సీజేపీ ఉద్యమం ఇకపై ఏ మలుపు తీసుకుంటుంది?

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించింది. అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ భద్రతపై సీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. మరోవైపు దిల్లీలో పోలీసుల చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

సారాంశం

  • జ్ఞానేశ్ కుమార్‌‌ను పదవి నుంచి తొలగించేవరకూ ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ తెలిపింది.
  • దిల్లీలో పోలీసుల చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. నిరసనకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అటు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ భద్రతపై సీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది.
  • ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు విడిచిపెట్టారు.
  • విజయవాడలో ఆందోళన చేస్తున్నఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను దిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.
  • కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్‌మంతర్, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు.
  • న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను రద్దు చేశారు.
  • రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
  • డీజిల్ దిగుమతి ఒప్పందం పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడి అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. శాంతించిన దిల్లీ వీధులు

    నిరసనలు, ప్రశాంత వాతావరణం, దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, దిల్లీ జన్‌పథ్ జంక్షన్

    పవన్ కాంత్ దిగవల్లి

    బీబీసీ ప్రతినిధి

    శనివారం ఉదయం నుంచి నిర్బంధాలు, నినాదాలతో మారుమోగిన దిల్లీ వీధులు శాంతించాయి.

    దిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా నిరసనలకు పిలుపునిచ్చిన అక్టోబర్ 10 రాత్రికి సెంట్రల్ దిల్లీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా, ఖాళీగా మారిపోయాయి.

    అయితే బారికేడ్లు, భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. కానీ రాత్రి 8:30 గంటల నుంచీ అన్ని చోట్లా ప్రరిస్థతి ప్రశాంతంగా కనిపించింది.

    దిల్లీ వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకోవడంలో దిల్లీ పోలీసుల ప్రయత్నాలు విజయవంతమయ్యాయని చెప్పుకోవచ్చు.

    జన్‌పథ్ జంక్షన్, కన్నాట్‌ప్లేస్, లే మెరీడియన్ సర్కిల్, పార్లమెంటు జంక్షన్, కర్తవ్యపథ్, మండీ హౌస్, ఆకాశవాణి భవన్ ప్రాంతం అన్నీ కూడా రాత్రి 9:00 గంటల సమయంలో ప్రశాంతంగా కనిపించాయి.

    అనేక జంక్షన్లలో రోజంతా వందలాది మంది నిరసనకారులను భద్రతా బలగాలు అడ్డుకుంటూ బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కిస్తూ అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించేశారు.

    ఉదయం నుంచీ మొత్తంగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడెక్కడికి వాళ్లను తరలిస్తున్నారనే సమాచారాన్ని పోలీసు అధికారులెవరూ అధికారికంగా ధృవీకరించడంలేదు.

    పోలీసుల అదుపులోంచి బయటకు వచ్చాక ఆందోళనకారులు తమ నిరసనలను కొనసాగిస్తారా లేక పరిస్థితి చల్లారుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

  2. సీజేపీ ఉద్యమం ఇకపై ఏ మలుపు తీసుకుంటుంది?

    సీజేపీ, కాంగ్రెస్, దిల్లీ, నిరసన
    ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ నేతలు తెలిపారు.

    దిల్లీ పోలీసుల చర్య, రోజంతా కొనసాగిన నిర్బంధాల అనంతరం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఎస్ఎఫ్ఐ సహా పలు విద్యార్థి సంఘాలు హెచ్‌కేఎస్ సుర్జీత్ భవన్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ నాయకుడు అజింక్య శిందే ప్రకటించారు.

    అభిజీత్ దీప్కే, ఇతరులతో దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా ఆయన విమర్శించారు.

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ఐక్యంగా ఉద్యమించాలని ఎస్‌ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య పిలుపునిచ్చారు.

    ఆదివారం(అక్టోబర్ 11) నుంచి విద్యార్థి ఉద్యమం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తారని, పోలీసులు బారికేడ్లతో వారిని ఎక్కడ అడ్డుకుంటారో, ఆ ప్రదేశమే జంతర్ మంతర్ అవుతుందని ఆయన చెప్పారు.

  3. పోలీసుల చర్యలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన

    దిల్లీలో నిరసన
    ఫొటో క్యాప్షన్, నిరసనకారులున్న పోలీసు బస్సును అడ్డుకున్న లాయర్

    కాక్రోచ్ జనతాపార్టీ నిరసన సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నవారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

    ఈ నిరసన సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు జరిగినట్టు వార్తలొచ్చాయి.

    మరోవైపు దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పలువురు సీజేపీ కార్యకర్తలను పోలీసులు అకస్మాత్తుగా చుట్టుముట్టారు. వారిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు.

    నిరసనకారులను తీసుకువెళ్తున్న బస్సును ఓ లాయర్ ఆపడంతో, వారిలో చాలామంది బస్సు దిగి పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నారు.

    బీబీసీ రిపోర్టర్ రాఘవేంద్రరావు పలువురు సీజేపీ నిరసనకారులతో మాట్లాడారు.

    'జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుంది' అని వారిలో ఒకరు అన్నారు.

    అటు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ భద్రతపై కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన వ్యక్తంచేసింది.

  4. ప్రభుత్వం భయపడుతోంది : ప్రియాంక

    నిరసన, దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, నిరసనలకు ప్రభుత్వం భయపడుతోందని ప్రియాంక గాంధీ అన్నారు.

    భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు.

    "ప్రాథమిక రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ మొదట 254 మంది ఎంపీలతో ఘర్షణకు దిగి చట్టవిరుద్ధంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రతిపక్షాలకు చెందిన నిరసనకారులతో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు" అని ప్రియాంక గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    ‘‘ఆ తర్వాత దేశ రాజధానిని దిగ్బంధించి, బారికేడ్లతో మూసివేశారు. రైలు, మెట్రో సేవలను నిలిపివేశారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. వివిధ ప్రదేశాలలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ హక్కు కింద నిరసన తెలుపుతున్న యువతను, మహిళలను, పురుషులను నిర్బంధించారు.’’ అని చెప్పారు.

    ‘‘ఎన్నికల సంఘం అండతో ఎన్నికల్లో అక్రమాలు చేశారనడానికి, తన చట్టబద్ధతను ప్రశ్నిస్తారని, జవాబుదారీతనం కోరతారని ప్రభుత్వం భయపడుతోందని చెప్పడానికి ఇది రుజువు కాకపోతే మరేంటి?’’ అని ప్రియాంక ప్రశ్నించారు.

    భారతదేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు" అని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

    "ఇది నరేంద్ర మోదీ, అమిత్ షా నడుపుతున్న నియంతృత్వం. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు వారితో కలిసి పనిచేస్తున్నవాళ్లు దేశానికి ద్రోహం చేస్తున్నారు" అని ప్రియాంకగాంధీ తన పోస్ట్‌లో రాశారు.

  5. ఎవరెక్కువ నిరసనలు చేస్తారనే విషయంలో తీవ్రపోటీ ఉంది- రవిశంకర్ ప్రసాద్

    బీజేపీ, నిరసన, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్

    దిల్లీ నిరసనలపై ప్రతిపక్షనేతలను, కాక్రోచ్ జనతా పార్టీని (సీజేపీ) లక్ష్యంగా చేసుకుని బీబీసీ విమర్శలు చేసింది.

    "మేం నిరసనలకు వ్యతిరేకం కాదు. కానీ తమ ఓటమి కారణంగా వారు వీధుల్లో జరిగే నిరసనలను ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఇందులో కూడా ఎవరు ఎక్కువ నిరసనలు చేస్తారనే పోటీ ఆసక్తికరంగా సాగుతోంది’’ అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో అన్నారు.

    ‘‘ మొదట మూడురోజుల పాటు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీపై 'షాడో బాక్సింగ్' చేసే సీజేపీ వచ్చింది. "ఉదయం నుంచి వారి (సీజేపీ) నాటకం కొనసాగుతోంది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్, ఇతరులు కూడా వచ్చారు. అప్పుడు మనం ఎందుకు వెనుకబడి ఉండాలి అని భావించి మమతాబెనర్జీ కూడా వచ్చారు. ఆ తర్వాత సీపీఐ, సీపీఎం కూడా వచ్చాయి" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

  6. నేహా బోరా విడుదల

    దిల్లీ, నిరసన, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, నేహా బోరా విడుదలయ్యారు.

    ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు సాయంత్రం తర్వాత విడిచిపెట్టారు.

    ‘‘పోలీసులు నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫోన్ తిరిగి నా చేతికొచ్చింది. మైదాన్ గడీ పోలీస్ స్టేషన్ నుంచి మహిళలను విడుదల చేశారు’’ అని నేహా బోరా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    అంతకుముందు అదుపులోకి తీసుకున్నతర్వాత నేహా బోరాతో పాటు పలువురు నిరసనకారులను పోలీసులు ప్రత్యేక బస్సులో తరలించారు.

    పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత నేహా బోరా ‘ఎక్స్’లో స్పందించారు.

    ‘‘నేను డిటెన్షన్‌లో ఉన్నా. ఉద్యమం కొనసాగించాలి. ప్రజలిప్పుడు సఫ్దర్ జంగ్ ఫ్లై ఓవర్ దగ్గర ఉన్నారు. అక్కడకి వెళ్లండి. మిమ్మల్ని ఆపితే ఎక్కడ ఆపారే అక్కడే కూర్చుని నిరసన కొనసాగించండి’’ అని నేహా బోరా పోస్ట్ చేశారు.

  7. ‘మాపై దాడి చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు’ : సీజేపీ నిరసనకారులు

    సీజేపీ, దిల్లీ, జంతర్ మంతర్
    ఫొటో క్యాప్షన్, సీజేపీ వ్యతిరేకులు తమపై దాడిచేస్తున్నారని సీజేపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

    దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులకు, సీజేపీ వ్యతిరేక నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగినట్టు వార్తలొచ్చాయి.

    సీజేపీ, సీజేపీ వ్యతిరేక కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని బీబీసీ ప్రతినిధి విష్ణుకాంత్ తివారీ తెలిపారు.

    సీజేపీ మద్దతుదారులను సీజేపీ వ్యతిరేక నిరసనకారులు తోసుకుంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూషించారని చెప్పారు.

    ఈ సమయంలో సీజేపీ వ్యతిరేక నిరసనకారులను ఆపడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీని గురించి పోలీసులను ప్రశ్నించేందుకు బీబీసీ ప్రయత్నించగా అక్కడున్నవారు స్పందించలేదు.

    "వాళ్లు మమ్మల్ని దూషిస్తున్నారు. హింసను ప్రేరేపించేలా నినాదాలు చేస్తున్నారు. మమ్మల్ని కొడుతున్నారు. అయినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు? పోలీసులు మమ్మల్ని మాత్రం అడ్డుకుంటున్నారు. ముందుకు వెళ్లనివ్వడం లేదు, కానీ వాళ్లకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంది" అని సీజేపీ నిరసనకారుల్లో ఒకరు బీబీసీతో చెప్పారు.

  8. నిరసన కొనసాగించండి, వెనక్కి తగ్గకండి : రాహుల్ గాంధీ

    కాంగ్రెస్, నిరసన
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

    నిరసన కొనసాగించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

    "నేను నరేంద్ర మోదీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా దశాబ్ద కాలంపై నుంచి పోరాడుతున్నా. నేను నా ప్రత్యర్థులను అర్థం చేసుకున్నంత బాగా మరెవరూ అర్ధం చేసుకోలేరు. వాళ్ల గురించి నాకు పూర్తిగా తెలుసు, వారి ప్రతి వ్యూహం గురించి కూడా నాకు అవగాహన ఉంది. ఈ వ్యక్తుల ప్రధాన లక్షణం పిరికితనం" అని ఆయన వీడియోలో అన్నారు.

    ‘‘ఈ కథలోని ప్రతినాయకులైన నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్, అజిత్ దోభల్ ఇప్పుడు నెమ్మదిగా ఇరుక్కుపోతున్నారు. వారి చుట్టూ ఉన్న వలయం కుంచించుకుపోతోంది’’ అన్నారు.

    పెద్దసంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు.

    "మీకు నచ్చింది మీరు చేయండి. మీకు కావల్సినంతమంది పోలీసులను పిలవండి – 10వేలు, 20వేలు, 50వేలమందిని...ఎంతమందినైనా పిలవండి. నాయకులందరినీ అరెస్టు చేయండి. యువత అందరినీ అరెస్టు చేయండి. మమ్మల్నందరినీ అరెస్టు చేయండి. భయపడకండి – మేము మిమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాం, మేము వెనక్కి తగ్గం"

    ‘‘నా మాటలు గుర్తుంచుకోండి. మాకు కావాల్సిన సమాచారం ఇప్పటికే మా దగ్గర ఉంది. మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత ప్రజల గొంతుకను కాపాడుకుంటాం. గత 10-15 సంవత్సరాలలో భారతదేశానికి జరిగినది, ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళీ జరగకుండా చూసుకుంటాం.

    "భారత యువతా... మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. మీ నిరసనను కొనసాగించండి. మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని, మన రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నవారు ఓడిపోయేలా చూస్తాం’’ అని రాహుల్ గాంధీ ఆ వీడియోలో తెలిపారు.

  9. ‘వారందరినీ రేపటిలోగా విడుదల చేయండి’

    నిరసన, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, సోనమ్ వాంగ్‌చుక్

    భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలా అప్రకటిత అత్యవసర పరిస్థితిలోకి వెళుతుందని తాను ఊహించలేదన్నారు.

    ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఇంతమంది నాయకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని, అరెస్టయిన వారిని త్వరలోనే విడుదల చేస్తారని ఆశిస్తున్నానని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

    రేపటిలోగా వారిని విడుదల చేయకపోతే తాను నిరాహారదీక్షలేదా పాదయాత్ర చేయడం గురించి ఆలోచించాల్సివస్తుందని సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు.

  10. ‘ఇది ఎమర్జెన్సీ కంటే దారుణం’ : పోలీసుల అదుపులో మమత, కేజ్రీవాల్

    దీదీ, మమత
    ఫొటో క్యాప్షన్, మమతా బెనర్జీని వ్యాన్‌లో తరలిస్తుండగా, బలవంతంగా కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం

    పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

    "మమతా దీదీ సహా మమ్మల్ని ఐదుగురిని, దీదీ నివాసం బయట దిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారు. మమ్మల్ని ఏదో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు. భారత్‌లో ఇది ప్రజాస్వామ్య మరణమే" అని సాకేత్ గోఖలే పోస్ట్ చేశారు.

    ‘మమతా బెనర్జీతో పాటు టీఎంసీలోని ఇతర నాయకులు సౌత్ అవెన్యూలోని బస్ స్టాండ్ వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    "మేం జంతర్ మంతర్‌కు వెళ్లాలనుకున్నాం. కానీ మమ్మల్ని వెళ్లనివ్వలేదు. ఈ పరిస్థితి ఎమర్జెన్సీ కంటే కూడా దారుణంగా ఉన్నట్లు అనిపిస్తోంది" అని అదుపులోకి తీసుకోడానికి ముందు మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు.

    మరోపక్క తన పార్టీ నాయకులతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

    "దేశ యువత మేల్కొంది. మోదీ నియంతృత్వానికి మేం భయపడబోం. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే. ఓట్ల చోరీ ఆరోపణలను ప్రజలు ఇకపై సహించరు" అని పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత విడుదల చేసిన వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    వీడియోలో పోలీసులు ఆయన్ను తీసుకెళ్లడం కనిపిస్తోంది.

    "సిగ్గులేని దిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌పై దాడి చేశారు" అని సౌరభ్ భరద్వాజ్ ‘ఎక్స్‌’‌లో రాశారు.

    ఈ వీడియోలో కేజ్రీవాల్‌తో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా కనిపిస్తున్నారు.

  11. విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వామపక్ష నేతల అరెస్ట్

    నిరసన
    ఫొటో క్యాప్షన్, షర్మిల

    సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీలు, వామపక్షాల ఆందోళనను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు.

    ఆందోళనలో భాగంగా చలో రాజ్ భవన్ కి ఆయా పార్టీలు పిలుపునిచ్చాయి.

    విజయవాడ లెనిన్ సెంటర్ నుంచి లోక్ భవన్ వరకు చలో రాజ్ భవన్ పేరిట నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించారు.

    దసరా ఉత్సవాల కారణంగా ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు అంతకుముందే ప్రకటించారు.

    శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు వామపక్షాల నేతలను గృహనిర్బంధం చేశారు.

    పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అరెస్ట్ చేశారు.

    పోలీసుల ఆంక్షలు దాటి లెనిన్ సెంటర్ వరకు వచ్చిన సీపీఎం నేతలను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    లెనిన్ సెంటర్లో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సావిత్రి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ మాల్యాద్రి తదితర నాయకులను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఆందోళన సాగిస్తున్నారు

    నిరసన
    ఫొటో క్యాప్షన్, వామపక్షాలు, కాంగ్రెస్
    వామపక్షాలు, కాంగ్రెస్
    ఫొటో క్యాప్షన్, నిరసన
  12. గుడ్ ఆఫ్టర్‌నూన్..

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని. ఇప్పటినుంచి రాత్రి 10గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

  13. నేహా బోరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    నేహాబోరా, నిరసన
    ఫొటో క్యాప్షన్, నేహాబోరాతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అదుపులోకి తీసుకున్నతర్వాత ఆమెతో పాటు పలువురు నిరసనకారులను ప్రత్యేక బస్సులో తరలించారు.

    పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత నేహా బోరా ‘ఎక్స్’లో స్పందించారు.

    ‘‘నేను డిటెన్షన్‌లో ఉన్నా. ఉద్యమం కొనసాగించాలి. ప్రజలిప్పుడు సఫ్దర్ జంగ్ ఫ్లై ఓవర్ దగ్గర ఉన్నారు. అక్కడకి వెళ్లండి. మిమ్మల్ని ఆపితే ఎక్కడ ఆపారే అక్కడే కూర్చుని నిరసన కొనసాగించండి’’ అని నేహా బోరా పోస్ట్ చేశారు.

    అంతకుముందు దిల్లీ హట్ దగ్గర కలుసుకుందామని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    "ఇప్పుడు దిల్లీహట్ జంతర్ మంతర్ అయ్యింది! అక్కడ కలుద్దాం!’’ అని ఆమె ఆ పోస్ట్‌లో రాశారు.

    ఈ పోస్ట్ తర్వాత నేహా బోరా దిల్లీహట్‌లో నిరసన తెలుపుతూ కనిపించారు.

    నేహాబోరాతోపాటు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, దీపాంకర్ భట్టాచార్యలను సఫ్దర్ జంగ్ ఫ్లై ఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారని బీబీసీ కరస్పాండెంట్ దిల్ నవాజ్ పాషా చెప్పారు.

    ఆమె వెంట సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక-రాజకీయ కార్యకర్త యోగేంద్ర ఉన్నారు.

  14. దిల్లీలో సీజేపీ నిరసనల నడుమ చెన్నైకి రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, చెన్నై
    ఫొటో క్యాప్షన్, శనివారం చెన్నైలో ‘విద్యార్థుల గొంతుక’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

    చెన్నైలో ‘ఛాత్రోంకి గూంజ్( విద్యార్థుల గొంతుక) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువతతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. ఈ క్యాంపెయిన్‌లో ఇది ఆరో కార్యక్రమం.

    మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజే దిల్లీలో నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనాలని సీజేపీ అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపింది. నిరసనలో లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, సీపీఐ-ఎంఎల్, ఆర్‌ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనే అవకాశం ఉంది.

    ఇక, ‘ఛాత్రోంకి గూంజ్’ క్యాంపెయిన్‌లో భాగంగా చెన్నైలో రాహుల్ గాంధీ నిర్వహించే ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదటిది.

    దీనికి ముందు కోటా, దెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్, పుణె, ఇందౌర్‌లో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

  15. దిల్లీ: అభిజిత్, సౌరవ్ దాస్, అశుతోష్‌లను విమానంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

    అభిజిత్ దీప్కే
    ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే

    కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ అశుతోష్ రాంకా అలాగే సౌరవ్ దాస్‌లను పోలీసులు దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    ఈ సమయంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, తాను అరెస్టుకు భయపడనని, సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

    “దేశం ఏ దిశలో వెళ్తుందో చూడండి. విమానంలోనే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలాంటిది ఇందిరా గాంధీ కూడా ఎప్పుడూ చేయలేదు. ఇది నిరంకుశత్వం, కానీ మేం వీటికి భయపడం” అన్నారు.

    తమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులతో అభిజిత్ దీప్కే, “నేను మీకు భయపడను, మేం అరెస్టుకు సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.

    అభిజిత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులు, దిల్లీ విమానాశ్రయం
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సీజేపీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు.

    అభిజిత్, సౌరవ్ అలాగే అశుతోష్‌లను అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులు ముందుకు వచ్చారు. దీనిపై దీప్కే, ఆయన సహచరులు పురుష పోలీసులను పంపాలని కోరారు.

    కాగా, దిల్లీ పోలీసుల తీరు 'నిరంకుశమైనది'గా అభివర్ణించిన సీజేపీ, ముగ్గురు ప్రతినిధులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇది ప్రజల స్వేచ్ఛా సంచార హక్కును ఉల్లంఘించడమేనని సీజేపీ పేర్కొంది.

    దీనికి ముందు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

  16. జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    ఫొటో క్యాప్షన్, కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.

    సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

    జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
    దిల్లీ, జంతర్ మంతర్ , సీజేపీ నిరసన
  17. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    యూట్యూబర్ ధ్రువ్ రాఠీ
    ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ

    సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

    బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.

    అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.

    “నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.

    “మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.

    ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఈరోజు మధ్యాహ్నం ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన ప్రదర్శన ఉండటంతో, సామాజిక కార్యకర్తలు తుషార్ గాంధీ, ఫిరోజ్ మిథిబోర్వాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు 'హం భారత్ కే లోగ్' సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

  18. దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

    జంతర్ మంతర్, దిల్లీ పోలీసులు, సీజేపీ ర్యాలీ
    ఫొటో క్యాప్షన్, అనేక చిత్రాలలో బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు అలాగే పోలీసు వ్యాన్‌లు కూడా కనిపిస్తున్నాయి

    కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.

    పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

    సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.

    "ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.

    ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
    దిల్లీ, జంతర్ మంతర్
  19. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

    రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో)

    కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.

    పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.

    అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.

    రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.

    "ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.

    దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.

    అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

    మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.