కొత్త ఏడాది 2025: యూపీఐ చెల్లింపులు సహా వచ్చిన 5 మార్పులు ఏంటో తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ ఏడాది కొన్ని మార్పులనూ తనతో తీసుకువచ్చింది. సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేేసే ఎన్నో కీలక మార్పులు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి.

యూపీఐ లావాదేవీలు, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాలు పింఛను నిబంధనలు, రైతుల ఆర్థిక పరిస్థితులు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి.

ప్రతి వర్గానికి చెందిన ప్రజల జీవితాలపై ఈ కొత్త మార్పుల ప్రభావం ఉంటుంది.

ఈ పరిస్థితిలో, కొత్త ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి వస్తున్న ఐదు కీలక మార్పులేంటి? అవి ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో తెలుసుకుందాం..

యూపీఐ పరిమితి పెంపు

స్మార్ట్‌ఫోన్ల నుంచి కాకుండా ఫీచర్ ఫోన్ల నుంచి యూపీఐ లావాదేవీలు చేసే యూజర్లకు యూపీఐ పరిమితి పెరిగింది. 2025 జనవరి 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

యూపీఐ 123 పే ద్వారా ప్రస్తుతం ఒకేసారి రూ.10 వేల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు. అంతకుముందు ఈ పరిమితి కేవలం రూ.5 వేల వరకే ఉండేది. ఈ పరిమితి పెంచుతూ 2024 అక్టోబర్‌లోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ జారీ చేసింది.

ఈ ప్రయోజనం కేవలం ఇంటర్నెట్ సరిగా అందుబాటులేని, ఫీచర్ ఫోన్లు వాడే యూజర్లకే మాత్రమే వర్తిస్తుంది.

ఏటీఎంల నుంచి పెన్షన్ విత్ డ్రా

ఈపీఎఫ్ఐ పెన్షనర్లకు జనవరి 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల కింద, ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా వారు తమ పెన్షన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం అదనపు ధ్రువీకరణ అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 4న ఉద్యోగుల పింఛను పథకం, 1995 కోసం కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎస్) కు ఆమోదం తెలిపింది. పెన్షన్‌ నిబంధనలను ఈ కొత్త వ్యవస్థ సరళీకరిస్తుంది. ఈపీఎఫ్ పింఛనుదారులు తమ ప్రాంతాన్ని, బ్యాంకును లేదా బ్రాంచీని మార్చుకునేందుకు ఏ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా సీపీపీఎస్ వెసులుబాటు కల్పిస్తుంది.

పదవీ విరమణ తర్వాత స్వస్థలంలో స్థిరపడే పింఛనుదారులకు ఈ వ్యవస్థ అతిపెద్ద ఊరట కలిగిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 78 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు.

కార్ల ధరలలో మార్పులు

2025 జనవరి నుంచే చాలా కార్లు, వాహనాల ధరలు పెరుగుతున్నాయి. ఈ వాహనాలలో చిన్న కార్ల నుంచి లగ్జరీ మోడల్స్ వరకు ఉన్నాయి.

తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్ల కంపెనీలు తెలిపాయి.

మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహింద్రా, ఎంజీ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను రెండు నుంచి నాలుగు శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

రైతులకు రుణమొత్తం పెంపు

జనవరి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రైతుల కోసం అతిపెద్ద మార్పును చేపట్టింది. ఇక నుంచి రైతులు గ్యారెంటీ లేకుండా బ్యాంకు నుంచి రూ.2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అంతకుముందు ఈ పరిమితి కేవలం రూ.1.60 లక్షల వరకే ఉండేది.

రూ.2 లక్షల వరకు తీసుకునే రుణాలకు ప్రస్తుతం ఎలాంటి సెక్యూరిటీ లేదా ఎలాంటి ముందు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఈ మార్పు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు ఇది సాయపడుతుంది.

మారిన వీసా నిబంధనలు

2025 జనవరి 1 నుంచి భారత్‌లోని అమెరికా ఎంబసీ వీసా ప్రక్రియలో మార్పు చేపట్టింది. మార్చిన నిబంధన కింద నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే తమ అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.

గతంలో ఈ వీసా దరఖాస్తుదారులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించకుండా మూడుసార్లు తమ అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది.

ఇక నుంచి వీసా దరఖాస్తుదారు రెండోసారి తమ అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేసుకోవాలంటే, కొత్తగా దరఖాస్తు చేసుకుని, మరోసారి వీసా ఫీజు చెల్లించాలి.

ఇక 2025 జనవరి 1 నుంచి తమ దేశానికి వచ్చే పర్యటకుల కోసం థాయిలాండ్ ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీంతో, భారతీయులతో పాటు థాయిలాండ్‌కు వెళ్లే అన్ని దేశాల వారు ఈ వీసా ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. దీనికోసం థాయిలాండ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)