You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Algeria Inflation: ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- రచయిత, రాషిద్ సక్కాయి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అల్జీరియాలో వంట సరుకుల ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆఖరుకి వంట నూనె, పాల కోసం కూడా షాపు యజమానులను మచ్చిక చేసుకోవాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
మొన్నటి వరకు కరోనా వైరస్ ఆంక్షలు, ప్రస్తుతం యుక్రెయిన్ లో యుద్ధం వినియోగదారుల జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి.
"వంట నూనె కొనుక్కోవాలంటే డ్రగ్స్ కొనుక్కుంటున్నట్లుగా ఉంటోంది" అని 31 సంవత్సరాల సమీహ సామర్ చెప్పారు. ఆమె గొంతులో ఈ పరిస్థితి మారదనే అనుమానం, చికాకుతో కూడిన భావం ఆమె గొంతులో వినిపించింది.
ఆమెకు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేకులు తయారు చేయడమంటే చాలా ఇష్టం. ఈ ఆసక్తి ద్వారా ఆమె కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. అయితే, పెరిగిన ధరల వల్ల ఆమెకు కావల్సిన వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు.
"కిరాణా కొట్టుకు వెళ్లి వంట నూనె కొనుక్కోవాలంటే ఆ షాపు యజమానితో పరిచయం ఉండి తీరాల్సిందే" అని సామర్ వివరించారు.
సరుకును షాపు వెనక భాగంలో దాచి ఉంచి అమ్మకాలను రహస్యంగానే నిర్వహిస్తున్నారని చెప్పారు.
కోవిడ్ ఆంక్షలు మొదలైనప్పటి నుంచి ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆమె గమనించారు.
ఈ వారాంతంలో రంజాన్ ఉపవాసాలు మొదలుకానున్నాయి. ఉపవాసం ముగించిన తర్వాత తినే వంటకాల కోసం చాలా నూనె అవసరం ఉంటుంది.
సామర్ కూడా కూరగాయలు, పళ్ళు చవకగా కొనుక్కునేందుకు బ్లిదా పక్కనే ఉన్న చిన్న పట్టణం కొలియాకు వెళతారు.
బంగాళాదుంపల ధర కూడా సాధారణ ధర కంటే 30% ఎక్కువగా పెరిగింది. పాల కోసం కూడా తెల్లవారుజాము నుంచే ప్రజలు క్యూలు కడుతున్నారు.
"గుంపుల్లో తోపులాటను భరించలేక నేను పాలను కొనుక్కోవడం మానేసాను" అని ఆమె చెప్పారు. అలా తోసుకోవడం చాలా అవమానకరంగా ఉంటుంది" అని అన్నారు.
కానీ, గుంపులను తప్పించుకోవడానికి కూడా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది.
ప్రభుత్వం సబ్సిడీ పై ఇచ్చే కేజీ పాల పొడి ధర 25 దినార్లు (సుమారు రూ.13.25) ఉండగా, ఆమె విడిగా 1కేజీ పాల పొడి కొనుక్కునేందుకు 420 దినార్లు ( సుమారు రూ.220) చెల్లించాల్సి వస్తోంది.
అల్జీరియాలో పాల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో జరుగుతుండటం వల్ల పాల కోసం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే దిగుమతుల పై ఆధారపడుతోంది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాల పొడిని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది.
అయితే, అల్జీరియా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం వంట నూనె ధరలు.
అల్జీరియాలో పాల మాదిరిగా వంట నూనెను కూడా సబ్సిడీ పై ఇస్తారు. కానీ, ప్రస్తుత సంక్షోభం మొదలుకాక ముందే ఆయిల్ ధరలు పెరిగాయి. 5 లీటర్ల వంట నూనెకు 600 దినార్లు (సుమారు రూ.318) చెల్లించాల్సి ఉంటుంది.
అల్జీరియాలో జీతం ప్రైవేటు రంగంలో సగటున 240 డాలర్లు (సుమారు రూ. 18,000) ఉంటే, ప్రభుత్వ రంగంలో 410 డాలర్లు (సుమారు రూ. 31,000) ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది.
దేశం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆహార పదార్ధాలను అక్రమ నిల్వ చేయడంతో పాటు అవినీతి కూడా పెరిగిపోయిందని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది.
ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బును పొందేందుకు వంట నూనె వర్తకులు కృత్రిమంగా ఆయిల్ ధరలను పెంచి అమ్ముతున్నారని కమిటీ సభ్యుడు హిషామ్ సఫర్ బీబీసీకి చెప్పారు.
గత సంవత్సరం ఇలాంటి సుమారు 150,000 ఉల్లంఘనలను అధికారులకు రిపోర్ట్ చేసినట్లు చెప్పారు. అందులో చాలా వరకూ కోర్టుకు వెళ్లగా, కొన్ని వేల వ్యాపార అనుమతులను రద్దు చేసినట్లు చెప్పారు.
కానీ, అల్జీరియా పొరుగు దేశాలకు ఈ సబ్సిడీ సరుకులను అక్రమ రవాణా చేయడం కూడా సమస్యగా ఉందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఈ రవాణా ఎంత మేరకు జరుగుతుందనే విషయం పై అధికారిక అంచనాలు లేవు.
కానీ, ప్రతీ రోజు 12 లారీ లోడ్ల కుకింగ్ ఆయిల్ ను మాలి, నైజర్ లకు అక్రమంగా తరలిస్తున్నట్లు కొంత మంది బీబీసీకి తెలిపారు.
ఈ అక్రమ రవాణాదారులు సబ్సిడీ పై ప్రభుత్వం అమ్మే వంట నూనెను అమ్మి ఒక లారీ లోడుకు సుమారు 17,800 డాలర్లు (రూ. 13,45,723) లాభాన్ని గడిస్తున్నారని చెప్పారు.
అల్జీరియాకు దిగుమతి చేసుకునే వంట నూనె, పంచదార, గోధుమ రవ్వ, ఇతర గోధుమ ఉత్పత్తులను తిరిగి ఎగుమతి చేయడం నిషేధమని, అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మద్జిద్ తబూన్ ఈ నెల మొదట్లో ప్రకటించారు.
అటువంటి చర్యలను ఆర్ధిక వినాశన చర్యల కింద పరిగణించి శిక్షించాలని అధ్యక్షుడు చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
కానీ, అల్జీరియాలో నెలకొన్న సరుకుల కొరతకు లోతైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మాఫియా దేశాన్ని దోచేసింది
అల్జీరియా ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి, ప్రభుత్వ రెవెన్యూకి క్రూడ్ ఆయిల్, గ్యాస్ అమ్మకాలపై ఆధారపడింది. ఇదే చాలా సమస్యలకు దారి తీసిందని ఆర్థికవేత్త అబ్ దాల్ రహ్మాన్ హదీఫ్ చెప్పారు.
ఇంధన రంగంలో సమాంతర మార్కెట్ లో చోటు చేసుకుంటున్న లావా దేవీలు, ఈ రంగాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం కూడా దేశ ఖజానాకు గండి పడటానికి కారణమని హదీఫ్ అభిప్రాయపడ్డారు.
దేశంలో నెలకొన్న ఆర్ధిక సమస్యలు మరింత రాజకీయ అనిశ్చితికి దారి తీస్తాయనే ఆందోళన కూడా ఉంది.
పెరుగుతున్న ధరల వల్ల ఇప్పటికే పాలకులకు, ప్రజలకు మధ్య బలహీనంగా ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం ఉందని సామాజికవేత్త ప్రొఫెసర్ రాషిద్ హమాదౌచ్ అన్నారు.
దేశంలో విస్తృతంగా తలెత్తిన నిరసనల వల్ల అల్జీరియా మాజీ అధ్యక్షుడు అబ్దెల్ అజీజ్ బౌటేఫ్లికా 2019లో పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది.
బౌటేఫ్లికా హయాంలో మాఫియా దేశ ఖజానాను దోచేసిందని ఆయన తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిన తబూన్ పదే పదే అంటారు.
దేశాధ్యక్షులు మారినప్పటికీ, దేశంలో యువత మాత్రం కొవిడ్ మహమ్మారి మొదలవ్వక ముందు వరకు నిరసనలు చేస్తూనే ఉన్నారు.
దేశంలో మూడొంతుల మంది జనాభా 37 సంవత్సరాల లోపు వారే. దేశంలో 11% నిరుద్యోగం నెలకొంది. చాలా మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు.
ఈ పరిస్థితికి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నెల నుంచి నిరుద్యోగులకు సుమారు రూ. 6800 నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించింది.
కానీ, గ్యాస్ మీద వచ్చే ఆదాయం ఒక్కసారిగా పడిపోతే ఆ పరిస్థితులను అల్జీరియా తట్టుకోలేదని, గత 20 సంవత్సరాలుగా ఆయిల్ రెవిన్యూ ద్వారా వచ్చిన లాభాలన్ని దీనితో తుడిచిపెట్టుకుపోతాయని ఆర్దిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి, సామర్ లాంటి వినియోగదారులు మాత్రం చవకగా సరుకులను కొనుక్కునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. షాపు యజమానులు ఏదో ఒక విధంగా తమకు వంట నూనెను ఇస్తారని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)