You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మధ్యప్రదేశ్‌లో దళిత రైతు కుటుంబంపై పోలీసుల క్రూరమైన దాడి... ఆ దంపతులు విషం ఎందుకు తాగారు?
- రచయిత, సురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, భోపాల్ నుంచి
మధ్యప్రదేశ్ గుణలో దళిత రైతులపై పోలీసుల దాడి ఘటన సంచలనం రేపుతోంది. కాలేజీ నిర్మాణానికి తమ భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని దళిత రైతు దంపతులు ఆరోపించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని వారు అడ్డుకోవడంతో పోలీసులు వారిని తీవ్రంగా కొట్టారు.
తమ భూమి తమకు కాకుండా పోతోందని ఆందోళనలో రైతు దంపతులు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. భర్త కోలుకుంటుండగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.
మంగళవారం జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఈ దంపతుల ఏడుగురు పిల్లలు పోలీసుల దాడి సమయంలో ఏడుస్తూ, కేకలువేస్తూ కనిపించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కాలేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న వారి తల్లిదండ్రులను పోలీసులు తీవ్రంగా కొట్టారు.
ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ బుధవారం రాత్రి జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
కాలేజీ నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో ఆక్రమణలను తొలగించడానికి నగర సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలోని బృందం ఇక్కడికి చేరుకుంది. వివాదం ఉన్న భూమిలో రాజ్‌కుమార్ అహిర్వార్ అనే రైతు పంటను వేసుకున్నారు. పోలీసు బృందం దీనిని జేసీబీతో తొలగించడం ప్రారంభించింది. దీన్ని రైతు కుటుంబం అడ్డుకుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
ఈ సంఘటనలో శివరాజ్‌సింగ్ ప్రభుత్వ వైఖరిని మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తప్పు బట్టారు."శివరాజ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళుతోంది ? ఇది ఆటవిక రాజ్యమా ? ఒక దళిత రైతు కుటుంబాన్ని పోలీసులు దారుణంగా హింసించారు" అని ఆయన ట్వీట్‌లో విమర్శించారు. "బాధితుడి భూమికి సంబంధించి ప్రభుత్వంతో వివాదం ఉన్నప్పటికీ, దానిని చట్టబద్ధంగా పరిష్కరించవచ్చు, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతు దంపతులను వారి పిల్లలను ఇంత క్రూరంగా కొట్టడం న్యాయమా ? అతను దళితుడు, పేదవాడు కాబట్టే దాడి చేశారా? " అని ప్రశ్నించారు. "ఇటువంటి సంఘటనను ఎవరూ సహించరు. దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ మౌనంగా ఉండదు" అని కమల్‌నాథ్ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ సంఘనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. " ఇలాంటి ఆలోచనల మీద, అన్యాయాల మీద మా పోరాటం కొనసాగుతుంది'' అని ట్విటర్‌లో రాశారు.
మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా ఈ ఘటనపై స్పందించారు. "ఒకవైపు బీజేపీ ప్రభుత్వాలు దళితులను హింసిస్తున్నాయి. గత కాంగ్రెస్ పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. రెండు ప్రభుత్వాల మధ్య తేడా లేదు. దళితులు దీని గురించి ఆలోచించాలి" అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
అధికారులు చెబుతున్నదాని ప్రకారం ఈ భూమిని ఓ కాలేజీకి కేటాయించారు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ భూమిని మాజీ కౌన్సిలర్ ఆక్రమించారు. దానిని ఆయన రాజ్‌కుమార్ అనే రైతుకు కౌలుకు ఇచ్చాడు.
ఈ భూమిలో పంట వేసుకోడానికి రాజ్‌కుమార్ దాదాపు రూ.2లక్షలు అప్పు తీసుకున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ భూమిలో పంట పండించుకునే అధికారం వారికి ఉందని స్థానిక రైతులు వాదిస్తున్నారు.
రైతును ఆ స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించిన తర్వాత వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
అయితే, వారిని పోలీసులుగానీ, అధికారులుగానీ పట్టించుకోలేదు. పిల్లలు ఏడుస్తున్నా అలాగే వదిలేశారు. రాజ్‌కుమార్ సోదరుడు సంఘటనా స్థలానికి రాగానే అతన్ని కూడా పోలీసులు చితకబాదారు.
రాజ్‌కుమార్, అతని భార్య సావిత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడున్న చాలామందిపై పోలీసులు కేసు పెట్టారు. రైతు కుటుంబం పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని, అందుకే వారు కొంత కఠినంగా వ్యవహరించారని సంఘటనా స్థలంలో ఉన్న తహసీల్దార్ నిర్మల్ రాథోడ్ అన్నారు.
ఈ వీడియోను రోజంతా ట్విటర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అయ్యింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఒక రైతుపై పోలీసులు ఇలా అనాగరికంగా ప్రవర్తించడం ఇదే ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి వీడియోలు తరచూ బయటకు వస్తున్నాయి. కాని బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు.
వీడియో వైరల్ కావడంతో బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)