగి పొందాలంటే, ఆధార కార్డ్, పాన్ కార్డ్ వగైరా కీలక ధ్రువీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పిస్తే, ఖాతాను యాక్టివ్ చేసి మీ డబ్బు మీకు తిరిగి అందిస్తారు.

ఒక ఖాతా నుంచి పదేళ్లకు పైగా లావాదేవీలు జరపకపోతే అది అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ అవుతుంది. బ్యాంకుల్లో ఉన్న సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు అన్నీ వాడకపోతే అన్‌క్లెయిమ్డ్‌గా మారగలవు.

బ్యాంకులు ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య, వాటిలో ఉన్న మొత్తం సొమ్ము వివరాలను ఆర్థిక సంవత్సరం చివరికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కు అందించాల్సి ఉంటుంది.

ఆ తరువాత, ఈ డిపాజిట్లన్నీ ఆర్బీఐకి చెందిన 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్' (డీఈఏఎఫ్)కు చేరుతాయి.

అనంతరం, క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల గురించి ఖాతాదారులకు తెలియజేయడానికి ఆర్బీఐ అవగాహన ప్రచారం చేపడుతుంది.

ఖాతాలు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా ఎందుకు మిగిలిపోతాయి?

ఖాతాలు ఇన్‌యాక్టివ్ అయి, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు.

బ్యాంకు ఖాతాల గురించి సరైన అవగాహన లేకపోవడం, ఖాతాదారులు చనిపోయినప్పుడు వారి అకౌంట్ వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం లేదా క్లెయిమ్ చేసుకునేవారు లేకపోవడం మొదలైనవి అన్ క్లెయిమ్డ్ ఖాతాలకు కారణమవుతున్నాయి.

"చాలా కేసుల్లో కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాల వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోరు. ఒక వ్యక్తి ఓపెన్ చేసిన అకౌంట్ వివరాలు భార్యకుగానీ, పిల్లలకుగానీ తెలీవు. ఎప్పుడో ఎక్కడో ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌బీ) అకౌంట్ తెరుస్తారు. ఆ వ్యక్తి చనిపోయిన తరువాత ఖాతాకు సబంధించిన చీటీ ఇంట్లో కనిపిస్తుంది. దాంతో ఆ ఖాతా కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభిస్తారు. మా బ్యాంకుకు వచ్చే కేసుల్లో అధిక శాతం ఇవే ఉంటాయి. కొన్నిసార్లు, గ్రామాల నుంచి వచ్చినవారికి బ్యాంకు ఖాతాలపై సరైన అవగాహన ఉండదు. అలాంటప్పుడు కూడా ఖాతాలు ఇనాక్టివ్ అయిపోతాయి. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోతాయి" అని హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో పని చేస్తున్న సరళ చెప్పారు.

ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఏప్రిల్ 6న ఆర్బీఐ చేసిన ఒక ప్రకటనలో, దేశం వ్యాప్తంగా క్లెయిమ్ చేయని డిపాజట్ల కోసం ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కోసం వినియోగదారులు వివిధ బ్యాంకుల వెబ్‌సైట్లకు వెళ్లి వెతుక్కోవలసి ఉంటుంది.

ఈ శ్రమ లేకుండా వినియోగదారుల సౌలభ్యం కోసం వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ఆర్బీఐ చెబుతోంది.

అంతకుముందు 2014లో, వినియోగదారులకు అందించే సేవలపై ఆర్బీఐ జారీ చేసిన సూచనల ప్రకారం, ఏడాదికి పైగా లావాదేవీలు జరుపని ఖాతాలపై బ్యాంకులు వార్షిక సమీక్ష చేయాలి.

తరువాత, వినియోగదారులకు వాటి గురించి సమాచారం అందించాలి. ఇది కాకుండా, ఖాతాదారులు లేదా వారి వారసుల వివరాలు కనుక్కునేందుకు బ్యాంకులు ప్రయత్నించాలని సూచించింది.

ఇదంతా చేశాక, పదేళ్లకు పైగా క్రియారహితంగా ఉన్న ఖాతాల వివరాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. ఖాతాదారుల పేరు, చిరునామా సహా వివరాలను వెల్లడించాలి.

పదేళ్ల తరువాత కూడా ఖాతాలు రీఓపెన్ చేయవచ్చా?

ఎన్నేళ్ల తరువాతైనా ఖాతాలు మళ్లీ తెరిపించుకోవచ్చు. అందుకు, ఖాతాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.

ఇప్పుడు చాలా బ్యాంకుల్లో కేవైసీ (know your customer) అడుగుతున్నారు. కాబట్టి, ఈ ప్రక్రియ మరింత సులువు అవుతోంది.

"ఇనాక్టివ్ అకౌంట్లలోని సొమ్ము మొత్తం బ్యాంకు హెడ్ ఆఫీసుకి వెళ్లిపోతుంది. మీరు ధ్రువీకరణ పత్రాలు అందించి, ఆ ఖాతా మీదేనని రుజువు చేస్తే, ఆ సొమ్ము మీకు దక్కుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. కానీ, మీ సొమ్ము భద్రంగానే ఉంటుంది" అని బ్యాంకర్ సరళ చెప్పారు.

అయితే కొన్నిసార్లు, ఇనాక్టివ్ లేదా అన్‌క్లెయిమ్డ్ ఖాతా మళ్లీ తెరవాలంటే బ్యాంకుకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

"బ్యాంకు ఖాతాలకు కొన్ని రకాల సర్వీస్ చార్జీలు ఉంటాయి. ఉదాహరణకు డెబిట్ కార్డ్ వాడుతుంటే దానికి కొంత సర్వీస్ చార్జ్ కట్ అవుతూ ఉంటుంది. ఇలా కొన్నాళ్లకు ఇన్‌యాక్టివ్ ఖాతాలలోని సొమ్ము మొత్తం సున్నాకి చేరుకుంటుంది. ఒక్కోసారి నెగటివ్ బ్యాలన్స్‌కి వెళిపోతుంది. అలాంటప్పుడు ఆ ఖాతాను మళ్లీ తెరవాలంటే బ్యాంకుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ ఖాతాను మళ్లీ తెరవడమే ఉత్తమం. లేదంటే దీని ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంది. మీరు లోను తీసుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్ కౌంట్ అవుతుంది. అందుకే నెగటివ్ అకౌంట్లను పాజిటివ్ అకౌంట్లుగా మార్చుకోమని నేను సలహాలిస్తుంటాను" అని సరళ వివరించారు.

ఇవి కూడా చదవండి: