You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎలాన్ మస్క్ vs. ట్విటర్: 44 బిలియన్ డాలర్లతో డీల్ సెటిల్ చేసుకుని వెనక్కి తగ్గిన మస్క్‌పై కేసు వేసిన ట్విటర్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్‌తో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ న్యాయ పోరాటానికి దిగింది. ముందు చెప్పినట్లుగా తమ సంస్థ కొనుగోలుకు కట్టుబడి ఉండాలని పేర్కొంటూ ట్విటర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా వేసింది.
ట్విటర్ కొనుగోలు డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతే ట్విటర్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనేందుకు తొలుత మస్క్ ఒప్పందం చేసుకున్నారు.
ఫేక్, స్పామ్ ఖాతాల గురించి తాను అడిగిన సమాచారాన్ని ట్విటర్ ఇవ్వలేదని మస్క్ ఆరోపించారు. అందువల్లే డీల్ నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్పారు.
ఈ వ్యవహారంపై ట్విటర్, ఒక డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. ట్విటర్ ప్రతీ షేరుకు 54.20 డాలర్ల (రూ. 4,315) చొప్పున కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ డీల్‌ను పూర్తి చేసేలా మస్క్‌ను ఆదేశించాలని కోర్టును కోరింది.
''ట్విటర్‌ను ఆటలోకి తీసుకువచ్చి, ఒక స్నేహపూర్వక విలీన ఒప్పందాన్ని ప్రతిపాదించిన తర్వాత ఎలాన్ మస్క్ మనసు మార్చుకుంటున్నారు. సదరు కంపెనీకి నష్టం కలిగేలా, వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా, స్టాక్ హోల్టర్ విలువను నాశనం చేసేలా తన మనసును మార్చుకుంటూ డీల్ నుంచి తప్పుకోవచ్చని నమ్ముతున్నారు'' అని ఆ దావాలో పేర్కొన్నారు.
టేకోవర్ ఒప్పందంలోని అనేక నిబంధనలను ఉల్లంఘిస్తూ, ట్విటర్ వ్యాపారానికి విఘాతం కలిగించేలా మస్క్ వ్యవహరించారని అందులో ఆరోపించారు.
''ఎలాన్ మస్క్, విక్రయ ఒప్పందానికి జవాబుదారీగా ఉండాలని ట్విటర్ కోరుకుంటోంది'' అని ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు.
'' ఓహ్, ఇది హాస్యస్పదం'' అంటూ మంగళవారం మస్క్ ట్వీట్ చేశారు.
''ఇకపై తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగం లేదని భావిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. ఈ డీల్‌కు మస్క్ ఒప్పుకున్న తర్వాత టెస్లా షేర్ల విలువ పడిపోయినట్లు'' దావాలో పేర్కొన్నారు.
మస్క్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ 'టెస్లా'కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు.
''మస్క్ ఆర్జనలో సంహభాగం టెస్లా షేర్లదే. ట్విటర్ కొనుగోలుకు ఒప్పుకున్న తర్వాత టెస్లా షేర్ల విలువ 100 బిలియన్ డాలర్ల (రూ. 7,96,144 కోట్లు)కు పైగా క్షీణించింది. అందుకే మస్క్, ఈ ఒప్పందం నుంచి బయటకు వెళ్లాలి అనుకుంటున్నారు. ఈ నష్టాన్ని మస్క్ భరించడానికి బదులుగా దాన్ని ట్విటర్ స్టాక్ హోల్టర్లపై మోపాలని ఆయన అనుకుంటున్నారు '' అని దావాలో రాశారు.
గత నెల వ్యవధిలో ట్విటర్ షేరు ధర 8 శాతం పడిపోయింది. మే నెలలో ట్విటర్ షేరు ధర 50 డాలర్లకు పైగా ఉంది. ట్విటర్‌లో ఫేక్ ఖాతాల గురించి ప్రశ్నిస్తూ ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటించిన తర్వాత ట్విటర్ షేరు ధర పతనమైంది.
ట్విటర్‌లోని నకిలీ అకౌంట్ల సమాచారాన్ని ట్విటర్ ఇవ్వలేకపోయిందని పేర్కొంటూ శుక్రవారం ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు.
నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ నడుచుకోవట్లేదని ఆయన అన్నారు.
దీనికి స్పందనగా, మస్క్‌పై న్యాయపోరాటం చేసే ఆలోచనలో ఉన్నట్లు ట్విటర్ చెప్పింది. మస్క్‌తో చేసుకున్న ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
విలీన ఒప్పందంలో బిలియన్ డాలర్ల బ్రేకప్ ఫీజు కూడా ఉంది.
'వాక్ స్వాతంత్ర్య వాది'గా చెప్పుకునే మస్క్, ట్విటర్ తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత కంటెంట్ మాడరేషన్ నిబంధనలను మార్చుతానని హామీ ఇచ్చారు. ట్విటర్‌ను మరింత పారదర్శకంగా మారుస్తానని అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు మరికొంతమంది అకౌంట్లపై ట్విటర్ నిషేధం విధించడం పట్ల ఆయన బహిరంగంగానే విమర్శించారు.
మంగళవారం ట్విటర్ షేర్ల ధర 4 శాతానికి పైగా పెరిగింది. అయినప్పటికీ ట్విటర్ షేర్ ధర.. మస్క్ ప్రతిపాదించిన 54.20 డాలర్ల కంటే ఇంకా 20 డాలర్లు తక్కువే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ముస్లింలు ఈ స్కూలు మీద ఒత్తిడి తెచ్చారా... విద్యార్థులు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థన చేయకూడదని చెప్పారా?
- గోదావరి వరదలు: ప్రమాద హెచ్చరికలు అంటే ఏంటి, ఎంత వరద వస్తే వీటిని జారీ చేస్తారు?
- ప్రపంచ జనాభా దినోత్సవం: 'భారత్ జనాభా 2023లో చైనాను మించిపోతుంది' - ఐక్యరాజ్యసమితి
- శ్రీలంక సంక్షోభం లాంటిదే పాకిస్తాన్, నేపాల్ దేశాలలోనూ వస్తే ఏమవుతుంది?
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)