You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో గత నెలలో కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ అయిన ఒక ఇస్లామిక్ సంస్థకు చెందిన డజన్ల మంది సభ్యులు పూర్తిగా కోలుకున్న తర్వాత.. ఆరోగ్యం విషమించిన కోవిడ్-19 రోగులకు ప్లాస్మా దానం చేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనావైరస్ విస్తరించటానికి ఈ జమాత్ సభ్యులు కారణమని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో పూర్తిగా కోలుకున్న వందల మంది తబ్లిగీలు రక్తదానం చేయటానికి ముందుకు వచ్చారు.
దిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స చేసి పరీక్షిస్తున్నారు. కరోనావైరస్ ప్రభావిత రోగులకు మందులు, వ్యాక్సిన్లు ఏమీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం భారత్ సహా పలు దేశాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ప్లాస్మా థెరపీకి రోగుల ఆరోగ్యం స్పందిస్తున్న సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దిల్లీలోని మూడు ప్రభుత్వ ఆస్పత్రులు.. దాదాపు నెల రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న జమాత్ సభ్యుల నుంచి రక్తం సేకరిస్తున్నాయి.
ఆదివారం ప్లాస్మా దానం చేసిన వారిలో తమిళనాడుకు చెందిన ఫరూక్ బాషా ఒకరు. తన సహ భారతీయులకు సాయం చేయగలగటం తనకు సంతోషాన్నిస్తోందని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘మాలో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినందుకు మీడియా మమ్మల్ని దారుణంగా చిత్రీకరించింది. అల్లా దయవల్ల.. ప్లాస్మా దానం చేసిన మా పని వల్ల మా ప్రతిష్ట మెరుగుపడుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
దిల్లీలో ఒక మతపరమైన సమావేశం.. దేశ వ్యాప్తంగా అనేక కోవిడ్-19 క్లస్టర్లకు దారితీయటంతో తబ్లిగీ జమాత్ సంస్థ ప్రధాన వార్తల్లోకి ఎక్కింది.
దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో గత నెల రెండు, మూడు వారాల్లో ఆ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు.
మార్చి 24వ తేదీ రాత్రి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ అన్ని రకాల ప్రయాణ సాధనాలనూ నిలిపివేయటంతో.. 250 మంది విదేశీయులు సహా చాలా మంది సభ్యులు ఈ ప్రధాన కార్యాలయంలో చిక్కుకుపోయారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో వేయి మందికి పైగా కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
జమాత్ చీఫ్ మొహమ్మద్ సాద్ కంధలావి మీద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆయన మీద మనీ లాండరింగ్ ఆరోపణలూ ఉన్నాయి. అయితే.. ఈ ఆరోపణలన్నీ పోలీసుల ఊహాగానాలేనని మొహమ్మద్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు తప్పుపడుతున్నారు.
కరోనావైరస్ సోకిన తబ్లిగీ జమాత్ సభ్యులను మీడియాలోని ఒక వర్గం ‘‘వైరస్‌లు’’గా, ‘‘వైరస్ వాహకులు’’గా అభివర్ణించింది. ‘‘కరోనాజిహాద్’’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండయ్యాయి. జమాత్ వలంటీర్లు జనసమ్మర్థ ప్రాంతాల్లో కరోనాను వ్యాప్తి చేయటానికి ఆ వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్‌ను అంటించుకున్నారని చాలా మంది ఆరోపించారు. తబ్లిగీలను సూయిసైడ్ బాంబర్లతో కూడా పోల్చారు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల పాటు తబ్లిగీ రోగుల వల్ల వైరస్ వ్యాప్తి వివరాలను ప్రకటిస్తూ వచ్చింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ముస్లింలు వేధింపులకు గురైనట్లు వార్తలు వచ్చాయి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
తబ్లిగీ జమాత్ ఒక అంతర్జాతీయ సంస్థ. పశ్చిమ ప్రపంచంలో దీనికి బలమైన ఉనికి ఉంది. దీనిని 1926లో భారతదేశంలో నెలకొల్పారు. వీరి మీద ఆరోపణలతో దాడి కొనసాగటం పట్ల గత వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. ప్రముఖ అరబ్ పౌరులు చాలా మంది భారతదేశ లౌకికత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. వైరస్‌కు ఏ మతమూ లేదంటూ ట్వీట్ చేసి అందరూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు.. జమాత్ ప్లాస్మా దానం గురించిన విషయాన్ని మీడియాకు వెల్లడించటానికి ముందు.. ‘‘ఉదాహరణకు.. విషమ పరిస్థితిలో ఉన్న ఒక హిందువును ఒక ముస్లిం దానం చేసిన ప్లాస్మాతో, లేదంటే విషమ పరిస్థితిలో ఉన్న ఒక ముస్లిం రోగిని ఒక హిందువు దానం చేసిన ప్లాస్మాతో కానీ రక్షించారనుకుందాం. దేవుడు భూమిని సృష్టించినపుడు ఆయన కేవలం మనుషులను సృష్టించాడు. ప్రతి మనిషికీ రెండు కళ్లు, ఒక శరీరం ఉంటుంది. వారి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ప్లాస్మా ఉంటుంది. దేవుడు మన మధ్య గోడలు సృష్టించలేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఆదివారం ప్లాస్మా దానం చేసిన తొలి దాతల్లో మరొకరు అనాస్ సయ్యద్. తబ్లిగీ చీఫ్ ఇచ్చిన పిలుపును అనుసరించి తాము స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేసినట్లు ఆయన చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా రక్త దానం చేయటానికి చాలా మంది ముందుకు వచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జమాత్ సభ్యుడు బర్కత్ ఖలీల్‌కు, ఆయన కుటుంబ సభ్యులు ఎనిమిది మందికీ గత నెలలో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ‘‘మాలో నలుగురం పూర్తిగా కోలుకున్నాం. మేం ప్లాస్మా దానం చేయబోతున్నాం’’ అని ఆయన తెలిపారు.
అయితే జమాత్ సభ్యుల విషయంలో వ్యవహరించిన తీరు పట్ల ఆయన కలత చెందినట్లు కనిపించారు. ‘‘మా మతం వారిని రాజకీయంగా లక్ష్యం చేసుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
దిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగులను ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సహించే పనిని జమాత్ సంస్థకు సన్నిహితుడైన డాక్టర్ షోయబ్ అలీకి అప్పగించారు.
‘‘గత నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారితులైన వారందరూ పూర్తిగా కోలుకున్నారు. వాళ్లందరూ ప్లాస్మా దానం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. దిల్లీలో కొద్ది రోజుల్లోనే 300 – 400 మంది ప్లాస్మా దానం చేస్తారు’’ అని ఆయన తెలిపారు.
జమాత్ దాతలు దేశ పౌరులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పారు. జరిగిన నష్టాన్ని నియంత్రించుకోవటం కోసం చేసే పని అనే వాదనను ఆయన తిరస్కరించారు. ‘‘జమాత్‌ను గత నెలలో అపకీర్తి పాలు చేయకపోయినా కూడా వీళ్లు ప్లాస్మా దానం చేయటానికి ముందుకు వచ్చేవాళ్లు. ఎందుకంటే వాళ్లు దేవుడి భక్తులు. త్యాగ స్ఫూర్తిని నేర్చుకున్నవారు’’ అని డాక్టర్ అలీ పేర్కొన్నారు.
దిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పరిమితంగా ఉన్నందున.. ప్లాస్మా దానం ప్రక్రియ పూర్తికావటానికి చాలా రోజులు పడుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
దాతల జాబితాలో చాలా మంది ఉన్నప్పటికీ ఆదివారం నాడు కేవలం ఎనిమిది, పది మంది మాత్రమే దానం చేయగలిగారని తెలిపారు. సోమవారం నాడు 60 మంది వలంటీర్ల నుంచి రక్తం సేకరించారు.
ఒక రోగికి ప్లాస్మా థెరపీ పనిచేసిందని చెప్తున్న క్రమంలో.. కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్న రోగులు ప్లాస్మా దానం చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
లక్నో లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో సంక్రమణ వ్యాధుల విభాగంలో పనిచేసే డాక్టర్ తౌసీఫ్ ఖాన్ కూడా ప్లాస్మా దానం చేశారు. ఆయన మార్చి నెలలో ఒక రోగికి చికిత్స చేస్తుండగా కరోనా ఇన్‌ఫెక్షన్ సోకింది. తన ప్లాస్మా పొందిన వ్యక్తి బాగా కోలుకుంటున్నారని డాక్టర్ తౌసీఫ్ చెప్పారు.
‘‘పరిస్థితి తీవ్రంగా విషమించి, శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేకపోతున్న కరోనా రోగులకు మాత్రమే మేం ప్లాస్మా థెరపీ చేస్తాం. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి ఇతర వ్యాధులు ఉన్నవారిలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీలు సక్రమంగా ఉత్పత్తికావు’’ అని ఆయన వివరించారు.
ప్లాస్మా దానం చాలా సులభమైన ప్రక్రియ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులకు రెండు సార్లు నెగెటివ్ నిర్ధరణ కావటం తప్పనిసరి. ఆ తర్వాత వారిని ఇంటికి పంపించి మరో 14 రోజుల పాటు స్వయంగా క్వారంటైన్‌లో ఉండాలని చెప్తారు. వారు ప్లాస్మా దానం చేయాలనుకుంటే ఆస్పత్రికి పిలిపించి ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేస్తాం. ఆ పరీక్ష నెగెటివ్ వస్తే వారు ప్లాస్మా దానం చేయొచ్చు’’ అని తెలిపారు.
రక్తంలో ప్లాస్మా కేవలం 55 శాతం మాత్రమే ఉంటుందని, అందులోనూ 90 శాతం నీరే ఉంటుందని.. కేవలం 10 శాతం మాత్రమే ఎంజైములు, ప్రొటీన్లు, లవణాలు వంటి యాంటీబాడీలు ఉంటాయని డాక్టర్ తౌసీఫ్ తెలిపారు. అవసరమైన రోగులకు.. కేవలం ఆరోగ్యవంతమైన ప్లాస్మా మాత్రమే ఇస్తారు.
‘‘మేం 500 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీసుకుంటాం. అది కనీసం ఒక రోగి ప్రాణాలను కాపాడగలదు’’ అని పేర్కొన్నారు.
ప్లాస్మా థెరపీ ఇంకా పరీక్షల దశలోనే ఉంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్ మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఈ చికిత్సను ప్రారంభించటానికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.
తబ్లిగీ జమాత్ వలంటీర్లు ఆదివారం ప్లాస్మా దానం చేయటం మొదలైనప్పటి నుంచీ ఎంత మంది రోగులకు ప్లాస్మా థెరపీ చేసారన్న వివరాలు తెలియదు. అయితే.. ప్లాస్మాను మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ చల్లదనంలో ఏడాది పాటు నిల్వ చేయవచ్చునని డాక్టర్లు చెప్తున్నారు. మహమ్మారి విస్తరించటం కొనసాగి, విషమ పరిస్థితుల్లో ఉండే రోగుల సంఖ్య పెరిగినట్లయితే.. ఇలా నిల్వచేసిన ప్లాస్మా త్వరగా ఉపయోగపడగలదు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)