సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు పరాభవం.. టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఔట్.. సెమీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది.

శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

గ్రూప్‌1లో న్యూజీలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడి, మూడు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఇలా మూడు జట్లూ 7 పాయింట్లు చొప్పున సాధించాయి. అయితే, నెట్ రన్‌రేట్ విషయంలో న్యూజీలాండ్ 2.113తో ముందుండగా, ఇంగ్లండ్ 0.473తో రెండో స్థానం సాధించింది. ఆస్ట్రేలియా మైనస్ 0.173తో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దీంతో తొలి రెండు స్థానాలు సాధించిన న్యూజీలాండ్, ఇంగ్లండ్ సెమీ ఫైనల్స్ చేరుకున్నాయి.

గ్రూప్1లో చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

ఓపెనర్ నిసంక 67 పరుగులు, రాజపక్స 22 పరుగులు, మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ 18 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ 3 వికెట్లు తీశాడు.

142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. బట్లర్ 28 పరుగులు, హేల్స్ 47 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తమ జట్టు సెమీ ఫైనల్స్ చేరుకునేందుకు సాయపడ్డాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 144 పరుగులు చేసింది.

సెమీ ఫైనల్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఒత్తిడిని అధిగమించి, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించింది.

సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా?

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్1లో అన్ని మ్యాచ్‌లు ముగిశాయి. న్యూజీలాండ్ మొదటి స్థానంలో, ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచాయి.

గ్రూప్2లో ఆదివారం మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

నెదర్లాండ్-దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్-పాకిస్తాన్, భారత్-జింబాబ్వే జట్ల మధ్య ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.

అయితే, గ్రూప్2లో ప్రస్తుతం భారత్ 6 పాయింట్లతో, దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఈ రెండు జట్లూ ఐసీసీ రేటింగ్స్‌లో తమకంటే చాలా దూరంలో ఉన్న జట్లతో ఆదివారం తలపడుతున్న నేపథ్యంలో.. ఈ రెండూ గెలిస్తే.. భారత్ 8 పాయింట్లతో, దక్షిణాఫ్రికా 7 పాయింట్లతో మొదటి, రెండో స్థానాల్లో కొనసాగుతాయి.

అప్పుడు టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 9వ తేదీ బుధవారం న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా జట్లు మొదటి సెమీ ఫైనల్‌లో తలపడతాయి.

నవంబర్ 10వ తేదీ గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, ఇండియా జట్లు తలపడతాయి.

‘సెమీ ఫైనల్‌లో మేం కనుక ఇండియాతో తలపడితే అదొక అద్భుతమైన సందర్భం అవుతుంది’ అని శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బీబీసీతో అన్నాడు.

శ్రీలంక కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశం ఇంగ్లండ్‌కు ఉంది’’ అని అన్నాడు.

ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఔట్

శ్రీలంకపై విజయం సాధించి ఇంగ్లండ్ జట్టు రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకోవడం, మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉండటంతో ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంటు నుంచి వైదొలిగింది.

ఈ మెగా టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా జట్టు గత టోర్నమెంటులో కప్పును గెలుచుకుని, ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా వ్యవహరిస్తోంది.

ఇంగ్లండ్ జట్టు గతంలో ఒకసారి టీ20 ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి కప్పు గెలిచేందుకు మరొక అడుగు ముందుకు వేసింది.

కాగా, సెమీ ఫైనల్స్ చేరాలంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆశలపై అఫ్గానిస్తాన్ జట్టు నీళ్లు చల్లింది.

ముఖ్యంగా అఫ్గాన్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 23 బంతుల్లోనే 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం, చివరి ఓవర్‌లో అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేయడంతో కేవలం 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)