స్వాతి మలివాల్ చెప్పిన ‘పొలిటికల్ హిట్‌మ్యాన్’ ఎవరు? దిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో ఏం జరిగింది?

‘‘ఎప్పటిలాగే తనను తాను రక్షించుకోవడానికి పొలిటికల్ హిట్‌మ్యాన్ ఈసారి కూడా ప్రయత్నిస్తున్నారు’’

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్‌)లో చేసిన పోస్టు దిల్లీ రాజకీయ వర్గాలలో దుమారం రేపుతోంది.

‘‘అసలు విషయం లేకుండా ట్వీట్లు, వీడియోలు ప్రచారం చేయడం ద్వారా ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఓ ఇంట్లో ఒకరిని కొడుతున్న వీడియోను ఎవరు తీస్తారు? అందరి ముందు ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీ బయటకు తీసి, ఆ రూమ్‌ను పరిశీలిస్తే నిజం బయటకు వస్తుంది’’ అని ఆ పోస్టులో స్వాతి మలివాల్ రాశారు.

అయితే స్వాతి మలివాల్ ఈ పోస్టు ఎవరి పేరును ఉద్దేశిస్తూ రాయలేదు.

దీంతో ఆమె పొలిటికల్ హిట్‌మ్యాన్ అని ఎవరిని అన్నారో తెలియడం లేదు.

‘‘ఎంతగా దిగజారాలో అంతగా దిగజారండి. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపు ఈ ప్రపంచానికి నిజం తెలుస్తుంది’’ అని స్వాతి రాశారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. 52 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో స్వాతి మలివాల్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న రోజుదిగా భావిస్తున్నారు.

ఆ వీడియోలో స్వాతిని బయటకు వెళ్ళమని భద్రతా సిబ్బంది అడుగుతున్నట్టుగా ఉంది. కానీ ఆమె దానిని తిరస్కరిస్తున్నట్టుగా అందులో వినిపిస్తోంది.

ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ నుంచి ఇదీ ‘స్వాతి మలివాల్ నిజం’ అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు.

‘బీజేపీ కుట్రకు ముఖచిత్రం స్వాతి’

‘‘బీజేపీ కుట్ర పన్నింది. అందుకే స్వాతిని కేజ్రీవాల్ నివాసానికి పంపింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేయడమే ఈ కుట్ర ప్రధాన ఉద్దేశం. ఈ కుట్రకు ముఖచిత్రం స్వాతినే.

అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే స్వాతి కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు మోపడమే ఆమె ఉద్దేశం’’ అని దిల్లీ మంత్రి అతిషి శుక్రవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆరోపించారు.

స్వాతిపై దాడి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.

‘‘స్వాతి ఇచ్చిన ఫిర్యాదులో ఆమెను దారుణంగా కొట్టారని, గాయాలయ్యాయని పేర్కొన్నారు. తనను కొట్టిన తరువాత బాధతో అల్లాడిపోయినట్టు చెప్పారు. తన బట్టలు కూడా చిరిగిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానీ వీడియోలో మాత్రం ఆమె పోలీసులను బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె బట్టలేమీ చిరగలేదు. ఆమె అందరినీ బెదిరిస్తున్నారు’’ అని అతిషి చెప్పారు.

స్వాతి మలివాల్ ఆరోపణలన్నీ తప్పు అని అతిషి కొట్టిపారేశారు.

అయితే స్వాతిపై దాడి జరగకపోతే, స్వాతిపై అనుచిత ప్రవర్తన గురించి సంజయ్ సింగ్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తే.. ‘‘ఆ సమయంలో సంజయ్‌ సింగ్‌కు ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. ఆయనకు కేవలం ఒక వైపు సమాచారం మాత్రమే తెలుసు’’ అని అతిషి సమాధానమిచ్చారు.

అసలేం జరిగింది?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిబవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మే13వ తేదీ సాయంత్రం ఆరోపించారు.

దీనిపై దిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిబవ్ కుమార్‌ను నిందితుడిగా చూపారు.

ఎఫ్ఐఆర్‌లో బిబవ్‌కుమార్‌పై స్వాతి తీవ్ర ఆరోపణలు చేశారు.

పీటీఐ వార్తా సంస్థ ప్రకారం స్వాతి మలివాల్ శుక్రవారం దిల్లీ పోలీసు బృందంతో కలిసి తీస్ హజారీ కోర్టుకు వెళ్ళారు. అక్కడ ఆమె స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ నమోదు చేశారు.

అంతకుముందు, సోమవారం దిల్లీ పోలీసులు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

ఉత్తర దిల్లీ డీసీపీ ముకేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ స్వాతి మలివాల్ సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళారని, కానీ తరువాత ఫిర్యాదు చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిపారు.

పోలీసుల ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల 34 నిమిషాలకు ఓ మహిళ నుంచి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది.

తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగిందని ఆ మహిళ సమాచారం ఇచ్చారు.

ఇది జరిగిన కొంతసేపటి తరువాత స్వాతి మలివాల్ పోలీసు స్టేషన్ చేరుకున్నారు.

పోలీసు కంట్రోల్ రూమ్‌తోపాటు పోలీసు డైరీలో నమోదైన నెంబర్ స్వాతి మలివాల్ నెంబరే.

పోలీసు కంట్రోల్ రూమ్ కాల్ ఎంట్రీలో ‘‘మహిళా కాలర్ తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసంలో ఉన్నానని, తనను ముఖ్యమంత్రి సహాయకుడు బిబవ్ కుమార్ తీవ్రంగా కొట్టాడని ’’ చెప్పినట్టు నమోదు చేశారు.

స్వాతి మలివాల్ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యు) అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేటు సెక్రటరీ బిబవ్ కుమార్‌కు నోటీసులు జారీచేసింది.

తమ ఎదుట మే 17న ఉదయం 11గంటలకు హాజరుకావాలని ఎన్‌సీడబ్ల్యు బిబవ్ కుమార్‌ను ఆదేశించినా, ఆయన హాజరు కాలేదు.

ఈ విషయాన్ని ఎన్‌సీ‌డబ్ల్యు చీఫ్ రేఖా శర్మ బీబీసీ కరస్పాండెంట్ దిల్‌నవాజ్ పాషాకు నిర్ధరిస్తూ బిబవ్ కుమార్‌కు ఈరోజు మరోసారి నోటీసు పంపినట్టు తెలిపారు.

రెండో నోటీసుకు కూడా స్పందించకపోతే పోలీసుల సాయం తీసుకుంటామని చెప్పారు.

మహిళా కమిషన్ బృందం నోటీసులు అందించేందుకు బిబవ్ కుమార్ ఇంటికి వెళ్ళారని, కానీ ఆయన ఇంట్లో లేరని రేఖా శర్మ తెలిపారు.

‘‘బిబవ్ కుమార్ భార్య నోటీసులు తీసుకోవాడానికి నిరాకరించారు. మా బృందం మరోసారి పోలీసులతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళింది. ఆయన ఎన్‌సీడబ్ల్యు ముందు హాజరుకాకపోతే మేమే అక్కడకు వెళ్ళి విచారణ జరుపుతాం’’ అని ఆమె మీడియాకు తెలిపారు.

తాను వెళ్ళి స్వాతి మలివాల్‌ను కలుస్తానని కూడా ఆమె చెప్పారు.

‘‘ట్విటర్‌లో తన గొంతు విప్పమని నేను స్వాతిని అడిగాను. కానీ పార్టీ నాయకుడి ఇంట్లో జరిగిన సంఘటన కారణంగా ఆమె షాక్‌లో ఉన్నట్టున్నారు. మహిళా సమస్యలను ఎప్పడూ లేవెనెత్తే ఎంపీని కొట్టారు’’ అని రేఖా శర్మ చెప్పారు.

‘పోలీసులకు చెప్పాను’

‘‘జరిగిన ఘటనపై పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాను’’ అని స్వాతి ఎక్స్‌ (ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ ఘటనపై స్వాతి బహిరంగంగా స్పందించడం బహుశా ఇదే మొదటిసారి.

‘‘నా విషయంలో జరిగింది చాలా ఘోరం. ఏం జరిగిందనే విషయంపై పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాను. దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.

‘‘గడిచిన కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. నాకోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు. అవతలి పార్టీ కోసం నా వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నవారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు.

దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయి. స్వాతి మలివాల్ ముఖ్యం కాదు. దేశంలోని సమస్యలు ముఖ్యం'' అని అన్నారు.

ఈ సంఘటనపై బీజేపీ స్పందించడాన్ని ప్రస్తావిస్తూ ‘‘బీజేపీ వారికి ఈ సంఘటనను రాజకీయం చేయవద్దని ప్రత్యేక వినతి’’ అని ‘ఎక్స్’లో స్వాతి మలివాల్ రాశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)