క్వీన్ ఎలిజబెత్-2: బాల్యం నుంచి చివరి రోజుల వరకు... స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌తో రాణి అనుబంధం

స్కాట్లాండ్‌లోని రాయల్ డెసిడీలో గల బల్మోరల్ క్యాజిల్ అంటే రాణికి ఎంతో ఇష్టం.

50వేల ఎకరాల్లో విస్తరించిన ఆ ఎస్టేట్‌లో తన భర్త, పిల్లలతో కలిసి వేసవిలో విహరించడానికి రాణి తరచూ వచ్చేవారు.

బల్మోరల్ క్యాజిల్‌లో రాణి తన సెలవులను సంతోషకరంగా గడిపేవారు. బాల్యం నుంచి మరణం వరకు ఆ కోటతో రాణికి విడతీయలేని అనుబంధం ఏర్పడింది. రాణి తన బాల్యంలో తాత కింగ్ జార్జ్-V, నాయనమ్మ క్వీన్ మేరీలతో గడిపేందుకు బల్మోరల్ క్యాజిల్‌కు వెళ్లేవారు. తన చివరి రోజుల్లోనూ ఆమె అక్కడే ఉన్నారు.

బల్మోరల్ క్యాజిల్‌లో ఎన్నో రాచ విందులకు రాణి ఆతిథ్యం ఇచ్చారు. అక్కడికి దగ్గర్లోనే జరిగే బ్రీమర్ హైలాండ్ గేమ్స్‌ను రాచ కుటుంబంతో కలిసి తిలకించేవారు.

ప్రిన్స్ ఫిలిప్ చివరి రోజుల్లో ఎక్కువ సమయం రాణి బల్మోరల్ క్యాజిల్‌లోనే గడిపారు. కరోనా లాక్‌డౌన్‌లో ఇద్దరు అక్కడే ఉండిపోయారు. 2020 నవంబరులో 73వ వివాహ వార్షికోత్సవాన్ని అక్కడే జరుపుకున్నారు.

క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్, 1852లో బల్మోరల్ ఎస్టేట్‌ను ఫాకర్సన్ ఫ్యామిలీ నుంచి కొన్నారు. నాటి నుంచి బ్రిటిష్ రాచకుటుంబం నివాసాల్లో ఒకటిగా బల్మోరల్ ఉంటూ వస్తోంది. ఆ ఎస్టేట్‌ను కొనుగోలు చేసినప్పుడు అప్పటికే అక్కడ ఒక క్యాజిల్ ఉంది. కానీ అది చిన్నదిగా ఉండటంతో కొత్త క్యాజిల్‌ను నిర్మించారు.

స్కాట్లాండ్ సంపన్న భూస్వాములు కట్టుకునే 'స్కాటిష్ బరోనియల్' నిర్మాణ శైలిలో కొత్త క్యాజిల్‌ను కట్టారు. 1856లో కొత్త క్యాజిల్ నిర్మాణం పూర్తి కాగా ఆ తరువాత కొంత కాలానికి పాత క్యాజిల్‌ను కూల్చి వేశారు.

బల్మోరల్ ఎస్టేట్ అనేది రాణి వ్యక్తిగత ఆస్తి. క్రౌన్ ఎస్టేట్ పరిధిలోకి అది రాదు. అక్కడ అనేక రకాల పనులు జరుగుతుంటాయి. బాతుల వేట, వ్యవసాయం, అడవుల పెంపకంతోపాటు గుర్రాలు, జింకల వంటి వన్యప్రాణి సంరక్షణ వంటివి చేపడుతుంటారు.

1997 అగస్టు 31న ప్రిన్సెస్ డయానా చనిపోయినప్పుడు రాణి కుటుంబం బల్మోరల్ క్యాజిల్‌లోనే ఉంది. డయాన మరణం తరువాత ఆదివారం ఉదయం రాణి, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలు దగ్గర్లోని ఒక చర్చికి వెళ్లారు. వారు తిరిగి కోటకు వచ్చేటప్పుడు దారిలో డయానాకు నివాళిగా ప్రజలు ఉంచిన పుష్పగుచ్ఛాలను వారు చూశారు.

బల్మోరల్ క్యాజిల్‌తో రాణికి ఉన్న అనుబంధాన్ని ఇక్కడ చిత్రాల్లో చూడొచ్చు.

నోట్: అన్ని చిత్రాలకు కాపీరైట్స్ వర్తిస్తాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)