You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Blood Cancer: 'నా వయసు 20 ఏళ్లు.. గుండెలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది.. అది బ్లడ్ క్యాన్సర్‌గా మారుతుందని అనుకోలేదు'
- రచయిత, న్యూస్
- హోదా, బీబీసీ ముండో
సోఫీ వెల్డన్‌కు గుండెలో ఇన్‌ఫెక్షన్, తలనొప్పి, మెడ నొప్పి తరచుగా వస్తుండేవి. బ్రిటన్‌కు చెందిన 24 ఏళ్ల సోఫీ యూనివర్సిటీ విద్యార్థి. చదువుకుంటున్నప్పుడు తల మీద, మెడ మీద ఒత్తిడి వచ్చేది. అయితే, అవి మామూలు నొప్పులేనని సోఫీ భావించారు.
చివరికి, ఒకరోజు డయాగ్నోసిస్‌కి వెళితే సోఫీకి లుకేమియా అని తేలింది. ఆమె షాక్ అయ్యారు.
వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని, తరచుగా నొప్పులు లేదా ఇన్‌ఫెక్షన్ వస్తూ ఉంటే పరీక్షలు చేయించుకోమని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
2018లో సోఫీకి లుకేమియా ఉందని తేలింది. అప్పటికి ఆమెకు 20 ఏళ్లు.
బ్రిటన్‌లో రోజుకు 28 మంది (2016-18 మధ్య జరిపిన అధ్యయనం ప్రకారం) లుకేమియా బారిన పడుతున్నట్టు తేలింది కానీ, 1 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించగలుగుతున్నారని 'లుకేమియా యూకే' సంస్థ తెలిపింది.
2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,00,000 లుకేమియా బారినపడ్డారని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ వెల్లడించింది.
లుకేమియా లక్షణాల్లో ముఖ్యమైనవి అలసట, గాయాలు, అసాధారణ రక్తస్రావం, తరచూ ఇన్‌ఫెక్షన్ సోకడం.
లుకేమియా యూకే, లుకేమియా కేర్‌తో కలిసి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది.
లుకేమియాను ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదని ఈ రెండు సంస్థలూ నొక్కి చెబుతున్నాయి.
బయోలజీ చదువుతున్న సోఫీకి 2018లో తరచూ మెడ నొప్పి వస్తుండడంతో, మెనింజైటిస్ కావచ్చని వైద్య పరీక్షలు చేయించుకోమని తన డాక్టర్ సూచించారు.
మొదట కొన్ని పరీక్షలు చేయించుకున్నాక, డాక్టర్లు ఆమెను అక్యూట్ వార్డ్‌కు షిఫ్ట్ చేసి గంట గంటకూ రక్తపరీక్షలు, ఫుల్ బాడీ సీటీ స్కాన్, బోన్ మారో బయోప్సీ చేశారు.
పరీక్షల తరువాత కూడా ఆమెకు తలనొప్పి, మెడ నొప్పి వస్తూనే ఉన్నాయి. దాంతో ఆమెకు "ప్రాణాంతక అనారోగ్యం" ఉన్నట్టు డాక్టర్లు నిర్థరించారు.
సోఫీకి సీఏఆర్-టీ అనే ప్రత్యేకమైన చికిత్స అవసరమని వైద్యులు అభిప్రాయపడ్దారు.
ఈ చికిత్సలో భాగంగా రోగి వ్యక్తిరోగనిరోధక వ్యవస్థ, తెల్ల రక్త కణాలలో కొంత భాగాన్ని తీసుకుని వాటి ప్రతిరూపాలను తయారుచేస్తారు. అవి క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై పోరాటం చేస్తాయని వెల్డన్ వివరించారు.
2019లో సోఫీకి 21వ పుట్టినరోజు జరిగిన మర్నాడే ఈ చికిత్స ప్రారంభించారు. తన కమ్యూనిటీలో ఈ చికిత్స తీసుకున్న తొలి మహిళ తానేనని సోఫీ చెప్పారు.
"ఒక చిన్న సంచీలో కణాలు తీసుకొచ్చారు. ఇవే నన్ను కాపాడతాయని చెఎప్పారు. 20 సెకెండ్లలో వాటిని నాకు ఎక్కించారు. ఇలాంటి చికిత్స ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు" అన్నారు సోఫీ.
చికిత్స అనంతరం 2019 జూలైలో పలుమార్లు పరీక్షలు జరిపిన తరువాత ఆమెకు వ్యాధి తగ్గిపోయిందని నిర్థరించారు.
"నా జీవితంలో అదే అత్యుత్తమైన రోజు" అన్నారు సోఫీ.
చికిత్స వలన సోఫీ రోగనిరోధక శక్తి కుంటుపడింది. కానీ, లుకేమియా తగ్గడం చిన్న విషయం కాదని, ఈ వ్యాధిని, లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
"లుకేమియా లక్షణాలు చాలా అస్పష్టంగా ఉండవచ్చు. మనం పట్టించుకోకపోవచ్చు. కానీ, మనసులో మనకు తెలుస్తుంటుంది. దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు" అంటున్నారు సోఫీ.
ఇవి కూడా చదవండి:
- ఈ బియ్యాన్ని మీ ఇంట్లో వండితే ఆ సువాసన పక్కింట్లోకి కూడా వెళ్తుంది... దీనికీ బుద్ధుడికీ సంబంధం ఏంటి?
- సైరస్ మిస్త్రీ మరణానికి బాధ్యులెవరు?
- కాలా నమక్: ఈ బియ్యం నుంచి వచ్చే సువాసనకు బుద్ధుడితో సంబంధం ఏమిటి?
- ప్రేమిస్తే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి చెప్పాలి, పెళ్లికి 6 నెలలు ఆగాలి.. పెళ్లయ్యాక 27 నెలలు అక్కడే గడపాలి..
- తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)