‘మీ భర్తను చంపడం ఎలా’ నవలా రచయిత్రి తన భర్తను ఎందుకు హత్య చేశారు? కోర్టులో ఏం చెప్పారు?

ఊహ నిజమైతే ఎలా ఉంటుంది? ఆ ఊహే నిజ జీవితంలో మనం చేసే పనులకు ప్రేరణగా నిలిస్తే ఆ కథ చివరకు ఎటు చేరుతుంది? నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ విషయంలో ఇలాంటి చిత్రమైన పరిణమాలు జరిగాయి.

నాన్సీ అనే మహిళ తన 63 ఏళ్ల భర్తను హత్య చేసినట్లు అమెరికాలోని ఒరెగాన్ కోర్టు నిర్ధరించింది. జూన్ 2018లో నాన్సీ తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆమె కేసు విచారణ సందర్భంగా ఎక్కువమంది నోళ్లలో నానిన విషయం ఆమె గతంలో తన బ్లాగ్ లో రాసిన ఓ పోస్ట్. రచయిత కూడా అయిన బ్రోఫీ కొంతకాలం కిందట తన బ్లాగ్‌లో ఒక షాకింగ్ విషయం రాశారు. ఆమె ఈ బ్లాగ్ టైటిల్ - 'హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్'. అంటే 'మీ భర్తను ఎలా చంపాలి'

'నేను చంపలేదు, నా రచనల్లో ప్రేరణను మాత్రమే చెప్పాను'

ఈ బ్లాగ్ లో, హత్యకు చూపించగల ఐదు కారణాలు, ఆయుధాల గురించి నాన్సీ రాశారు.

తన రొమాంటిక్ నవలలో ఒక పాత్ర తన భర్తను చంపాలనుకుంటే, ఆమె చూపించాల్సిన ఐదు కారణాలు, హత్యకు ఉపయోగించాల్సిన సరైన ఆయుధాలు ఏమిటో ఆమె పేర్కొన్నారు.

ఆమె తన భర్త డెనియల్ బ్రోఫీ ఛాతీపై రెండుసార్లు కాల్పులు జరిపారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఈ హత్యకు ముందు రచయిత్రి ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారని ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో వాదించిన లాయర్ సీన్ ఓవర్‌స్ట్రీట్ వెల్లడించారు. తన భర్తను క్రాంప్టన్ ఎలా చంపాలని ప్లాన్ చేశారో దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు

''ఇది డబ్బుకు సంబంధించిన వ్యవహారం గురించి మాత్రమే కాదు. నాన్సీ కోరుకున్న, ఆమె భర్త అందించలేని లైఫ్ స్టైల్ సంబంధించిన వ్యవహారం'' అని విచారణ సమయంలో లాయర్ ఓవర్ స్ట్రీట్ కోర్టుకు చెప్పారు.

అయితే, తాను తన భర్తను చంపలేదని నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ కోర్టుకు చెప్పారు. ఘటనా స్థలంలో ఉన్న సెక్యూరిటీ కెమెరా తాను కథనాలను రాయడానికి ప్రేరణ కోసం చేసిన ప్రయత్నాలను మాత్రమే చూపిస్తున్నాయని ఆమె అన్నారు.

అయితే, హత్యకు ఉపయోగించిన తుపాకీ దొరకలేదని న్యాయవాది ఓవర్‌స్ట్రీట్ చెప్పారు. నాన్సీ భర్త లక్షల డాలర్ల విలువైన ఇన్సూరెన్స్ లు చేశారని, తన భర్తను చంపి నాన్సీ ఈ డబ్బును పొందాలనుకుందని లాయర్ పేర్కొన్నారు.

అయితే, ఆమె భర్త మరణానికి కొన్నివారాల ముందే ఆమె ఆర్ధిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ప్రాసిక్యూటర్ చెప్పారు.

''నా రచనలలో హత్యకు ప్రేరణ ఉందని చెబుతున్నారు. కానీ, అది నిజంగా ఎక్కడుందో నిరూపించండి'' అని నాన్సీ అన్నారు.

ఈ కేసులో శిక్షకు సంబంధించి ఇంకా పూర్తి ఆదేశాలు వెలువడలేదు. అయితే, ఈ కేసులో ఆమెకు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని అంటున్నారు. శిక్ష పడితే, ఆమె లాయర్లు పై కోర్టులో అప్పీల్ చేస్తారని స్థానిక వార్తాపత్రిక ది ఒరెగోనియన్ వెల్లడించింది.

నాన్సీ కథలలో హత్యా ప్రయత్నాలు

నాన్సీ పలు రొమాంటిక్ నవలలు రాశారు. వీటిలో స్త్రీ పురుషుల మధ్య చెడిపోతున్న బంధాలను పేర్కొంటూ, ఎవరికీ చిన్న అనుమానం కూడా రాకుండా భార్యాభర్తలను చంపడం ఎలాగో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా రాశారు.

'ది రాంగ్ కాప్' అనే నవలలో, తన భర్తను చంపడానికి కొత్త మార్గాలను ఊహించుకుంటూ గడిపే ఒక మహిళ గురించి రాశారు.

'ది రాంగ్ హస్బెండ్' నవలలోని ప్రధాన పాత్ర తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ తప్పుడు కథనాలు సృష్టించి, తన భర్త నుంచి తప్పించుకుని వెళ్లిపోవడానికి చేసే ప్రయత్నాలను పేర్కొన్నారు.

కానీ 'హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్'లో రచయిత్రి నాన్సీ ఇంకో అడుగు ముందుకేసారు. ఇందులో, తన భర్తను చంపడానికి కిరాయి హంతకులను నియమించుకోవద్దని ఆమె సలహా ఇస్తారు.

"ఇలాంటి వారు పోలీసుల ముందు నిజాలు కక్కేస్తారు. అలాగే భర్తను చంపే విషయంలో బాయ్ ఫ్రెండ్ ను కూడా నమ్మొద్దు. అదొక బ్యాడ్ ఐడియా'' అని నాన్సీ రాసుకొచ్చారు.

భర్తకు విషమిచ్చి చంపడం కూడా అంత మంచి పద్ధతి కాదన్నారు నాన్సీ

నాన్సీ భర్త డేనియల్ బ్రోఫీకి ఒక కుకింగ్ ఇన్ స్టిట్యూట్ ఉంది. నాన్సీ, ఆమె భర్త 27 ఏళ్లపాటు కలిసి జీవించారు. నాన్సీ తన బ్లాగ్‌లో తన భర్తతో తన సంబంధానికి సంబంధించిన శృంగార కోణాన్ని కూడా చర్చించారు.

తమ రిలేషన్ లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, జీవితంలో మంచిరోజులను, చెడ్డ రోజులను చూశామని చెప్పుకొచ్చారు.

'హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్' నవలలో రచయిత్రి ఒక పాత్ర భర్త హత్యకు సంబంధించిన పద్ధతులు, కారణాలను వెల్లడించారు. అందులో తుపాకీని ఉపయోగించడం కూడా ఉంది.

తుపాకుల వల్ల శబ్ధం వస్తుందని, ఇది కొంత ఇబ్బందకరమైన పరిస్థితి అని బ్లాగ్ లో నాన్సీ పేర్కొన్నారు. అంతేకాదు, గన్ ఉపయోగించడానికి నైపుణ్యం అవసరమని కూడా ఆమె అన్నారు.

"మనలో ప్రతి ఒక్కరూ చాలా విసిగిపోయినప్పుడు మాత్రమే హత్య చేయాలని కోరుకుంటారని నాకు తెలుసు" అని నాన్సీ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)