‘కరోనా టై‌మ్‌లో కూడా ఇంత ఒంటరితనం లేదు’ అంటున్న శ్రీలంక వరద బాధితులు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, రంజన్ అరుణ్‌ప్రసాద్
    • హోదా, బీబీసీ కోసం

శ్రీలంకలోని కాండీ పర్వత ప్రాంతంలోనున్న వారియగళ గ్రామానికి చెందిన పుష్పకళ దిత్వా తుపాను ప్రభావం తమ గ్రామంపై ఏ స్థాయిలో పడిందో చెప్పారు.

జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఊహించలేదని పుష్పకళ చెప్పారు.

తుపాను శ్రీలంకలో తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు, నీలంబే ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

పర్వత వాలులోనున్న వారియగళ ప్రాంతంలో ఏకంగా 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ దాదాపు 200 కుటుంబాలకు చెందిన 700 మందికి పైగా నివసిస్తున్నారు.

బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. తాము ఒంటరి అయిపోయామని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ‘కరోనా కాలంలో కూడా మేం ఇలా లేము’ అని పుష్పకళ అన్నారు.

రోడ్లు మూసుకుపోయాయి...

వారియగళ ఒక కొండపైన ఉన్న గ్రామం.ఈ గ్రామానికి వెళ్లడానికి రోడ్లు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోడ్లు మూసుకుపోయాయి.

భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు శిథిలమైనట్లు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితిలో, వారియగళ ప్రజలు సమీప పట్టణ ప్రాంతాలకు ప్రయాణించలేకపోతున్నారు. అలాగే బయటి ప్రాంతాల నుంచి ఆ గ్రామానికి వెళ్లడం కష్టమైపోయింది.

బాహ్య ప్రపంచంతో అన్ని మార్గాలు మూసుకుపోవడంతో, ఈ గ్రామం ప్రజలు తాము పూర్తిగా ఒంటరివారమైపోయామని ఆవేదన చెందుతున్నారు.

అనేక క్లిష్ట పరిస్థితుల మధ్య, వారు సోమవారం అడవి మధ్యలో నుంచి కొత్తగా కాలిబాట ఏర్పాటుచేసుకున్నారు.

ఈ తాత్కాలిక బాట గుండానే బీబీసీ బృందం ఆ గ్రామంవైపు బయలుదేరింది.

‘నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేకపోతున్నాం...‘

వర్షాల ధాటికి ఈ ప్రాంతంలో అనేకచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వీటివల్ల గ్రామంలో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అయితే, ప్రాణనష్టమేమీ జరగలేదు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా వీలుకాని పరిస్థితి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఆహారం పొందలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

"నా వయసు 40 సంవత్సరాలు. నా జీవితంలో ఇలాంటిది జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేము మా పిల్లలను ఎత్తుకుని రాత్రిపూట ఇక్కడా, అక్కడా తిరిగాం. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. మాకు తలదాచుకోవడానికి సురక్షితమైన చోటు దొరకలేదు" అని పుష్పకళ చెప్పారు.

చాలా రోజుల తర్వాత, ఆ ప్రాంతంలోని మగవారు ఆహారం కొనడానికి నగరానికి వెళ్లారని తెలిపారు.

"నా భర్త, మరికొంతమంది గ్రామస్థులు సరుకులు కొనడానికి ఉదయం వెళ్లి రాత్రి వచ్చారు. చాలా కష్టపడి సరుకులు తెచ్చారు. ఏం జరుగుతుందో పిల్లలకు అర్ధం కావడం లేదు. ఈ కొండపైన ఒక పెద్ద రాయి ఉంది. అది ఎక్కడ పడుతుందో తెలియదు" అని ఆమె ఆందోళనతో చెప్పారు.

'ఇలాంటి విపత్తును గతంలో చూడలేదు...'

ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదని ఇంద్రాణి చెబుతున్నారు.

‘‘ఇంత నష్టం జరిగింది. ఈ రోజు వరకు మమ్మల్ని చూడటానికి ఎవరూ రాలేదు. మాకు ఒక్క పూట కూడా భోజనం అందలేదు. షాపుల్లో బిస్కెట్లు కూడా లేవు" అని ఇంద్రాణి అన్నారు.

తన జీవితంలో ఇంత దారుణమైన విపత్తును ఎప్పుడూ చూడలేదని 81 ఏళ్ల గోవిందమ్మ చెప్పారు.

"నాకు పెద్ద శబ్దం వినిపించింది. నా కొడుకు నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు. ఇంట్లో ఉన్న నాలుగు మేకలు చనిపోయాయి. ఈ రోజు తినడం కూడా కష్టంగా ఉంది" అని గోవిందమ్మ అన్నారు.

"మా గ్రామానికి రెండు రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు రోడ్లు కూడా కూలిపోయాయి. ఒంటరిగా ఉన్నాము. మాకు సహాయం అందడం లేదు. మమ్మల్ని చూడటానికి ఎవరూ రాలేదు. ఈ గ్రామంలో తమిళులు, సింహళీయులు అంతా కలిసి 200 కుటుంబాలు ఉన్నాయి. తినడానికి కూడా ఏమీ లేదు. మాకు సహాయం కావాలి" అని ఆ ప్రాంత వాసి శివ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)