You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తుర్కియే భూకంపం: మరణాలు పెరగడానికి ప్రభుత్వమే కారణమా... అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడమే తీవ్రతను పెంచిందా
- రచయిత, జేక్ హార్టన్, విలియమ్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ రియాల్టీ & బీబీసీ మానిటరింగ్
తుర్కియేలో ఇటీవల సంభవించిన భూకంపాలలో అనేక భవనాలు కూలిపోవడానికి నిబంధనలను సరిగా అమలు చేయకపోవడమే కారణమని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుర్కియే, సిరియా సరిహద్దులో వచ్చిన భూకంపంలో కొత్తగా నిర్మించిన కట్టడాలు కూడా కూలిపోయాయి. ఆ విషయం బీబీసీ పరిశీలనలో తేలింది.
మాలత్యాలోని ఒక భవనాన్ని పోయిన ఏడాది కట్టారు. ఆ భవనం ఫొటోలతో పాటు "కొత్తగా వచ్చిన భూకంప నిబంధనలకు అనుగుణంగా ఈ భవనాన్ని కట్టాం" అని రాసిన చిత్రాలు కూడా నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
'అత్యంత నాణ్యమైన' మెటీరియల్‌ను నిర్మాణంలో వాడామని, 'అత్యంత నైపుణ్యం' కలిగిన వారు పని చేశారని కూడా అందులో రాశారు.
కానీ ఇప్పుడు ఈ ప్రకటన జాడ లేదు. అయితే చాలా మంది వ్యక్తులు నాటి ఫొటోలు, వీడియోలను తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.
ఓడరేవు నగరమైన ఇస్కెండెరున్‌లో ఇటీవల నిర్మించిన మరో అపార్ట్‌మెంట్ చాలా వరకు ధ్వంసమైంది. ఈ భవనం నిర్మాణం 2019లో పూర్తయినట్లు చూపుతున్న చిత్రం బయటికొచ్చింది.
ధ్వంసమైన భవనం చిత్రం (కుడివైపు), కంపెనీ పబ్లిసిటీ కోసం వాడిన భవనం ఫొటో (ఎడమ) ఒకే విధంగా ఉన్నాయి.
2019లో అంటాక్యాలో ప్రారంభమైన మరొక భవనం (బీబీసీ ధ్రువీకరించిన చిత్రం) భారీగా ధ్వంసమైంది.
2019 నవంబర్ నుంచి హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను మేం కనుగొన్నాం.
‘అన్ని భవనాలు కూలవు’
శక్తివంతమైన భూకంపాలు వచ్చినప్పటికీ సరిగ్గా నిర్మించిన భవనాలు నిలబడతాయని నిపుణులు చెబుతున్నారు.
"ఈ భూకంపం శక్తివంతమైనదే. కానీ ప్రమాణాల ప్రకారం బాగా నిర్మించిన భవనాలను నేలకూల్చే అంత పెద్దది కాదు" అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో ఎమర్జెన్సీ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డేవిడ్ అలెగ్జాండర్ అంటున్నారు.
"భూమి కంపించే తీవ్రత అన్ని చోట్లా ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. అందువల్ల కూలిన పోయిన వేలాది భవనాల్లో చాలా వరకు ప్రమాణాలకు తగినట్లుగా నిర్మించినవి కావని మేం చెప్పగలం' అని ఆయన అన్నారు.
ఎవరి వైఫల్యం?
గతంలో సంభవించిన విపత్తుల కారణంగా 2018లో నిర్మాణ నిబంధనలు కఠినతరం చేశారు.
దేశంలోని వాయువ్య ప్రాంతంలోని ఇజ్మిత్ నగరం చుట్టూ 1999లో సంభవించిన భూకంపం కారణంగా 17,000 మంది మరణించారు. ఆ తరువాత కఠినమైన భద్రతా ప్రమాణాలు తీసుకువచ్చారు.
ప్రస్తుత నియమాల ప్రకారం భూకంపం సంభవించే ప్రాంతాల్లోని నిర్మాణాల్లో బలమైన ఉక్కు కడ్డీలు, అధిక నాణ్యత గల కాంక్రీటు వాడాలి. భూకంపాల ప్రభావాన్ని సమర్థవంతంగా తట్టుకునేందుకు స్తంభాలు, దూలాలు కూడా ఉండాలి.
కానీ ఈ నిబంధనలను అమలు చేయడంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు.
"సమస్య ఏంటంటే ఇప్పటికే ఉన్న భవనాలకు కొద్దిగా మాత్రమే అవసరమైన మార్పులు చేశారు. కొత్త భవనాలను కట్టడంలో నిబంధనలు పెద్దగా అమలు చేయలేదు' అని ప్రొఫెసర్ అలెగ్జాండర్ చెప్పారు.
ఎందుకు పట్టించుకోలేదు?
నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాల ప్రకారం భవనాల నిర్మాణం లేకపోయినా ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించడం మొదలు పెట్టింది.
కొంత రుసుము కట్టించుకొని నిర్మాణాలకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేశారు. 1960ల నుంచి 2018 వరకు ఇది నడిచింది.
అలా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడం వల్ల భారీ భూకంపం సంభవించినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.
దక్షిణ తుర్కియేలోని భూకంప జోన్‌లోగల 75,000 భవనాలను ఇలా క్రమబద్ధీకరించారు. తుర్కియేలోని యూనియన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ తుర్కిష్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ ఛాంబర్ ఆఫ్ సిటీ ప్లానర్స్ ఇస్తాంబుల్ హెడ్ పెలిన్ పనార్ గిరిత్లియోగ్లు ఈ విషయం వెల్లడించారు.
అంతేకాదు ఇటీవలి విపత్తుకు కొద్ది రోజుల ముందు కూడా మరొకసారి అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదించిన కొత్త బిల్లు పార్లమెంట్ ఆమోదం కోసం వెళ్లినట్లు తుర్కిష్ మీడియా రిపోర్ట్ చేసింది.
జియాలజిస్ట్ సెలాల్ సెంగోర్ ఈ ఏడాది ప్రారంభంలోనే దీని మీద స్పందించారు. ఇలా అక్రమకట్టడాలను క్రమబద్ధీకరించడం నేరం అవుతుందన్నారు.
2020లో పశ్చిమ ప్రావిన్స్ ఇజ్మీర్‌లో ఘోరమైన భూకంపం సంభవించిన తరువాత ఇజ్మీర్‌లోని 6,72,000 భవనాలు ఇటీవలి క్షమాభిక్ష ప్రయోజనం పొందాయని బీబీసీ తుర్కిష్ నివేదిక వెల్లడించింది.
ఇదే నివేదిక 2018లో పర్యావరణ, పట్టణీకరణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ టర్కీలోని 50 శాతం భవనాలు (దాదాపు కోటికి పైగా భవనాలు) నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమయ్యాయని తెలిపింది.
ఇటీవలి భూకంపాల తర్వాత టర్కీలో నిర్మాణ ప్రమాణాలపై మేం పర్యావరణ, పట్టణీకరణ మంత్రిత్వ శాఖను సంప్రదించాం.
"మా అడ్మినిస్ట్రేషన్ నిర్మించిన ఏ భవనం కూలిపోలేదు. ప్రమాద ప్రాంతాల్లో నష్టం అంచనా అధ్యయనాలు వేగంగా కొనసాగుతున్నాయి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.