You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
షాంఘై: చైనాలో పరిస్థితి చేయి దాటుతోందా? కరోనా మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి?
చైనాలోని షాంఘైలో కోవిడ్ కారణంగా ముగ్గురు మరణించారు. మార్చి చివర్లో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.
షాంఘై నగర ఆరోగ్య కమిషన్ నివేదిక ప్రకారం, మరణించిన ముగ్గురూ టీకా తీసుకోలేదు. వారి వయస్సు 89 నుంచి 91 ఏళ్ల మధ్య ఉంటుంది.
60 ఏళ్ల పైబడినవారిలో కేవలం 38 శాతం ప్రజలు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు షాంఘై అధికారులు తెలిపారు.
నగరంలో ఇప్పుడు మరోసారి భారీ కోవిడ్ నిర్ధరణ పరీక్షలు జరగనున్నాయి. అక్కడ కఠిన లాక్‌డౌన్ నాలుగోవారం కూడా కొనసాగనుంది.
కోవిడ్ కారణంగా షాంఘైలో ఇప్పటివరకు ఒక్కరు కూడా మరణించలేదని చైనా చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సందేహాలు తలెత్తుతున్నాయి.
2020 మార్చి నుంచి చూస్తే... సోమవారం నమోదైన ఈ మరణాలనే తొలి కోవిడ్ సంబంధిత మరణాలుగా దేశంలోని అధికారులు అంగీకరించారు.
ఒకే ఆసుపత్రిలో డజన్ల కొద్దీ మరణాలు..
షాంఘైలో బీబీసీ ప్రతినిధి రాబిన్ బ్రంట్ విశ్లేషణ
ఈ ప్రకటన చేసిన సమయం సరిగా లేదు.
మొదటగా, 25 మిలియన్ల మంది ప్రజలు ఉండే ఈ నగరంలో ఎవరూ కూడా కరోనా కారణంగా మరణించలేదని నమ్మడం చాలా విచిత్రంగా ఉంది.
కరోనా సోకి అక్కడి ప్రజలు మరణించారనే సంగతి మాకు తెలుసు. దీని గురించి మేం నివేదించాం.
షాంఘైలోని ఒకే ఆసుపత్రిలో డజన్ల కొద్ది వృద్ధులు దీనివల్ల మరణించారు. కానీ, అధికారుల ప్రకారం అవి అధికారిక కరోనా మరణాలు కావు. స్పష్టంగా చెప్పాలంటే వారంతా ఏవో ఇతర అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు.
మరి ఏం మారింది? నిజం చెప్పాలంటే క్లినికల్ అసెస్‌మెంట్ పరంగా ఏమీ మారనట్లుగానే కనిపిస్తోంది.
అంతర్లీన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న రోగులంతా కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాతే చనిపోయారు. కానీ, అప్పుడు మరణాల రేటు మాత్రం 'సున్నా'గానే ఉంది.
ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే మరో ముగ్గురు మరణించారు. అయితే, అధికారిక మరణాల రేటు పెరిగింది.
ఉన్నపళంగా ఈ అధికారిక మరణాల రేటు ఎందుకు పెరిగింది? అని అడగడం సమంజసమే...
చైనాలో 60 ఏళ్లు పైబడిన జనాభాలో మహా అయితే సగం మంది పూర్తి డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ వయస్సు వారికి తాజా వైరస్ వేవ్ వల్ల ప్రమాదం పొంచి ఉందని బహిరంగంగా చెప్పాలని అధికారులు నిర్ణయించుకోవడం వల్లే తాజా మరణాల రేటును పెంచి చూపిస్తున్నారా?
షాంఘై జనాభాను ఈ వైరస్ అతలాకుతలం చేయగలదని అధికారులు భయపడ్డారు కాబట్టే నగరాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. ఈ వైరస్ ఇప్పటివరకు ఎవరినీ చంపకపోయినట్లయితే, నగరాన్ని ఎందుకు లాక్‌డౌన్ చేస్తారు.
ఈ ముగ్గురి మరణాలను నివేదిస్తూ షాంఘై హెల్త్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ''వారి ప్రాణాలను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కుదరలేదని'' అందులో పేర్కొంది. ఆదివారం రోజు ఆసుపత్రిలో ముగ్గురు చనిపోయారని వెల్లడించింది. ఈ ముగ్గురికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పింది.
మూడు వారాల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులను గుర్తించినప్పటి నుంచి షాంఘై నగరంలో కఠిన లాక్‌డౌన్‌ను విధించారు. ఇది అక్కడి నివాసితులకు కోపం తెప్పించింది.
లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. పాజిటివ్‌గా తేలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఆంక్షలు, ఆహారపదార్థాల సరఫరాలో కొరతల గురించి కొద్దిరోజులుగా చాలామంది సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఆహారం, నీరు, కూరగాయలు, మాంసం, గుడ్ల కోసం ప్రజలు ఆర్డర్లు చేయాల్సి వచ్చింది. వాటిని ప్రభుత్వం వారు తెచ్చేంతవరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
లాక్‌డౌన్ కొనసాగింపు కారణంగా డెలివరీ సర్వీసులు, గ్రోసరీ దుకాణాల వెబ్‌సైట్లు విపరీతంగా రద్దీగా మారాయి.
రోజుకు 20,000లకు పైగా కేసులు వస్తుండటంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. షాంఘై నగరంలోని ఎగ్జిబిషన్ హాళ్లు, పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.
ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో పెరుగుతోన్న కేసుల సంఖ్య తక్కువే. అయినప్పటికీ చైనా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'జీరో కోవిడ్' వ్యూహానికి ఇది సవాలే. జీరో కోవిడ్ వ్యూహంలో భాగంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్లు, కఠిన నిబంధనలను చైనా పాటిస్తోంది.
ఈ వ్యూహామే, వైరస్‌తో కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తోన్న ఇతర దేశాలతో చైనాను వేరు చేస్తుంది.
కానీ, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వైరస్ వ్యాప్తి పెరగడం, దాని స్వల్ప లక్షణాల కారణంగా... ప్రస్తుతం చైనా అనుసరిస్తోన్న ఈ వ్యూహం సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు తావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
- 8 ఏళ్లు బోకో హరాం తీవ్రవాదుల చెరలో గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అమ్మాయి కథ..
- అగ్రవర్ణ ప్రజల కంటే ఆదివాసీలు, దళితులు ముందే మరణిస్తున్నారా
- హాలీవుడ్ సెన్సేషన్ 'మెర్ల్ ఓబెరాన్': బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఈ భారతీయ తారను మనం మరిచిపోయామా?
- జంతువుల కళేబరాల్లో రహస్యంగా డ్రగ్స్ తరలిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)