COP 27: గ్రీన్ వాష్ అంటే ఏమిటి? ఎలా గుర్తించాలి

COP 27 పేరిట ఈజిప్ట్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుకు తాను హాజరు కావడం లేదని క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్ తెలిపారు.

అధికారంలో ఉన్న వ్యక్తుల మోసపూరిత ప్రచారానికి, అబద్ధాలు చెప్పడానికి మాత్రమే ఇది వేదిక కానుందనే కారణంతో తాను హాజరుకాబోవడం లేదని గ్రెటా వెల్లడించారు.

తన కొత్త పుస్తకం ఆవిష్కరించిన సందర్భంగా ఆమె లండన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

గత వాతావరణ సమావేశాలలోనూ ఇలాంటి గ్రీన్ వాషింగే జరిగిందని ఆమె అన్నారు.

ఇంతకీ గ్రెటా చెబుతున్న గ్రీన్ వాషింగ్ ఏంటి? గుర్తించడం ఎలా?

ప్రభుత్వాలు, కంపెనీల చర్యల వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయంలో వాస్తవాలను దాచి సానుకూల అభిప్రాయాలు కలిగించడం, తప్పుదారి పట్టించడాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు.

వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు పర్యావరణానికి ఎంత అనుకూలమనే విషయంలో శ్రద్ధ పెడుతున్నందున కంపెనీలు కూడా వారిని ఆకట్టుకునేందుకు, నమ్మించేందుకు తమ వస్తువులు పర్యావరణ హితమైనవని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి.

కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో పర్యావరణ అనుకూలతకు సంబంధించి తప్పుడు క్లెయిమ్‌లు చేశాయన్న ఆరోపణలూ ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో సంస్థలు తమ గ్రీన్ క్రెడెన్షియల్స్‌ను మార్చేయడం అంత సులభమేమీ కాదని, నియంత్రణలు అనేకం ఉన్నాయని కోపెన్‌హాన్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ రాస్ 'బీబీసీ'తో చెప్పారు.

''గ్రీన్‌వాష్ స్వభావం మారిపోయింది. 1990లలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పేవారు. ఇప్పుడు అలా కాకుండా గ్రే ఏరియాలను గుర్తించి తప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నారు'' అన్నారు ఆండ్రియాస్.

గ్రీన్‌వాషింగ్ అనే పదాన్ని 1986లో పర్యావరణవేత్త జే వెస్టర్‌వెల్డ్ తొలిసారి ఉపయోగించారు. పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా హోటళ్లు తమ కస్టమర్లను వాడిన తువ్వాళ్లను మళ్లీ వాడాలని కోరడాన్ని ఒక వ్యాసంలో ప్రస్తావిస్తూ ఆయన ఈ పద ప్రయోగం చేశారు.

హోటల్ యజమానులు తమ లాండ్రీ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పర్యావరణాన్ని కారణంగా చూపించి ఇలాంటి సూచన చేశారని వెస్టర్‌వెల్డ్ తన వ్యాసంలో రాశారు.

పర్యావరణంపై శ్రద్ధ ఉన్న వ్యక్తులను ఆకట్టుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తారనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

ఉద్గారాలను తగ్గిస్తున్నామంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా క్లెయిమ్ చేసుకోవడం.. ప్రొడక్ట్‌లోని ఒకటో రెండో అంశాలు పర్యావరణ అనుకూలమైనవి అయినంత మాత్రాన ఆ సాకుతో మొత్తం ప్రొడక్ట్‌ను సహజమైనదిగా, పర్యావరణ అనుకూలనమైనదిగా చెప్పుకోవడం వంటివన్నీ గ్రీన్ వాషింగ్‌కు ఇతర ఉదాహరణలు.

ఇలాంటి క్లెయిమ్‌లు అంతటా ఉన్నాయి. ఇవి నిజమా కాదా అని ధ్రువీకరించుకోవడం అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ 2021లో 500 కంపెనీల వెబ్‌సైట్లను సమీక్షించినప్పుడు అందులో 40 శాతం వెబ్‌సైట్లు పర్యావరణ అనుకూలత విషయంలో తప్పుదారి పట్టించే సమాచారం అందుబాటులో ఉంచినట్లు తేలింది.

అయితే, కంపెనీలు చేసే పర్యావరణ అనుకూల క్లెయిమ్‌లను చెక్ చేయడానికి కొన్ని మార్గాలున్నాయి. కార్బన్ ట్రస్ట్, ఫెయిర్‌ట్రేడ్ ఫౌండేషన్, బీకార్ప్ వంటి అధికారిక ధ్రువీకరణలు ఉన్నాయో లేదో ప్రాథమికంగా చెక్ చేసుకోవడం ఒక మార్గం.

తయారీసంస్థలు చెప్పే విషయం నిజామా కాదో తెలుసుకోవడానికి వినియోగదారులు నమ్మకమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని ఓ కంజ్యూమర్ గ్రూప్‌లో కంజ్యూమర్ ప్రొటెక్షన్ పాలసీ హెడ్‌గా పనిచేస్తున్న స్యూ డేవీస్ చెప్పారు.

'ప్రొడక్ట్‌ను కాకుండా మొత్తం సంస్థను చూడాలి. ఉదాహరణకు ఏదైనా ఫ్యాషన్ బ్రాండ్ ఒకరకం దుస్తులను పర్యావరణ అనుకూలంగా తయారుచేసి మిగతావాటి విషయంలో పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తే దాన్నెలా చూడాలి?' అని ప్రశ్నించారు డేవిస్.

ఏదైనా కంపెనీ చేసే క్లెయిమ్‌లలో పారదర్శకత లేకపోవడాన్ని ఆ కంపెనీ పర్యావరణ అనుకూలత విషయంలో సానుకూలంగా లేదని చెప్పడానికి సూచనగా చూడాలని డేవిస్ అన్నారు.

ఏదైనా ఉత్పత్తి, బ్రాండ్, సేవలకు సంబంధించిన పర్యావరణ సమాచారం పొందలేకపోతున్నామంటేనే అందులో ఏదో మర్మం ఉందని గ్రహించాలి అన్నారు డేవిస్.

కంపెనీలు ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టాలనుకున్నప్పుడు, పర్యావరణ అనుకూలత గురించి వారి దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు అవి వినియోగదారులకు సమాచారాన్ని అంత సులభంగా దొరకనివ్వవు అని డేవిస్ అన్నారు.

సాంకేతికత సహాయంతో..

అయితే, సమాచార సేకరణలో సాంకేతికత కొంతవరకు తోడ్పడుతుంది. బ్రాండ్ ట్రాన్స్‌పరెన్సీ యాప్‌ల సహాయంతో కొంతవరకు ఇలాంటి సమాచారం తెలుసుకోవచ్చు.

'ముఖ్యంగా ప్రజలు తాము వినియోగిస్తున్న వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని యాప్‌లు అందిస్తున్నాయి. ఇది గ్రీన్ వాషింగ్‌కు పాల్పడుతున్న సంస్థలకు చేదువార్తే' అన్నారు ప్రొఫెసర్ ఆండ్రియాస్.

'సమాజంలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మన కొలమానాలకు అందని పెద్దపెద్ద వాగ్దానాలను కార్పొరేషన్లు చేస్తుంటాయి' అన్నారు ఆండ్రియాస్.

'గ్రెటా ఏం చెప్పారో నాకు అర్థమైంది. తప్పనిసరిగా చేయనక్కర్లనే విషయాలలో ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిజ్ఞలు చేస్తున్నాయనేది ఆమె ప్రస్తవించారు'' అన్నారు ఆండ్రియాస్.

గ్రీన్ వాషింగ్ అనేది ఇప్పుడు కేవలం వ్యాపార ప్రపంచంలోనే కాదు అంతా ఉంది అన్నారు ప్రొఫెసర్ ఆండ్రియాస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)