You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భూకంపం: పాకిస్తాన్‌లో 12 మంది మృతి, 175 మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 12 మంది మరణించారు, మరో 175 మంది గాయపడ్డారు.
ఇప్పటివరకైతే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మాత్రమే భూకంపం కారణంగా నష్టం జరిగినట్లు మీడిమా కథనాలను బట్టి తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం అఫ్గానిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంగా చెబుతున్నారు.
దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకటన ప్రకారం అత్యధిక మరణాలు అక్కడి స్వాత్ జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ 90 మంది గాయపడ్డారు.
భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడటంతో స్వాత్ కలాం రహదారిని కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
లోయర్ దిర్‌లో నలుగురు వ్యక్తులు మరణించారు, 27 మంది గాయపడ్డారు. మలాకాండ్‌లో ఒకరు మరణించారు.
స్వాత్ జిల్లా పోలీసు అధికారి షఫివుల్లా మాట్లాడుతూ సిబ్బంది అందరినీ అప్రమత్తం చేశామని, గాయపడిన వారందరికీ వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలలో పైకప్పులు కూలిపోవడం, భవనాలు దెబ్బతిన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో దిల్లీలో ఇంత తీవ్రంగా భూమి కంపించడం ఇదే తొలిసారి.
బీబీసీ దిల్లీ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది కూడా ప్రకంపనల ప్రభావాన్ని చూశారు. కుర్చీలు ఊగడంతోపాటు డెస్కులు కదిలాయి.
గతంలో భూకంపాలు వచ్చినప్పుడు చాలా చిన్నగా కొన్ని సెకన్ల పాటు కుర్చీలు, డెస్కులు ఊగేవి. కానీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువగానే కుర్చీలు ఊగాయి.
వరుసగా రెండు మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి.
అఫ్గానిస్తాన్‌లోని ఫయజాబాద్‌కు 133 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది.
దిల్లీ, నోయిడాలలో భూమి కంపించడంతో చాలా మంది ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో వస్తువులు ఊగుతున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లలోనూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
తూర్పు దిల్లీలోని షకర్‌పుర్ ప్రాంతంలో ఒక భవనం పక్కను వాలినట్లు తమకు సమాచారం వచ్చిందని, దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. అయితే తమ పరిశీలనలో అక్కడ ఎటువంటి భవనం ఒరగలేదని తెలిసిందని అగ్నిమాపకశాఖ తెలిపింది.
శ్రీనగర్‌కు భూకంప కేంద్రం సుమారు 384 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)