రష్యన్ ఓలిగార్క్‌ సూపర్ యాట్‌ల విలాసం: 3డి సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిమ్‌లు, బార్లు..

    • రచయిత, హాలీ హొండెరిక్ , రాబిన్ లెవిన్‌సన్ కింగ్
    • హోదా, బీబీసీ న్యూస్

పసిఫిక్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో లేదా మెడిటరేనియన్ సముద్ర తీరంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సూపర్ యాట్ పై గనక మీరు ప్రయాణం చేస్తూ ఉంటే, విలాసానికి, సాహసానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అర్ధం.

ఇదంతా వినేందుకు కలల ప్రపంచంలా ఉంటుంది. కానీ, యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం మాత్రం ఈ పరిశ్రమపై కూడా ప్రభావం చూపించింది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఆంక్షల నేపథ్యంలో పలువురు ఓలిగార్క్‌లకు సంబంధించిన 2 బిలియన్ డాలర్లకు పైగా విలువున్న మెగా యాట్ లను యూరప్ లో సీజ్ చేశారని బ్లూమ్‌బర్గ్ అంచనా వేస్తోంది.

యూరప్ అధికారులు కనీసం 16 సూపర్ యాట్‌లను సీజ్ చేసారు. రెండు హెలీప్యాడ్‌లు, అత్యంత భారీ స్విమ్మింగ్ పూల్ ఉన్న రష్యాకు చెందిన దిల్‌బార్ సూపర్ యాట్‌ను ఈ నెల మొదట్లో జర్మనీ అధికారులు సీజ్ చేశారు.

అంతకు ఒక వారానికి ముందు స్పెయిన్‌లోని బెలెరిక్ ఐలాండ్స్‌లో 77 మీటర్ల పొడవున్న రష్యన్ సూపర్ యాట్ టాంగోను అమెరికా సీజ్ చేసింది. ఇందులో ఒక బ్యూటీ సెలూన్, పూల్, బీచ్ క్లబ్ కూడా ఉన్నాయి. ఇది పుతిన్ స్నేహితుడు విక్టర్ వెక్సెల్‌బెర్గ్‌కు చెందింది. ఆయనపై కూడా ఆంక్షలు విధించారు.

ప్రపంచంలోనున్న సూపర్ యాట్‌లలో సుమారు 10 శాతం రష్యన్‌లకు చెందినవే. పుతిన్‌కు సన్నిహితులైన వారి అంతర్జాతీయ ఆస్తుల పై ప్రపంచ దేశాలు పట్టు బిగిస్తూ ఉండటంతో, ఈ యాట్‌ల పై ఆధారపడి జీవిస్తున్న విలాసవంతుల జీవితంపై కూడా ప్రభావం చూపిస్తోందని పరిశ్రమకు చెందినవారు చెబుతున్నారు.

ఒక వైపు రష్యాకు చెందిన నౌకల గురించి వేట కొనసాగుతోంది. మరో వైపు సంపన్న క్లయింట్‌ల పై ఆంక్షలు విధించారు. దీంతో, యాట్‌లు ఖాళీ అయి, సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, షిప్ యార్డ్ యజమానులు, యాట్‌లో పని చేసే సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

"తప్పుడు దారిలో డబ్బు సంపాదించేందుకు అందరికీ భయంగానే ఉంది" అని మారిటైం రీసెర్చ్ సంస్థ వెసెల్స్ వేల్యూకి చెందిన సామ్ టకర్ చెప్పారు.

24 మీటర్లకు మించి పొడవున్న నౌకలను సూపర్ యాట్ అని అంటారు. కొన్ని నౌకలు వీటికి నాలుగింతలు ఎక్కువ పొడవు కూడా ఉండవచ్చు.

నావెల్ ఆర్కిటెక్ట్ గ్రెగ్ మార్షల్‌కు ఈ మెగా నౌకలు నచ్చి వీటిని సావెరిన్ ఐలాండ్స్‌కు తీసుకుని వెళ్లారు.

ఆయన ప్రస్తుతం 122 మీటర్ల పొడవుండే నౌకను డిజైన్ చేస్తున్నారు. ఇందులో బహుళ అంతస్థుల జలపాతాలు కూడా ఉంటాయి. వేర్వేరు డెక్‌ల పై స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2400 మీటర్ల స్పా, 1500 చదరపు అడుగుల్లో జిమ్ కూడా ఉంటుంది.

"రష్యన్లు తమ నౌకలు భారీగా ఉండటాన్ని ఇష్టపడతారు. 2021లో అమెరికన్లకు చెందిన నౌకలు 53 మీటర్లు పొడవుంటే, ఒక సాధారణ రష్యన్ సూపర్ యాట్ 61 మీటర్ల పొడవు ఉంది" అని సూపర్ యాట్ టైమ్స్ విశ్లేషణ చెబుతోంది.

నౌక పొడవు మాత్రమే కాకుండా ఖరీదైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తారు. గత నెలలో యూకేలో నిలిపేసిన రష్యాకు చెందిన నౌక ఫీ కింది డెక్ లాబీలో నిరంతరాయంగా వైన్‌ను విక్రయించే బార్ కూడా ఉంది.

జిబ్రాల్టర్‌లో సీజ్ చేసిన ఆక్సియోమాలో 3డి సినిమా, రెండంతస్తుల సెలూన్, ఆన్ బోర్డు వాటర్ స్లైడ్ ఉన్నాయి. దీని వల్ల అతిధులు సన్ డెక్ నుంచి సముద్ర తీరానికి కొన్ని సెకండ్లలో చేరుకునే అవకాశముంటుంది.

కానీ, ప్రస్తుతం రష్యా పై పశ్చిమ దేశాలు విధించిన అంతర్జాతీయ ఆంక్షలు బ్యాంకింగ్ లావాదేవీలను కష్టతరం చేస్తున్నాయి. సూపర్ యాట్ పరిశ్రమ ఆదాయానికి గండి పడవచ్చు అని మార్కెట్ విశ్లేషకుడు టకర్ హెచ్చరించారు.

ప్రతీ సంవత్సరం యాట్ విలువలో 15 % నిర్వాహక ఖర్చులు ఉంటాయి. అంటే, దీని నిర్వహణకే కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుంది.

డబ్బులు బదిలీ చేయలేకపోతే సిబ్బందికి, నిర్వహణకు చెల్లింపులు చేసేందుకు రష్యన్ యాట్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇటీవల కాలంలో లావాదేవీలు చేసేందుకు క్రిప్టో కరెన్సీ కూడా ప్రాముఖ్యం సంతరించుకుంటోంది.

"అమెరికాలో నౌకలను సీజ్ చేస్తే, వాటి నిర్వహణకు అవసరమైన డబ్బును ప్రభుత్వం చెల్లించవచ్చు. దీని వల్ల వాటి విలువ కోల్పోకుండా ఆపవచ్చు" అని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్వహిస్తున్న క్లేప్టో క్యాప్చ్యూర్ యూనిట్ కు నేతృత్వం వహిస్తున్న ఆండ్రూ ఆడమ్స్ చెప్పారు.

"ఈ బాధ్యతను కూడా మేం తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆడమ్స్ బ్లూమ్‌బర్గ్ పత్రికకు చెప్పారు.

కానీ, ఉత్తర యూరప్‌లో ఉన్న నౌకల తయారీ దారులు కూడా కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేయాల్సి ఉంటుంది. లేదంటే వారు కూడా ఈ ఆంక్షల ప్రభావంలో చిక్కుకునే అవకాశాలుంటాయి. నౌకల యాజమాన్య వివరాలు పారదర్శకంగా ఉండకపోవడంతో ఈ పరిశ్రమకు సంబంధించిన చాలా మంది ఆంక్షలకు గురవ్వని రష్యన్లతో కూడా వ్యాపారం చేయకుండా తప్పించుకుంటున్నారు.

కొన్ని సార్లు పశ్చిమ దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న సంస్థలతో పరిశ్రమ కార్మికులు వ్యాపారం చేసేందుకు నిరాకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేవుల్లో కొన్ని సూపర్ యాట్‌లు ఖాళీగా పడి ఉంటున్నాయి.

"ఈ నౌకలకు యజమానులెవరో ఎవరికీ తెలియదు. చట్టబద్ధంగా వాటిని అమ్మలేం. కదపలేం కూడా. వీటితో ఏమి చేయగలం? దీంతో ఇవి రేవుల్లో చిక్కుకుని ఉండిపోతాయి" అని టకర్ చెప్పారు.

రష్యన్‌లతో వ్యాపారం చేయకుండా చాలా మంది తప్పించుకుంటున్నారని ఫ్లోరిడాకు చెందిన యాట్ బ్రోకర్ బాబ్ డెనిసాన్ కూడా చెప్పారు.

"రష్యా విషయంలో మా దేశం తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాలి" అని ఆయన అన్నారు.

ఈ ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా నౌకల్లో పని చేస్తున్న కొన్ని వేల మంది సిబ్బంది పై ప్రభావం చూపిస్తాయి. ఒక భారీ నౌకలో సుమారు 50-100 మంది సిబ్బంది ఉంటారు. అందులో సగం మంది నౌకలో ఉంటే, సగం మంది సెలవులో ఉండాల్సి వస్తోంది.

అయితే, కొన్ని నౌకలు ఆంక్షలు విధించని దేశాల తీరాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మాజీ చెల్సీ ఎఫ్‌సి యజమాని రోమన్ అబ్రమోవిక్ టర్కీలో రెండు సూపర్ యాట్‌లను నిలిపినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని దుబాయ్‌లో, కొన్ని కరీబియన్‌లో కనిపించినట్లు చెబుతున్నారు.

అయితే, ఇవన్నీ తప్పించుకుని పారిపోయిన నౌకలు కావని టకర్ అంటున్నారు. శీతాకాలంలో సాధారణంగా కరీబియన్ తీరంలో ఎక్కువ నౌకాలుంటాయని ఆయన అన్నారు.

యుద్ధం మొదలు కావడానికి ముందు ఈ పరిశ్రమలో చారిత్రకంగా ఎన్నడూ లేనంత అభివృద్ధి కనిపించింది.

40 సంవత్సరాల క్రితం మార్షల్ ఈ నౌకలను నిర్మించడం మొదలుపెట్టినప్పుడు 30 మీటర్లకు పైగా ఉండే నౌకలు మొత్తం 24 ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటివి 5000కు పైగా ఉన్నాయని సూపర్ యాట్ టైమ్స్ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ యాట్ ల వ్యాపారం ఊహించని రీతిలో పెరిగిందని యాట్ సంస్థలకు చెందిన రిచర్డ్ లాంబర్ట్ చెప్పారు.

యాట్ల అమ్మకాలు, కొత్త వాటి నిర్మాణం అన్నీ రికార్డు స్థాయిలో పెరగగా, అది 2022లో అది మరింత పెరగనున్నట్లు అంచనాలు వేశారని ఆయన చెప్పారు.

సంపన్న వర్గాలకు ప్రైవేటు నౌకలపై దీవులకు వెళ్లడం అత్యంత సురక్షితమైన విధానం. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా పెరగడంతో ఇలాంటి పర్యటనల నిడివి కూడా పెరిగింది. కరీబియన్ తీరం నుంచి కొన్ని బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా జరిగాయి.

"వేసవిలో మెడిటరేనియన్ తీరాలకు వెళ్లే సీజన్ మొదలయింది. అయితే, "ప్రస్తుతం విధించిన ఆంక్షలతో ఆర్ధిక ప్రభావం అంచనా వేసేందుకు వేచి చూడాలి" అని టకర్ అన్నారు.

సూపర్ యాట్ యాజమాన్యానికి ఉన్న ప్రతిష్ట కూడా ఇటీవల జరిగిన దుష్ప్రచారం వల్ల కుంటుపడిందని ఆయన భావిస్తున్నారు.

"కొంత మంది యజమానులు ధర్మకర్తలు కూడా ఉన్నారు. ఇందులో కొందరు మంచి పనులు చేస్తే కొందరు చెడ్డ పనులు చేసేవారు కూడా ఉన్నారు".

సమాజం ఈ నౌకలను బాండ్ సినిమాల్లో విలన్లకు చెందినట్లుగా చూడటం లేదు. నేను కూడా వీటితో సంబంధం ఏర్పర్చుకుని అదే కుంచెతో రంగును పులుముకోవడం అవసరమా అన్నట్లు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)