You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బెల్జియం, అల్జీరియా: రూ. 2 కోట్ల లాటరీ తగిలింది, బ్యాంకు ఖాతా లేదని డబ్బులు ఇవ్వడం లేదు
అల్జీరియాకు చెందిన ఓ వ్యక్తికి బెల్జియంలో 2,50,000 యూరోల (సుమారు రూ. 2.06 కోట్లు) లాటరీ తగిలింది. అయితే, సరైన నివాస ధ్రువపత్రం లేకపోవడంతో ఆ డబ్బును పొందేందుకు ఆయన అష్టకష్టాలు పడుతున్నారు.
5 యూరోల (రూ. 412) స్క్రాచ్‌కార్డుతో ఆయనకు ఈ లాటరీ వచ్చింది. అయితే, ఈ మొత్తం డబ్బును నోట్ల రూపంలో ఇచ్చేందుకు లాటరీ యాజమాన్యం నిరాకరించింది. బ్యాంకు ఖాతాలో మాత్రమే వేస్తామని సంస్థ చెప్పింది. అయితే, బ్యాంకు ఖాతా తెరిచేందుకు అవసరమైన ధ్రువపత్రాలు ఆయన దగ్గర లేవు.
ఆయన తరఫున నగదును తీసుకునేందుకు ముందుకొచ్చిన ఆయన స్నేహితుడిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెల్జియంలో హాయిగా జీవించేందుకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలని అనుకున్నానని ఆ లాటరీ గెలిచిన వ్యక్తి వివరించారు.
‘‘డబ్బులు వచ్చిన తర్వాత, బ్రసెల్స్‌లో ఒక ఇల్లు కొనుక్కుంటాను. కారు కూడా కొంటాను’’అని ఆయన చెప్పారు. బెల్జియం వార్తాపత్రిక లాట్స్‌టే న్యూస్‌లో ఆయన గురించి కథనం వచ్చింది. అయితే, ఆయన ఎవరనే వివరాలు అందులో బయటపెట్టలేదు.
28ఏళ్ల అతడికి నివాస పత్రాలు లేదా శాశ్వత నివాసం కానీ లేవని బెల్జియం బ్రాడ్‌కాస్టర్ వీఆర్‌టీ వెల్లడించింది.
‘‘నివాస పత్రాలు లేకపోవడంతో ఆయన బ్యాంకు ఖాతా తెరవలేకపోతున్నారు. బ్యాంకు ఖాతా ఉంటేగానీ డబ్బులు ఇవ్వబోమని సంస్థ చెబుతోంది’’అని ఆయన లాయర్ అలెగ్జాండెర్ వెర్స్‌ట్రేట్ చెప్పారు.
‘‘ఆయన గుర్తింపును ధ్రువీకరించే పత్రాల కోసం చూస్తున్నాం. దీని కోసం అల్జీరియాలోని ఆయన కుటుంబాన్ని సంప్రదించాల్సి ఉంటుంది’’అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.
డబ్బులు ఇచ్చేందుకు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయో సదరు లాటరీ సంస్థ అధికార ప్రతినిధిని సంప్రదించినా.. ఎలాంటి సమాధానమూ రాలేదని ఏఎఫ్‌పీ పేర్కొంది.
అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న ఆయన స్నేహితుడు ఒకరు ఆయన తరఫున లాటరీ డబ్బులు తీసుకునేందుకు బ్రసెల్స్‌లోని లాటరీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. రూ. 82.52 లక్షలు(లక్ష యూరోలు)కుపై లాటరీ తగిలితే ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
అయితే, ఆ స్నేహితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆ స్క్రాచ్ కార్డును దొంగిలించారని ఆరోపించారు. అయితే, లాటరీ తగిలిన వ్యక్తి అక్కడకు వెళ్లి పరిస్థితి వివరించడంతో వారిని వదిలిపెట్టారు.
‘‘ఆ డబ్బులను తీసుకునేంత వరకు ఆయన్ను తన స్వదేశానికి పంపించబోమని అధికారులు హామీ ఇచ్చారు’’ అని ఆయన న్యాయవాది తెలిపారు.
లాటరీ తగిలిన వ్యక్తి నాలుగు నెలల క్రితం అల్జీరియా నుంచి వచ్చారు. మొదట బోటులో ఆయన స్పెయిన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఫ్రాన్స్ మీదుగా బెల్జియం వచ్చారు.
ఆయన బ్రిటన్‌కు వెళ్లాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు బెల్జియంలో స్థిరపడేందుకే ఆయన ఇష్టపడుతున్నారు. త్వరలో ఇక్కడ ఓ కుటుంబాన్ని ఏర్పాటుచేసుకోవాలని అనుకుంటున్నారు.
‘‘నేను మంచి భార్య కోసం చూస్తున్నాను’’అని లాట్స్‌టే న్యూస్‌తో ఆయన చెప్పారు. ‘‘నేను నా డబ్బులతో కాకుండా, మనసుతో వెతుకుతున్నాను’’అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రాత్రయితే చాలు మొదలయ్యే రుగ్మత, నూటికి పది మందిలో కనిపించే దీనికి మీరూ బాధితులేనా
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)