బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం దిల్లీలో జరిగింది. మీరాబాయి చానుకు ఈ అవార్డు లభించింది. కరణం మల్లీశ్వరికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, క్రికెటర్ షెఫాలీ వర్మకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు లభించాయి.

లైవ్ కవరేజీ

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు and ఆలమూరు సౌమ్య

  1. తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..

    మునియలక్ష్మి

    తమిళనాడులోని టుటికోరిన్ (తూతుకుడి) జిల్లాలో 17 ఏళ్ల ఒక అమ్మాయి తన మగ స్నేహితులతో కలసి సొంత తల్లిని హత్య చేసింది.

    అబ్బాయిలతో ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతున్నావంటూ తల్లి మందలించినందుకే ఆ అమ్మాయి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.

    పోలీసుల కథనం ప్రకారం.. టుటికోరిన్ జిల్లాలోని మేళషన్ముగాపురంలో ఈ హత్య జరిగింది. మృతురాలి పేరు మునియలక్ష్మి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త పేరు మాదసామి. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం.

    భర్తతో సమస్యలు తలెత్తడంతో ఆమె తన పిల్లలతో కలసి వేరుగా జీవిస్తోంది.

    ఆమె కుమార్తెల్లో ఒకరైన 17 ఏళ్ల యువతి పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.

  2. విల్ స్మిత్: తన పెళ్లాంపై కుళ్లు జోకు వేసిన కమెడియన్‌‌ చెంప పగలగొట్టిన హాలీవుడ్ హీరో

  3. బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను

    మీరాబాయి చాను

    బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేతగా వెయిట్‌ లిఫ్టింగ్ ఛాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చాను నిలిచారు.

    మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు.

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన ఘనత ఆమెదే.

    2016 రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకు మీరాబాయి ప్రయాణం మరచిపోలేనిది.

    ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

    ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జన్మించారు మీరాబాయి చాను. ఆమె తండ్రి ఒక టీ స్టాల్ నడిపేవారు.

    కెరీర్ తొలి దశలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

    ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు.

  4. కరణం మల్లీశ్వరికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. షెఫాలీ వర్మకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు

    బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ప్రదాన కార్యక్రమం న్యూ దిల్లీలో జరుగుతోంది.

    ఈ కార్యక్రమంలో భాగంగా.. కరణం మల్లీశ్వరికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, షెఫాలీ వర్మకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు లభించింది.

    కరణం మల్లీశ్వరి
    షెఫాలీ వర్మ
    టిమ్ డేవీ
  5. Live: బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం

    బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ప్రదాన కార్యక్రమం న్యూ దిల్లీలో జరుగుతోంది. విజేత ఎవరంటే..

  6. Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, బీబీసీ ప్రతినిధి

    సున్నా మైలు

    ఫొటో సోర్స్, BSN MALLESWARA RAO/BBC

    ఇప్పుడు దూరాన్ని కొలిచేందుకు జీపీఎస్‌, మొబైల్ యాప్స్‌లోని మ్యాప్స్ వాడుతున్నాం. కానీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం కొలతలకు మాత్రం ఇప్పటికీ జీటీ స్టేషన్లే ప్రామాణికంగా ఉన్నాయి.

    ఒక జిల్లా, తాలూకా, గ్రామం సరిహద్దులను కొలిచి.. వాటిని జీటీ స్టేషన్లకు, తద్వారా గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వేకు అనుసంధానం చేశారు. ఈ సర్వేను ట్రావెర్స్ సర్వే అని పిలుస్తారు. దీని ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఇప్పటికీ సరిహద్దు రాళ్లు ఉంటాయి. ఒకవేళ అవి భౌతికంగా కంటికి కనిపించకపోయినప్పటికీ.. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తప్పకుండా ఉంటాయి.

    దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తుంటాం.. ఒక ఊరి నుంచి మరొక ఊరికి మధ్య ఫలానా కిలోమీటర్ల దూరం అంటుంటాం. మరి ఈ కిలోమీటర్ లెక్క ఎక్కడ మొదలైంది?

  7. బీబీసీ ISWOTY అవార్డు- 2021 ప్రదాన కార్యక్రమం..

    బీబీసీ ISWOTY అవార్డు- 2021 ప్రదాన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి - LIVE

  8. పాకిస్తాన్ పార్లమెంటులో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. మార్చి 31వ తేదీన చర్చ

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆ దేశ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

    ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్వీకరించడంపై డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి సభలో ఓటింగ్ జరిపారు.

    161 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారని, కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

    ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్ మార్చి 31వ తేదీన జరుగుతాయని ప్రకటించారు. అనంతరం జాతీయ అసెంబ్లీ వాయిదా పడింది.

    ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన 161 మంది ఎంపీలంతా సభకు హాజరయ్యారని, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీల ఎంపీలు మాత్రం హాజరు కాలేదని బీబీసీ ఉర్దూ తెలిపింది.

    బీబీసీ ఉర్దూ అందించిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఎంపీల సంఖ్య 342. సభలో తమకు బలం ఉందని నిరూపించుకోవాలంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి 172 మంది ఎంపీల మద్దతు అవసరం.

    ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ పార్టీకి ఉన్న ఎంపీలు 155 మంది. మిత్రపక్షాల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

  9. ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

    అంతర్జాతీయం:

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం:

    • రష్యాతో తదుపరి రౌండ్ శాంతి చర్చల్లో సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకే యుక్రెయిన్ పెద్దపీట వేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఈ వారం టర్కీలో ముఖాముఖి చర్చలు జరగనున్నాయి.
    • అలాగే, న్యూట్రల్ స్టేటస్‌పై చర్చలు జరిపేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత యుద్ధానికి ప్రధాన కారణం ఇదే.
    • యుక్రెయిన్‌లో రష్యా ముట్టడించిన నగరాల నుంచి సోమవారం ప్రజలను తరలించే ప్రయత్నాలు నిలిపివేశామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు. పౌరులను తరలించే దారులలో రష్యా "రెచ్చగొట్టే చర్యలు" చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.
    • యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో సోమవారం నుంచి ఆన్‌లైన్‌ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆ మేరకు కీయెవ్ నగర మేయర్ ఆదివారం ఒక ప్రకటన చేశారు.
    • రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలకు 63 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4,80,303 కోట్లు) నష్టం వాటిల్లిందని కీయెవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంచనా వేసింది.
    • భారీ నష్టాలను చవిచూసిన రష్యా, కీయెవ్ ప్రాంతం నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకుందని యుక్రెయిన్ మిలిటరీ జనరల్ స్టాఫ్ చెప్పారు.
    • రెండు వ్యూహాత్మక బెటాలియన్ సమూహాలను యుక్రెయిన్ నుంచి వెనక్కు మరలించి మిత్రదేశమైన బెలారుస్‌కు తరలించిందని చెప్పింది. ఈ యూనిట్లు "గణనీయమైన నష్టాలను" చవిచూశాయని తెలిపింది.
    • యుక్రెయిన్ నగరం చెర్నిహివ్‌లో వేలాది పౌరులు చిక్కుకుపోయారు. నెలరోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్, మంచినీరు, విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
    • దోన్యస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా చేసిన అయిదు దాడులను తిప్పికొట్టామని యుక్రెయిన్ రక్షణ దళాలు తెలిపాయి. యుక్రెయిన్ సైన్యం ఇచ్చే రోజువారీ అప్‌డేట్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
    • యుక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ వివిధ దేశాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
    • యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని, పౌరులకు మానవతా సహాయం అందించే అవకాశం కల్పించాలని పుతిన్‌కు ఫోన్ కాల్‌లో పిలుపునిచ్చారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్.
    • రష్యాలో ప్రభుత్వం మారాలన్నది తన ఉద్దేశం కాదని బైడెన్ అన్నారు. శనివారం పోలండ్ రాజధాని వార్సాలో బైడెన్ ప్రసంగిస్తూ "పుతిన్ ఇక ఎంతమాత్రం అధికారంలో కొనసాగకూడదని" అన్నారు. అయితే, రష్యాలో పాలనలో మార్పుకు పిలుపునివ్వడం తన ఉద్దేశం కాదని విలేఖరుల సమావేశంలో బైడెన్ చెప్పారు.

    ఆస్కార్ అవార్డులు:

    • ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది లాస్ లాస్‌ ఏంజెలెస్‌‌లో ముగిసింది.
    • ఆస్కార్ అవార్డుల వేదికపై హాలీవుడ్ నటులు యుక్రెయిన్ పక్షం వహించారు. యుక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలిపేందుకు సెలబ్రిటీలు కొద్దిసేపు మౌనం పాటించారు.
    • ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో స్టాండ్-అప్ కమెడియన్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేయి చేసుకున్నారు. వేదికపై తన భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి క్రిస్ రాక్ జోక్ చేయడంతో విల్ స్మిత్, రాక్ చెంప మీద కొట్టారు.

    పాకిస్తాన్:

    • ఆదివారం తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది కాబట్టి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
    • అయితే, అలాంటి సమాచారం తనకేమీ తెలియదని హోం మంత్రి రషీద్ అహ్మద్ అన్నారు.
  10. విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్.. దాని గురించి తనకేమీ తెలీదన్న పాక్ హోం మంత్రి

    పాకిస్తాన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో విదేశీ హస్తం ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాల గురించి తనకు తెలియదని పాకిస్తాన్ హోం శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు.

    ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అలాంటి పత్రాల గురించి తనకేమీ తెలియదని చెప్పారు.

    ఆదివారం తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది కాబట్టి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

    తనను రాతపూర్వకంగా బెదిరించారని, తన వాదనను నిరూపించే ఒక లేఖ కూడా తన దగ్గర ఉందని ఇమ్రాన్ ఖాన్ అదే ర్యాలీలో పేర్కొన్నారు.

    ఆదివారం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు షేక్‌ రషీద్‌ కూడా పాల్గొన్నారు.

    సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ, "నాకు తెలియని విషయాల గురించి నేను జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేదని" అని అన్నారు.

    పాకిస్తాన్‌లో ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. కాల్పుల విరమణ పాటించాలని ఫోన్ కాల్‌లో పుతిన్‌కు చెప్పిన టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్

    యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ పాటించాలని, పౌరులకు మానవతా సహాయం అందించే అవకాశం కల్పించాలని పుతిన్‌కు ఫోన్ కాల్‌లో పిలుపునిచ్చారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్.

    "శాంతిని అమలుచేయడానికి, ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందించడానికి రష్యా, యుక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ కీలకమని ఎర్దోవాన్ భావిస్తున్నారు" అని టర్కీ అధ్యక్షుడి కార్యాలయం తెలిపినట్టు రాయిటర్స్ వెల్లడించింది.

    "ఈ ప్రక్రియకు కావలసిన సహాయాన్ని టర్కీ అందిస్తుందని అధ్యక్షుడు ఎర్దోవాన్ చెప్పారు" అంటూ టర్కీ అధ్యక్షుడి కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.

    ఇస్తాంబుల్‌లో తరువాత రౌండ్ శాంతి చర్చలు జరిపేందుకు రష్యా, యుక్రెయిన్ సిద్ధమవుతున్నాయి.

  12. సోమవారం యుక్రెయిన్ నగరాల నుంచి పౌరులను తరలించే ప్రయత్నాలు నిలిపివేశారు..

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌లో రష్యా ముట్టడించిన నగరాల నుంచి సోమవారం ప్రజలను తరలించే ప్రయత్నాలు నిలిపివేశామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు.

    పౌరులను తరలించే దారులలో రష్యా "రెచ్చగొట్టే చర్యలు" చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.

    మరియుపోల్, సుమీ సహా రాజధాని కీయెవ్‌కు వెలుపల ఉన్న పట్టణాలు, గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

    ప్రస్తుతం ఈ మార్గాలన్నింటినీ రష్యా చుట్టుముట్టింది. ఇంతకుముందు కూడా నగరాల నుంచి పౌరులను తరలించేదుకు వీలు లేకుండా రష్యా అవిరామంగా కాల్పులు జరుపుతూనే ఉంది.

  13. ఆస్కార్ 2022: ఆస్కార్ ప్రతిమ విలువ ఎంత? 10 ఆసక్తికర విషయాలు

    హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలెస్‌లో ఆదివారం జరిగింది.

    1929 నుంచి హాలీవుడ్‌లో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' అందజేస్తోన్న ఈ అవార్డులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

    Oscar 2021

    ఫొటో సోర్స్, Getty Images

  14. యుక్రెయిన్‌కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ వివిధ దేశాల్లో ఆదివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, లండన్ పార్లమెంటు బయట
    లెబనాన్

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, లెబనాన్ రాజధాని బేరూత్‌లో పొడవైన యుక్రెయిన్ జెండాతో నిరసనకారులు
    రష్యా

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, 'నెల రోజుల యుద్ధం చాలేమో?' అని రాసి ఉన్న ప్లకార్డులతో మోల్డోవాలోని చిసినావ్‌లో రష్యన్ ఎంబసీ ముందు నిరసనకారులు
    US, అమెరికా

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో
    చిలీ

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, చిలీలోని శాంటియాగోలో నిరసనకారులు యుక్రెయిన్ జాతీయ పుష్పం సన్‌ఫ్లవర్‌లు పట్టుకుని ప్రదర్శనలు చేశారు.
  15. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) 2021: విజేత ప్రకటన నేడే

    ISWOTY 2021

    నిరీక్షణ ముగింపు దశకు చేరుకుంది. బీబీసీ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరో ఈ రోజు అభిమానులకు తెలుస్తుంది.

    దిల్లీలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో విజేతను ప్రకటిస్తారు. బీబీసీ ఎమర్జింగ్ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్, బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల విజేతలను కూడా ఈ కార్యక్రమంలో ప్రకటిస్తారు.

    ఈ అవార్డుల నామినీలు, విజేతలతో పాటు.. టోక్యో ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణులు కొందరిని బీబీసీ సన్మానిస్తుంది. వీరిలో భారత హాకీ జట్టు సభ్యులు కూడా ఉంటారు.

    బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీతో పాటు క్రీడా రంగం, ఇతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.

    ఈ కార్యక్రమ విశేషాల లైవ్ కవరేజీని అన్ని బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీల్లో మీరు ఫాలో కావచ్చు.

  16. యుక్రెయిన్‌లో 63 బిలియన్ డాలర్ల మౌలికసదుపాయాలకు నష్టం వాటిల్లింది

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మార్చి 24న కీయెవ్ సమీపంలో ధ్వంసమైన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలకు 63 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4,80,303 కోట్లు) నష్టం వాటిల్లిందని కీయెవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంచనా వేసింది.

    యుద్ధం మొదలైన దగ్గర నుంచి మార్చి 24 వరకు జరిగిన ఆర్థిక నష్టాన్ని ఈ సంస్థ అంచనా వేసింది.

    తాజా అంచనాల ప్రకారం, కనీసం 4,431 నివాస భవనాలు, 92 ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లు, 378 స్కూళ్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. వీటిల్లో కొన్ని రష్యా అధీనంలోకి వెళ్లాయి.

    అదనంగా 12 విమానాశ్రయాలు, ఏడు థర్మల్ లేదా జలవిద్యుత్ పవర్‌ప్లాంట్లు దెబ్బతిన్నాయి లేదా రష్యా అధీనంలోకి వెళ్లాయి.

    ఈ సంస్థ మార్చి 17న వేసిన అంచనాలకు మార్చి 24 అంచనాలకు మధ్య 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26,679 కోట్లు) నష్టం వాటిల్లింది.

  17. కీయెవ్‌లో ఆన్‌లైన్ స్కూళ్లు మళ్లీ తెరుచుకోబోతున్నాయి

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో సోమవారం నుంచి ఆన్‌లైన్‌ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆ మేరకు కీయెవ్ నగర మేయర్ ఆదివారం ఒక ప్రకటన చేశారు.

    "ప్రస్తుత పరిస్థితులను అనుసరించి, వివిధ మాధ్యమాలలో విద్యాబోధన జరుగుతుంది" అని అందులో తెలిపారు.

    "మార్షలా లా విధించిన పరిస్థితుల్లో కూడా బతకగలగడం, పనిచేసుకోవడం అనేది ఇప్పుడు పౌరుల ముందున్న కఠినమైన లక్ష్యం" అని విటాలి క్లిట్ష్కో టెలిగ్రాంలో అన్నారు.

    "వాళ్లు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు" అని ఆయన అన్నారు.

    యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో సగానికి పైగా పిల్లలు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

  18. ఉత్తర కొరియా జైలు జీవితం: బలవంతపు అబార్షన్లు, చిత్ర హింసలు... దేశం వదిలి వెళ్లాలనుకుంటే అంతే సంగతులు

    జైలులోని తన గదిలోకి పాకుతూ వెళ్లిన తర్వాత, నేలపై కూర్చోవాల్సిందిగా లీ యాంగ్-జు అనే మహిళకు ఆదేశాలు అందాయి. మోకాళ్లపై రెండు చేతులు పెట్టుకొని కదలకుండా కూర్చోవాలని ఆమెకు చెప్పారు.

    ఒక రోజులో 12 గంటల పాటు ఆమె అలా కూర్చోవాల్సిందే. ఆ సమయంలో కదలడానికి వీల్లేదు. కాస్త కదిలినా లేదా పక్కనున్న వారితో గుసగుసగా మాట్లాడినా కూడా కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.

    కావాలనుకున్నప్పుడు నీరు తాగే స్వేచ్ఛ కూడా ఉండదు. తినడానికి కొన్ని మొక్కజొన్న గింజలు ఇస్తారు.

  19. రష్యా చేసిన అయిదు దాడులను తిప్పికొట్టాం - యుక్రెయిన్

    రష్యా, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Ukraine Armed Forces on Facebook

    దోన్యస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా చేసిన అయిదు దాడులను తిప్పికొట్టామని యుక్రెయిన్ రక్షణ దళాలు తెలిపాయి. యుక్రెయిన్ సైన్యం ఇచ్చే రోజువారీ అప్‌డేట్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

    ఆ రిపోర్టులో తెలిపిన వివరాలివి..

    • కీయెవ్‌లో నగరంలో కీలకమైన రహదారులు, నివాస ప్రాంతాలపై రష్యా పట్టు సాధించకుండా యుక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది.
    • దోన్యస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో యుక్రెయిన్ దళాలు రష్యాకు చెందిన రెండు ట్యాంకులను, ఒక పదాతిదళ వాహనాన్ని, ఒక కారును ధ్వంసం చేశాయి.
    • రష్యా బలగాలు ప్రాణనష్టాన్ని కూడా చవిచూశాయని రిపోర్టు తెలిపింది.
    • 4 విమానాలు, 1 హెలికాప్టర్, 2 UAVలను ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.

    ఈ వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

  20. క్రిస్ రాక్ చెంపపై కొట్టిన విల్ స్మిత్.. ఆస్కార్ వేదికపై హంగామా

    ఆదివారం రాత్రి లాస్ లాస్‌ ఏంజెలెస్‌‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో స్టాండ్-అప్ కమెడియన్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేయి చేసుకున్నారు.

    వేదికపై తన భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి క్రిస్ రాక్ జోక్ చేయడంతో విల్ స్మిత్, రాక్ చెంప మీద కొట్టారు.

    జాడా స్మిత్ హెయిర్ స్టైల్ గురించి రాక్ కామెంట్ చేస్తూ, "జాడా, GI Jane 2 కోసం వెయిట్ చేయలేకపోతున్నారు" అని అన్నారు.

    వెంటనే విల్ స్మిత్ స్టేజీ పైకి ఎక్కి రాక్ చెంప మీద కొట్టి, "నా భార్య పేరు నీ... నోటి నుంచి రానివ్వకు" అని అరిచారు.

    ఆస్కార్ 2022

    ఫొటో సోర్స్, REUTERS

    విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా 2022 ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

    అవార్డు అందుకుంటూ స్మిత్ కన్నీళ్లపర్యంతమయ్యారు.

    "అకాడమీకి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా తోటి నామినీలందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను" అని స్మిత్ అన్నారు.

    స్మిత్ చెంపపై కొట్టగానే రాక్ షాక్ అయ్యారు.

    "ఇది టెలివిజన్ చరిత్రలో గొప్ప రాత్రి" అని ప్రేక్షకులతో అన్నారు.

    ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాక్ నిరాకరించారని లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు.

    "హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు" అని ఆస్కార్ అవార్డులను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ట్వీట్ చేసింది.

    ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు అందించడానికి క్రిస్ రాక్ స్టేజీ పైకి వచ్చారు. ఆ తరువాత ఈ హంగామా అంతా జరిగింది.

    GI Jane, 1997లో విడుదలైన చిత్రం. అందులో డెమి మోరే ఒక వింత హెయిర్ స్టైల్‌తో కనిపిస్తారు. ఆ చిత్రాన్ని ఉద్దేశిస్తూ రాక్, జాడా స్మిత్ గురించి జోక్ చేశారు.

    జాడా స్మిత్ తనకు జుట్టు ఊడిపోవడం గురించి 2018లో ఒక ఫేస్‌బుక్ చాట్‌లో మాట్లాడారు. "జుట్టు ఊడిపోవడం సమస్యతో పోరాడుతున్నాను. మొదటిసారి ఎక్కువగా ఊడినప్పుడు చాలా భయమేసింది. గుండు అయిపోతుందేమోనని భయపడ్డా" అని ఆమె అన్నారు.

    కాగా, ఆస్కార్ వేదికపై జరిగినదంతా ముందే ప్లాన్ చేసుకున్న స్టంట్ అని పలువురు అభిప్రాయపడ్డారు.